బలరామకృష్ణుల చేతిలో ఓడిపోయిన జరాసంధుడు, ఎప్పటికప్పుడు ఇతర రాజులతో మైత్రి చేసుకుని వాళ్లతో కలిసి మధురపై దండెత్తేవాడు. అలా జరాసంధుడు వరుసగా దండయాత్రలు చేయడం .. కృష్ణుడు అతనిని తప్ప మిగతావారిని కడతేర్చడం జరుగుతూ రాసాగింది. ఇలా తరచూ జరుగుతూ రావడంతో, యాదవ సైన్యం కూడా పెద్ద సంఖ్యలో నశించసాగింది. దాంతో సముద్ర మధ్య ప్రాంతంలో “ద్వారకా నగరం” నిర్మించాలని కృష్ణుడు నిర్ణయించుకుంటాడు. అక్కడైతే జరాసంధుడి దాడుల వలన ప్రజల ప్రాణాలకి భయం ఉండదని భావిస్తాడు.

అనుకున్నదే తడవుగా “విశ్వకర్మ”ను రప్పించి ద్వారక నగర నిర్మాణ పనులను ఆయనకు అప్పగిస్తాడు. అత్యంత సుందరంగా ద్వారకా నగరం నిర్మించాలనే ఉద్దేశంతో విశ్వకర్మ రంగంలోకి దిగుతాడు. మంచి ముహూర్తం చూసుకుని ఆయన ద్వారకా నగర నిర్మాణ పనులను ఆరంభిస్తాడు. అలా చకచకా ఆ పనులు జరుగుతుంటాయి. ఒక వైపున ద్వారకా నగర నిర్మాణం జరుగుతూ ఉండగా కూడా జరాసంధుడు యుద్ధానికి రావడం .. ఓడిపోయి ఒంటరిగా తిరిగి వెళ్లడం చేస్తుంటాడు. ఆ మరుసటి రోజు నుంచే మళ్లీ సైన్యాన్ని కూడగట్టడం మొదలుపెడుతుంటాడు.

కృష్ణుడి వీరత్వం గురించి “కాలయవనుడు”కి తెలుస్తుంది. తనని మించిన వీరుడు లేడనే అహంభావంతో ఉన్న కాలయవనుడు, కృష్ణుడి ధైర్యసాహసాలను గురించి వింటాడు. కృష్ణుడిని చూడాలనీ, ఆయనతో యుద్ధం చేయాలని భావిస్తాడు. కంసుడిని హతమార్చిన కృష్ణుడు .. జరాసంధుడిని పలుమార్లు ఎదుర్కున్న కృష్ణుడు నిజంగానే మహావీరుడయ్యే ఉంటాడు. అలాంటి వీరుడు మిడిసిపడుతుండటం సహజంగా జరుగుతూ ఉంటుంది. తాను ఉండగా అలా జరగకూడదు. తాను ఉన్నాననే ఒక భయం అలాంటివాళ్లకు ఉంటూనే ఉండాలి అనుకుంటాడు.

అలాంటి ఆలోచన రాగానే కాలయవనుడు .. కృష్ణుడిని ఎదిరించడమే ధ్యేయంగా కదలమని తన సైనిక బలగాలను ఆదేశిస్తాడు. కాలయవనుడి సైనిక బలగాలు మధుర పొలిమేరలను చేరుకుంటాయి. యాదవుల చేతిలో మరణం లేకుండా వరాన్ని పొందిన కాలయవనుడిని తెలివిగా అంతం చేయాలని కృష్ణుడు నిర్ణయించుకుంటాడు. మరుక్షణమే కాలయవనుడు తన సైన్యంతో విడిది చేసిన ప్రదేశానికి ఒంటరిగా చేరుకుంటాడు. కృష్ణుడు ఎలాంటి ఆయుధాలు చేతపట్టక ఒంటరిగా తనవైపుకు వస్తుండటం చూసిన కాలయవనుడు ఆశ్చర్యపోతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.