శుక్రాచార్యుడి దగ్గరికి తాను వచ్చిందే “మృతసంజీవిని” మంత్రాన్ని నేర్చుకోవడం కోసం. కేవలం మంత్రాన్ని నేర్చుకోవాలనే స్వార్థంతో కాకుండా ఎంతో గురుభక్తితోనే ఆయనను తాను సేవించాడు. తనపై గల నమ్మకంతోనే ఆయన తనకి ఆ మంత్రం చెప్పాడు. అలాంటి మంత్రం తనకి ఉపయోగపడకుండా పోవాలని దేవయాని శపించడంతో ఆయన నివ్వెరపోతాడు. ఆ మంత్రం తన కొరకు పనిచేయదని ఆమె శపించినా తాను బాధపడటం లేదని అంటాడు. తన నుంచి మంత్రోపదేశం పొందినవాళ్లు ఇతరులకు ఉపయోగిస్తే అంతే చాలని చెబుతాడు.
అంతేకాదు .. ఒక స్త్రీకి ఇంతటి అహంభావం తగదని కచుడు చెబుతాడు. గురుపుత్రిక అయిన ఆమె మరింత సున్నితమైన మనసును కలిగి ఉండాలని అంటాడు. లేదంటే భవిష్యత్తులో ఆమె ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనీ, మనశ్శాంతికి దూరం కావలసి వస్తుందని చెబుతాడు. వివాహం విషయంలో పట్టింపులు లేకుండగా ప్రవర్తించినందుకుగాను, ఆమె బుద్ధికి తగినట్టుగానే బ్రాహ్మణుడితో మాత్రం వివాహం కాదని ప్రతిశాపం ఇస్తాడు. ఆ తరువాత కచుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను వెళుతున్న వైపుకే దేవయాని చూస్తుండిపోతుంది.
అలా గతంలో తనకి కచుడు ఇచ్చిన శాపాన్ని గురించి యయాతికి దేవయాని వివరిస్తుంది. ఆ శాపం కారణంగా తనకి బ్రాహ్మణుడితో వివాహం కాదని అంటుంది. అందువలన ఆ విషయాన్ని గురించిన ఆలోచన చేయకుండా తనని చేపట్టమని కోరుతుంది. దేవయాని గతం గురించి విన్న తరువాత మనసు మార్చుకున్న యయాతి ఆమెను ప్రకృతి సాక్షిగా వివాహం చేసుకుంటాడు. భార్యగా ఆమెను స్వీకరించి ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటాడు. ఆ తరువాత దేవయాని తన మందిరానికి చేరుకుంటుంది.
దేవయాని అదోలా ఉండటం చూసిన శుక్రాచార్యుడు, విషయమేమిటని అడుగుతాడు. దాంతో వనవిహారానికి వెళ్లినప్పుడు జరిగిన సంఘటనను తండ్రికి చెబుతుంది. తనని శర్మిష్ఠ నలుగురిలో అవమానపరిచిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ అవమానభారాన్ని తాను తట్టుకోలేకపోతున్నానని చెబుతుంది. ఆయన స్థానాన్ని గురించి శర్మిష్ఠ చాలా తక్కువగా మాట్లాడిందనీ, ఆ బాధ తనని దహించి వేస్తుందని అంటుంది. జరిగిన సంఘటన తనని నిలువునా కాల్చేస్తోందని చెబుతుంది. దాంతో శుక్రాచార్యుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.