Sri Bhagavatam – Story of Hiranyakashipu and wife Lilavathi

హిరణ్యకశిపుడు తన సోదరుడైన హిరాణ్యాక్షుడిని శ్రీమహావిష్ణువు హతమార్చాడనే విషయం తెలిసి ఆగ్రహావేశాలకు లోనవుతాడు. శ్రీమహావిష్ణువు అంతుచూడవలసిందేననే నిర్ణయానికి వస్తాడు. అయితే అందుకు తగిన శక్తిని పెంచుకోవడమే కాకుండా, మరణం లేని వరాన్ని పొందాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం వనాలకు తరలిపోయి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడం మొదలుపెడతాడు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసి ఆయన తపస్సుకు భంగం కలిగించాలని భావిస్తాడు. అందుకోసం ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి.

బ్రహ్మదేవుడి అనుగ్రహాన్ని కోరుతూ హిరణ్యకశిపుడు కఠోర తపస్సు చేస్తూనే ఉంటాడు. మండే ఎండలు .. భయంకరమైన వడగాలులు .. చలిగాలులు .. వానలు ఆయన తపస్సుకు భంగం కలిగించలేకపోతాయి. అలాంటి పరిస్థితుల్లోనే నారద మహర్షి .. లీలావతిని కలుసుకుంటాడు. తన భర్త తపస్సుకు అని చెప్పి వెళ్లి .. తిరిగిరాని విషయాన్ని చెబుతూ ఆమె ఆందోళన వ్యక్తం చేస్తుంది. హిరణ్యకశిపుడు సామాన్యుడు కాదనీ, ఆయన గురించి దిగులు చెందవలసిన అవసరం లేదని నారద మహర్షి ఆమెకి ధైర్యం చెబుతాడు.

మనసు ఆందోళన చెందుతున్నప్పుడు హరినామ స్మరణ ఔషధంలా పనిచేస్తుందని నారద మహర్షి చెబుతాడు. అందువలన తాను నారాయణ నామం చెబుతూ ఉంటాననీ .. ఆ నామాన్ని పలకమని చెప్పడం మొదలు పెడతాడు. నారద మహర్షి నారాయణ నామం చెబుతూ ఉంటే, ఆమె ఆ నామం పలుకుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రహ్లాదుడు ఆ నామాన్ని వింటాడు. నారద మహర్షి తనకి బోధిస్తున్నట్టుగా ఆ శిశువు ఆ నామానికి దాసుడైపోతాడు. అంతగా ఆ నామం అతని మనసుకు పడుతుంది.

సమస్త విశ్వాన్ని రక్షించువాడు .. సకల జీవరాశిని పోషించువాడు నారాయణుడు. జీవితంలో సిరి సంపదలు .. వాటి ద్వారా లభించే సుఖాలు .. భోగాలు అశాశ్వతాలు. శరీరాన్ని ఎన్నివిధాలుగా .. ఎన్ని రకాలుగా సుఖపెట్టిననూ అది వెంట రాదు. అశాశ్వతమైన శరీరం కట్టెల్లో కాలిపోవలసిందే. అధికారాలు .. ఆడంబరాలు అన్నీ తాత్కాలికమే. ఆ మాయ నుంచి బయటపడేసేది .. మోక్షాన్ని ప్రసాదించేది శ్రీహరి నామస్మరణమే అంటూ నారద మహర్షి చెప్పిన మాటలు లీలావతి గర్భంలోని శిశువుకు వంటబడతాయి.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి