Hampi Virupaksha Swamy Temple
పరమశివుడు కొలువైన ప్రాచీనమైన క్షేత్రాలలో “హంపి” ఒకటి. కర్ణాటక రాష్ట్రం .. విజయనగర జిల్లా .. హోస్పెట్ కి సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. విజయనగర రాజులు హంపిని రాజధానిగా చేసుకుని తమ పాలనను కొనసాగించారు. అందువల్లనే హంపిని వాళ్లంత ప్రత్యేకమైన శ్రద్ధతో తీర్చిదిద్దారు. హంపి(Hampi) అప్పటి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ ఉంటుంది. అనేక ఆలయాల సమాహారంగా కనిపిస్తూ ఉంటుంది. చరిత్ర .. ఆధ్యాత్మికత పెనవేసుకుపోయి దర్శనమిస్తూ ఉంటుంది. తుంగభద్ర నదీ తీరంలోని ఈ ప్రాంతమే రామాయణ కాలంలో “కిష్కింద” అని చెబుతారు.
రామాయణంలో హనుమ .. సుగ్రీవులను రామలక్ష్మణులు కలుసుకున్నది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. అందుకు నిదర్శనంగా ఇక్కడి పర్వతాలు రామాయణంలోని పేర్లతోనే పిలవబడుతున్నాయి. రామాయణంతో ముడిపడిన ప్రదేశం అనగానే మనకి మరింత పవిత్రంగా అనిపిస్తుంది. రామాయణ దృశ్యాలు కళ్లముందు కదలాడతాయి. ఆ క్షేత్రమంతా తిరగడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ఏ ప్రాచీన క్షేత్రానికి వెళ్లినా అక్కడ కృష్ణదేవరాయల పేరు వినిపిస్తుంది. ఇక్కడ ఆయన తిరుగాడిన నేలపై నడవడమనేది మరో అనుభూతి.
ఇక్కడి తుంగభద్ర నదికి “పంపానది” అనే మరో పేరు ఉంది .. పంపా అనేది “హంపి” గా మారిందని అంటారు. పంపానది తీరంలోనే పార్వతీదేవి .. శివుడి కోసం తపస్సు చేసిందనీ అంటారు. అందువల్లనే ఇక్కడి అమ్మవారిని “పంపావతి”గా పూజిస్తూ ఉంటారు. స్వయంభువుగా ఇక్కడ ఆవిర్భవించిన పరమశివుడు, “విరూపాక్షుడు”గా(Hampi Virupaksha Temple) పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. విజయనగర రాజుల కులదైవమే ఈ విరూపాక్షుడు. అందువల్లనే స్వామి ఆలయానికి అంతటి ప్రత్యేకత .. ప్రాధాన్యత కనిపిస్తాయి.
విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర రాయలు – బుక్కరాయల నుంచి ఇక్కడి స్వామివారి వైభవం వెలుగొందుతూ వచ్చిందని చరిత్ర చెబుతోంది. వరాహ స్వరూపమైన విష్ణుమూర్తి ఇక్కడి క్షేత్రాన్ని సంరక్షిస్తూ ఉంటాడనే విశ్వాసం విజయనగర రాజుల కాలంలో బలంగా ఉండేది. అందువల్లనే వారి అధికార చిహ్నంలో “వరాహం” కనిపిస్తూ ఉంటుంది. మహ్మదీయులు హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తూ .. విరూపాక్ష స్వామి ఆలయానికి రాగా, రాజగోపురం నుంచి కొన్ని వేల వరాహాలు దూసుకురావడంతో, ప్రాణభయంతో వాళ్లంతా అక్కడి నుంచి పారిపోయినట్టుగా చెబుతారు.
హంపి ఇటు చారిత్రకంగాను .. అటు ఆధ్యాత్మికంగాను చూడవలసిన ప్రదేశం. విరూపాక్షస్వామి ఆలయంతో పాటు అనేక ఇతర దేవీ దేవతల మందిరాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఏకశిలా రథంతో పాటు అనేక మంటపాలు .. ఇతర నిర్మాణాలు అప్పటి శిల్పకళా వైభవానికి అద్దం పడతాయి. విజయనగర రాజుల కళాభిరుచిని ప్రతిబింబిస్తాయి. రాయలవారి కాలంలో పుట్టి ఉంటే ఎంతబాగుండునో కదా అనుకోకుండా అక్కడి నుంచి వెనుదిరిగి రాలేము. హంపి దర్శనం జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని .. చెదిరిపోని ఒక అందమైన ఙ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Hampi Virupaksha Temple