Vellore – Jalakandeswarar Temple

అమృతం కోసం క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. లోక కల్యాణం కోసం పరమశివుడు ఆ విషాన్ని నేరేడుపండు పరిమాణంలోకి మార్చేసి దానిని కంఠము నందు నిలిపి ఉంచాడు. ఆ విష ప్రభావం వలన స్వామివారి కంఠం నీలం రంగులోకి మారింది. అందువల్లనే ఆయనను నీలకంఠుడిగా కొలుస్తుంటారు. ఆ విషం ప్రభావాన్ని తట్టుకోవడం కోసమే శివుడు తలపై గంగమ్మను .. చంద్రుడిని పెట్టుకున్నాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఆ వేడిని తట్టుకోవడానికే స్వామి అభిషేకాన్ని కోరుకుంటాడని చెబుతారు.

ఈ కారణంగానే శివుడికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉపశమనం కోసమేనేమో స్వామి సగభాగం జలంలోనే ఆవిర్భవించి పూజలు అందుకుంటూ ఉండే క్షేత్రంగా “వెల్లూర్” కనిపిస్తుంది. తమిళనాడులోని వెల్లూర్ జిల్లా కేంద్రంలోని కోట ప్రదేశంలో ఈ క్షేత్రం వెలుగొందుతూ ఉంటుంది. తమిళనాడులోని ప్రాచీనమైన .. సువిశాలమైన ఆలయాలలో ఇది ముందువరుసలో కనిపిస్తుంది. స్వామివారి సగభాగం నీటిలోనే ఉండటం వలన “జలకంఠేశ్వరస్వామి”గా భక్తులు పూజిస్తుంటారు. అమ్మవారికి అఖిలాండేశ్వరిగా ఆరాధనలు జరుగుతుంటాయి.

ఇక్కడ స్వామివారు ఎలా ఆవిర్భవించారు? ఇంతటి ఆలయ నిర్మాణం ఎలా జరిగింది? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. పూర్వం ఒక భక్తుడు ఈ ప్రదేశంలో ఆవులను మేపుతూ .. ఆ మందలోని ఒక ఆవు పుట్టలో పాలధారలను కురిపించడం చూశాడు. ఆవు తనంతట తానుగా పాలధారలను కురిపించడం చూసి ఆశ్చర్యపోయిన ఆయన, ఆ విషయాన్ని గురించిన ఆలోచన చేస్తూ ఇంటికి చేరుకున్నాడు. ఆ రాత్రి సదాశివుడు స్వప్నంలో కనిపించి, ఆ పుట్టలో ఉన్న తనకి ఆలయాన్ని నిర్మించమనీ .. అందుకు సంబంధించిన ధనం ఆ పుట్టలోనే ఉందని చెప్పాడట.

మరునాడు ఉదయమే ఆ భక్తుడు ఆ పుట్టాను కరిగించి చూడగా, లోపల సగభాగం నీటిలో ఉన్న శివలింగం కనిపించింది. ఆ పుట్టలోనే అపారమైన ధనం కనిపించింది. ఆ సంపదతో అతను స్వామివారికి ఆలయాన్ని నిర్మించి .. ఆ ఆలయం చుట్టూ ఒక పెద్ద కోటను నిర్మించాడు. అప్పటి నుంచి నిత్యపూజలు మొదలయ్యాయి. 100 ఎకరాలకిపైగా గల ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని చూడటానికి రెండూ కళ్లు చాలవనిపిస్తుంది. ఆలయంలోని శిల్పకళ ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు స్వామివారి వైభవానికి దర్పణం పడుతుంటాయి.

ఎంతోమంది రాజులు ఇక్కడి స్వామిని ఆరాధించారు .. ఆయన సేవలో తరించారు. మరెంతో మంది భక్తులు ఆ స్వామిని కీర్తించారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన అనారోగ్యాలు .. అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. గ్రహసంబంధమైన దోషాల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతుంటారు. సంతాన .. సౌభాగ్యాలు నిలుస్తాయని అంటారు. మహా శివభక్తులైన 63 మంది నాయనార్ల మూర్తులను ఇక్కడ చూడటం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. కార్తీక మాసంలోను .. శివరాత్రి పర్వదినం రోజున ఈ క్షేత్ర వైభవాన్ని చూసితీరవలసిందే.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.