Jamalapuram Sri Venkateswara Swamy Temple

వేంకటేశ్వరస్వామి తన భక్తులను అనుగ్రహించడం కోసం ఆవిర్భవించిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. తన భక్తులు తన దగ్గరకి రాలేని పరిస్థితుల్లో తానే వారి దగ్గరికి వెళ్లి వెలసిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. తన భక్తుల కోరికను మన్నించి వారి వెంట నడచిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటిగా “జమలాపురం”(Jamalapuram) కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. స్వామివారు ఇక్కడ సాలిగ్రామశిలగా పూజాభిషేకాలు అందుకుంటుంటున్నాడు.

పూర్వం ఇక్కడి కొండని “సూచీగిరి”గా పిలిచేవారు. అప్పట్లో జాబాలి మహర్షి ఈ కొండపై తపస్సు చేసుకునేవాడని స్థలపురాణం చెబుతోంది. జాబాలి మహర్షి ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని కొంతకాలం పాటు నివసించిన కారణంగా ఈ ప్రాంతాన్ని “జాబాలపురం” అని పిలిచేవారు. కాలక్రమంలో అదే “జమలాపురం”గా(Jamalapuram) మారింది. కొండపై ఉన్న స్వామివారి మూర్తి జాబాలి మహర్షి ప్రతిష్ఠించినదిగా చెబుతారు. స్వామివారి కైంకర్యాల కోసం ఆయన ఏర్పాటు చేసిన కోనేరు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది.

6వ శతాబ్దంలో ఈ క్షేత్రం వెలుగులోకి రాగా, ఆ తరువాత కాలంలో ప్రతాపరుద్రదేవుడు ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. విజయనగర రాజుల కాలంలోను ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. కృష్ణదేవరాయలవారు ఈ ఆలయాన్ని దర్శించినట్టు .. పునరుద్ధరణ పనులు ఆయన చేతుల మీదుగా జరిగినట్టుగా చెబుతారు. అలా స్వామివారికి నిత్యపూజాలు జరుగుతున్న సమయాంలోనే “అక్కుభట్టు” అనే అర్చకుడు వయసైపోయిన కారణంగా కొండపైకి వెళ్లడం ఇబ్బందిగా ఉండేది. ఒక రోజున ఆ అర్చకుడు “స్వామీ ఇక నేను కొండపైకి రాలేను .. నా పూజలు .. నైవేద్యాలు కావాలంటే నాతో పాటు క్రిందికి దిగిరా” అన్నాడట.

అందుకు అంగీకరించిన స్వామివారు అర్చకుడిని అనుసరిస్తూ క్రిందివరకూ వచ్చి అక్కడ సాలిగ్రామశిలగా ఆవిర్భవించాడని చెబుతారు. ఇలా స్వామివారు ఈ క్షేత్రంలో మహర్షి అభ్యర్థనను .. భక్తుడి కోరికను మన్నించడం కనిపిస్తుంది. మహాభారతకాలంలో తనకి అస్త్రశస్త్రాలు అవసరమైనప్పుడు అర్జునుడు ఈ కొండపై కొంతకాలం పాటు తపస్సు చేశాడని చెబుతారు. అందువలన ఇక్కడి స్వామివారిని దర్శించుకుని ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా అది విజయవంతమవుతుందనేది భక్తుల విశ్వాసం.

ఆ తరువాత కాలంలోను ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రభువులు ఈ క్షేత్రం విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపలేదని అంటారు. ఆలయ అభివృద్ధిలో ఎవరికి వారు తమదైన పాత్రను పోషిస్తూ వచ్చారు. ఆలయ ప్రాచీనతను .. పవిత్రతను కాపాడుతూ వచ్చారు. స్వామివారితో పాటు ప్రత్యేకమైన మందిరాలలో కొలువైన అమ్మవార్లు కూడా పూజలు అందుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ప్రాంగణంలో ఉపాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. విశేషమైన పర్వదినాల్లో ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Jamalapuram Sri Venkateswara Swamy Temple