Penchalakona – Sri Penusila Lakshmi Narasimha Swamy Temple

లోక కల్యాణం కోసం హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామి, ఆ ఉగ్రత్వంతోనే అనేక ప్రదేశాలలో తిరుగాడినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలా అడవీ ప్రాంతంలో సంచరిస్తూ .. లక్ష్మీదేవి అంశావతారమైన చెంచులక్ష్మిని వివాహమాడినట్టుగా చెబుతారు. ఆ ఘటన జరిగిన ప్రదేశమే “పెంచలకోన” అని అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ – రాపూర్ మండలం పరిధిలో వెలుగొందుతోంది. స్వామివారు కొండపై ఉండటం వలన “పెనుశిల నారసింహుడు” అని పిలిచేవారనీ, కాలక్రమంలో అదే పెంచలకోన అయిందని చెబుతారు. ఇక “చెంచులకోన”యే పెంచలకోనగా మారిందనే మారి మాట కూడా వినిపిస్తూ ఉంటుంది.

ఎత్తైన గోపురం .. పొడవైన ప్రాకారాలు .. తీర్థాలు కలిగిన ఈ క్షేత్రంలో స్వామివారు పెంచలయ్య పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ప్రత్యేకమైన మరో ఆలయంలో అమ్మవారు చెంచులక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. పురాణకాలం నుంచి స్వామివారు దేవతలతో .. మహర్షులతో పూజలు అందుకున్నారు. ఆ తరువాత స్వామివారు ఈ కొండపై పశువులను మేపడానికి వచ్చిన ఒక కుర్రవాడి ద్వారా తన జాడను గ్రామస్తులకు తెలియజేసినట్టుగా స్థలపురాణం చెబుతోంది. అప్పటి నుంచి లక్ష్మీనరసింహ స్వామికి నిత్య పూజలు మొదలయ్యాయని అంటారు.

స్వామివారు ఆవిర్భవించిన ఈ కొండను వెలికొండ అంటారు .. అంటే వేరు చేయబడిన .. వెలివేయబడిన కొండ అని అర్థం. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు .. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు హనుమంతుడు సంజీవని మొక్కని ఇక్కడి పర్వతంపై చూసి దానిని పెకిలించడానికి ప్రయత్నించగా కొంతభాగం విరిగిపోయి పర్వతం నుంచి వేరు చేయబడిందట. ఆ పర్వతభాగమే ఇది .. అందువల్లనే దీనిని వెలికొండ అని పిలుస్తుంటారు. హనుమంతుడే ఇక్కడ క్షేత్రపాలకుడు .. ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

ఈ కారణంగానే ముందుగా హనుమను దర్శించిన తరువాతనే, ప్రధాన దైవమైన పెంచలయ్యను దర్శించుకుంటారు. విశేషమైన పర్వదినాల్లో ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రాత్రివేళలో దేవతలు .. మహర్షులు స్వామివారి దర్శనం చేసుకుంటారని చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ ఎంతోమంది అనుభవాలు వినిపిస్తూ ఉంటాయి. ఎంతోమంది రాజులు ఇక్కడి స్వామిని తమ ఇలవేల్పుగా భావించి తరించారు. అలాగే ఎంతోమంది మహా భక్తులు .. కవి గాయకులు స్వామివారిని కీర్తించారు.

ప్రతి యేటా వైశాఖ శుద్ధ ద్వాదశి నుంచి మొదలై 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకోవడం వలన దుష్ట శక్తుల పీడలు .. గ్రహసంబంధమైన బాధలు తొలగిపోతాయనీ, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని విశ్వసిస్తుంటారు. నరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలలో ఇది ఒకటిగా కనిపిస్తుంది. తప్పకుండా దర్శించుకోవలసిన క్షేత్రాలలో ఇది ఒకటని చెప్పచ్చు.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.