కృష్ణుడిని చూడగానే “కాలయవనుడు” ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తన వరబలం .. భుజబలం సంగతి తెలియక కృష్ణుడు ఒంటరిగా రావడం చూసి నవ్వుకుంటాడు. ఇతర అసురులను సంహరించినంత తేలికగా తనని మట్టుపెట్టగలననే నమ్మకంతో అతను వస్తుండవచ్చని భావిస్తాడు. ఒక్కసారి తన శౌర్య పరాక్రమాలను రుచి చూపిస్తే, ఇకపై తనని తలచుకోవడానికి కూడా భయపడతాడని అనుకుంటాడు. కృష్ణుడు తన సమీపానికి వస్తుండగానే, ఒక్కసారిగా ఖడ్గాన్ని దూస్తాడు.

అది చూసిన కృష్ణుడు ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టుగా నటించి అక్కడి నుంచి పరుగు అందుకుంటాడు. భయంతో కృష్ణుడు అలా పారిపోతుండటం చూసి కాలయవనుడు పకపకా నవ్వుతాడు. కృష్ణుడు మహావీరుడు .. ఎంతోమంది అసురులను సంహరించాడని తెలిసి, అతనితో యుద్ధం చేయాలని తాను ముచ్చటపడి వస్తే, అతను ఇలా పారిపోతుండటం కాలయవనుడికి నవ్వు తెప్పిస్తుంది. ఎంతో దూరం నుంచి వచ్చిన తను ఆ ముచ్చట తీరకుండా వెనుదిరగకూడదనుకుని కృష్ణుడిని అనుసరిస్తాడు.

కాలయవనుడు తన వెంటపడుతుండటంతో మరింత భయాన్ని నటిస్తూ కృష్ణుడు పరిగెడుతుంటాడు. ఆయన ఎంతగా భయపడుతుంటే అంతగా కాలయవనుడు ఆనందంతో పొంగిపోతుంటాడు. ఒక్కసారి తనతో యుద్ధం చేయమనీ, తనని వీరుడిగా అంగీకరించమని కోరుతూ కృష్ణుడి వెంటే కాలయవనుడు కూడా పరిగెడుతుంటాడు. అయినా ఆగకుండా కృష్ణుడు పరిగెడుతూనే ఉంటాడు. అక్కడక్కడా ఆగి వెనక్కి తిరిగి చూస్తూ, కాలయవనుడు కాస్త దగ్గరికి రాగానే మళ్లీ పరిగెడుతూ ఉంటాడు. ఆయనను అనుసరించలేక కాలయవనుడు ఆయాసపడుతూ ఉంటాడు.

ఇంత పిరికివాడినా అంతా మహా వీరుడు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఇంత భయస్తుడి చేతిలోనా అసురులు అసువులు విడిచింది అనుకుంటాడు. ఏదేమైనా ఈ కృష్ణుడిని పట్టుకుని .. ఒక్కసారైనా కత్తి కలిపి ఆయనను ఓడించాననే సంతృప్తితోనే తాను వెనుదిరగాలి .. లేదంటే జీవితాంతం ఈ అసంతృప్తి ఇలా వెంటాడుతూనే ఉంటుంది అనుకుంటూ మళ్లీ పరుగు వేగాన్ని పెంచుతాడు కాలయవనుడు. అతనికి అందినట్టుగానే అంది .. తప్పించుకుని మళ్లీ పరుగందుకుంటూ ఉంటాడు కృష్ణుడు. ఇలా వాళ్లు చాలాదూరం పరిగెడతారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.