Sri Bhagavatam – Hiranyakasipu’s anger against Prahlad
గురువులు ఎంతగా చెప్పినా ప్రహ్లాదుడు హరినామం విడువడు .. హరిని కీర్తించడం మరువడు. అంతేకాదు తోటి పిల్లలకు హరినామ స్మరణలో తీయదనం గురించి ప్రహ్లాదుడు చెబుతాడు. దాంతో వాళ్లంతా హరినామస్మరణ చేయడం మొదలుపెడతారు. గురుకులంలో వాళ్లంతా హిరణ్యకశిపుడి నామస్మరణ కాకుండా, హరినామ సంకీర్తనలో తేలిపోతుంటారు. చండామార్కులవారు కంగారుపడిపోతాడు. ఈ విషయం ఇతరుల ద్వార తెలుసుకుని, హిరణ్యకశిపుడు తమని దండించడం కంటే, తామే ఆయన దృష్టికి తీసుకెళ్లడం మంచిదని నిర్ణయించుకుంటారు.
ఒక రోజున ప్రహ్లాదుడిని వెంటబెట్టుకుని హిరణ్యకశిపుడి మందిరానికి వెళతారు. వాళ్లను చూడగానే విషయమేమిటని హిరణ్యకశిపుడు అడుగుతాడు. ప్రహ్లాదుడితో హరినామం మానిపించారా? విద్యాభ్యాసం సక్రమంగా సాగుతుందా? అని అడుగుతాడు. దాంతో చండామార్కుల వారు తమని మన్నించమని కోరతారు. ప్రహ్లాదుడితో హరినామ స్మరణ మానిపించడం తమ వలన కావడం లేదని చెబుతారు. గురుకులంలో మిగతా పిల్లలకు ఆయన హరినామ వైభవం గురించి చెప్పి చెడగొడుతున్నాడని అంటారు.
ప్రహ్లాదుడికి తాము ఎన్నిరకాలుగా చెప్పాలో చెప్పామనీ, ఎన్ని విధాలుగా నచ్చజెప్పాలో అన్ని విధాలుగానూ నచ్చజెప్పామని అంటారు. తాము చెబుతున్నప్పుడు అర్థమైనట్టుగా తలాడిస్తున్నాడనీ, ఆ వెంటనే హరినామ స్మరణ అందుకుంటున్నాడని చెబుతారు. సమస్త వేదాల సారం .. సకల శాస్త్రాల సారం భక్తి జ్ఞాన వైరాగ్యాలను సూచిస్తోందనీ, ఆ మార్గంలో నడిపించేవాడు .. ముక్తిమార్గంలో తన సన్నిధికి చేర్చుకొనువాడు ఒక్క నారాయణుడేనని వాదిస్తున్నాడని అంటారు.
ప్రహ్లాదుడిని ఇంకా కొంతకాలం పాటు గురుకులంలోనే ఉంచితే, రాజ్యంలోని వాళ్లందరితో హరినామ స్మరణ చేయించగలడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అందువలన తమని దండించకుండా ప్రహ్లాదుడి విషయంలో తగిన నిర్ణయం తీసుకోమని అంటారు. గురువులుగా ప్రహ్లాదుడికి తాము ఒక స్థాయివరకు మాత్రమే చెప్పగలమనీ, అందువలన ప్రహ్లాదుడి మనసు మార్చగలిగేది తండ్రిగా ఆయన ఒక్కరేనని చెబుతారు. ప్రహ్లాదుడి విషయంలో తాను ఎంత సహనంతో ఉన్నప్పటికీ, అతనిలో మార్పు రాకపోవడం హిరణ్యకశిపుడికి ఆగ్రహావేశాలను కలిగిస్తుంది.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.