Sri Bhagavatam – Hiranyakasipu doubts about Prahlad’s orientation – Prahlad’s education
ప్రహ్లాదుడు నిరంతరం తన మనసులో హరినామ స్మరణ చేస్తూ ఉంటాడు. తన తోటి పిల్లలతో ఆడుకోకుండా .. ఎప్పుడూ భగవంతుడిని గురించిన ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ స్వామి లీలావిశేషాలు తలచుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. పిల్లలంతా తమకి కావలసినవి కొట్టుకుని మరీ తింటూ ఉంటే, ప్రహ్లాదుడు మాత్రం ఆకలి .. దప్పిక అనే మాటలు కూడా లేకుండా భగవంతుడి పట్లనే మనసును లగ్నం చేస్తూ ఉంటాడు. దాంతో ఆయనకి సమయానికి కావలసినవి లీలావతినే చూస్తూ ఉంటుంది.
హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడి ధోరణి సందేహాన్ని కలిగిస్తుంది. ఆడుకోవలసిన వయసులో ఆడుకోకుండా .. తన కుమారుడు దేని గురించిన ఆలోచన చేస్తున్నాడు? ఆ వయసులో అంతగా ఆలోచించవలసిన విషయాలు ఏముంటాయి? సాధువుల పట్ల .. గోవుల పట్ల అపారమైన ప్రేమానురాగాలను కనబరుస్తున్నాడు. దానవులకు ఉండవలసిన లక్షణం ఒక్కటీ అతనిలో కనిపించడం లేదు. ఆరోగ్య లోపమా అంటే అదీ కాదు .. దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే కుర్రవాడి ముఖం దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది అనుకుంటాడు.
రాజభవనంలో ఉండటం వల్లనే తన కుమారుడు మందబుద్ధితో మసలుతున్నాడని హిరణ్యకశిపుడు భావిస్తాడు. ప్రహ్లాదుడు తన తోటి పిల్లలతో కలవాలి .. వాళ్లతో ఆడాలి .. పాడాలి .. విద్యా బుద్ధులు నేర్చుకోవాలి. అందువలన అతనిని గురుకులానికి పంపించాలని నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా చేయడం వలన పిల్లవాడిలో ఒక చైతన్యమనేది ఉంటుంది. అతని బుద్ధి కాస్త చురుకుగా పనిచేస్తుంది. అందువలన అతనిని గురుకులానికి పంపించడమే మంచిదని భావిస్తాడు. ఆ విషయం లీలావతితో చెప్పి అందుకు అతనిని సిద్ధం చేయమని చెబుతాడు.
గురుకులం నుంచి శుక్రాచార్యుడి తనయులైన చండామార్కులవారిని పిలిపిస్తాడు. ప్రహ్లాదుడికి సమస్త శాస్త్రాలను బోధించమని చెబుతాడు. ముఖ్యంగా రాజనీతికి సంబంధించిన అన్ని విషయాలను అతనికి అర్థమయ్యేలా చెప్పమని అంటాడు. అతను అడిగే సందేహాలకు సహనంతో సమాధానాలు చెప్పమంటాడు. ఎప్పటికప్పుడు తనకి ప్రహ్లాదుడిలో మార్పు కనిపించాలని చెబుతాడు. విద్యను బోధించే విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోను అలసత్వమును చూపరాదని అంటాడు. ప్రహ్లాదుడికి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించి గురుకులానికి పంపిస్తాడు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.