Kanchi Kamakshi Ammavari Temple
కంచి కామాక్షి .. మధుర మీనాక్షి .. బెజవాడ కనకదుర్గమ్మ .. అనే మూడు నామాలను విననివారు ఉండరు. ఆదిపరాశక్తి అనేక రూపాలలో ఆవిర్భవించినప్పటికీ, ఈ మూడు రూపాలలో ఆమె భక్తజనకోటికి మరింత చేరువైంది. అమ్మలగన్న అమ్మగా ఆ భక్తులను అనుగ్రహిస్తూ వారిచే పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. లోక కంటకులైన ఎంతోమంది అసురులను సంహరించిన అమ్మ .. తన భక్తులను తన బిడ్డలవలె రక్షిస్తూ ఉంటుంది. అలా అమ్మవారు ఆవిర్భవించిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాలలో “కంచి” ఒకటిగా అలరారుతోంది.
కంచిని .. కాంచీ అనీ .. కాంచీపురం అని పిలుస్తుంటారు. అయోధ్య .. మధుర .. హరిద్వార్ .. కాశి .. ఉజ్జయిని .. ద్వారక .. కంచి సప్త మోక్షపురాలుగా చెబుతారు. సప్త మోక్షపురాలలో ఒకటైన కంచి, తమిళనాడు రాష్ట్రంలోని విశేషమైన క్షేత్రాలలో ఒకటిగా “పలార్” నది ఒడ్డున విలసిల్లుతోంది. పరమేశ్వరుడికి “కాశీ” ఎలాగో .. అమ్మవారికి “కంచి” అలాగ అని చెబుతుంటారు. ఇక్కడి అమ్మవారు కామాక్షిదేవిగా పూజలు అందుకుంటూ ఉంటుంది. ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నా తన భక్తులను అమ్మవారు తన కంటి చూపులతోనే కాపాడుతూ ఉంటుందని స్థలపురాణం చెబుతోంది.
కంటి చూపులతోనే భక్తుల కోరికలను నెరవేర్చు అమ్మవారు కనుకనే అంతా కూడా కామాక్షి అని పిలుచుకుంటూ ఉంటారు. కంచి అనగానే ఎత్తైన గోపురాలు .. పొడవైన ప్రాకారాలు .. విశాలమైన మంటపాలు .. ఉపాలయాలు కళ్లముందు కదలాడతాయి. గర్భాలయంలో అమ్మవారు నాలుగు చేతులతో .. యోగముద్రలో .. పద్మాసనంలో దర్శనమిస్తుంది. అమ్మవారి పై రెండు చేతులలో పాశం .. అంకుశం, క్రింది రెండు చేతులలో చెరకుగడ .. తామరపువ్వు ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారి ఒక భుజంపై రామచిలుక కనిపిస్తుంది.
ఇక్కడి అమ్మవారు మహా శక్తి స్వరూపిణి అనడానికి నిదర్శనంగా ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం బంధకాసురుడు అనేవాడు లోక కంటకుడిగా మారడంతో ఇంద్రాది దేవతలు పరమశివుడికి మొరపెట్టుకున్నారట. కంచిలోని అమ్మవారు మాత్రం ఆ అసురిడిని సంహరించగలదని శివుడు చెప్పడంతో ఆ తల్లిని శరణు కోరారు. అప్పుడు అమ్మవారు ఉగ్రరూపిణియై ఆ అసురిడిని అంతం చేసింది. అయితే అమ్మవారు అలా కోపంగా ఉండటాన్ని గమనించిన ఆది శంకరులవారు ఆ తల్లిని శాంతిపజేశాడని అంటారు.
ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన పల్లవుల మొదలు .. చోళులు .. విజయనగర రాజులు ఆలయ వైభవానికి తమవంతు కృషి చేశారనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి పరమేశ్వరుడు ఏకామ్రేశ్వరుడుగా పూజలు అందుకుంటూ ఉంటాడు. పూర్వం ఇక్కడి మామిడి చెట్టు క్రిందనే స్వామివారి కోసం అమ్మవారు తపస్సు చేసిందని చెబుతారు. మాఘమాసంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వివాహం .. సంతాన సౌభాగ్యాలను కోరుకునేవారు అమ్మవారి దర్శనాన్ని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఆ తల్లి అనుగ్రహ వర్షాన్ని కోరుతూ ఉంటారు.
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి