పూర్వం ఒక రాజ్యంలోని ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఒక్కగానొక్క కూతురు పేరే “నిష్ఠుర”. ఊళ్లో పూజాది కార్యక్రమాలను జరిపించడం వలన వచ్చే డబ్బుతో ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతాడు. యవ్వనంలోకి అడుగుపెట్టిన నిష్ఠుర, ఓ అందమైన సౌందర్య శిల్పంలా తయారవుతుంది. ఆమె అందచందాలను గురించి చుట్టుపక్కల గ్రామాలవారు సైతం చెప్పుకునేవారు. ఆమె ఎంత అందమైనదో అంత కఠినమైనది.

ఇతరుల పట్ల ఆమె చాలా కటువుగా వ్యవహరిస్తూ ఉండేది. అందువలన ఊళ్లో వాళ్లంతా ఆమెను “కర్కశ” అని చెప్పుకుంటూ ఉండేవారు. ఆమె అందానికి దాసులైనవారు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఇతరులను ఆకర్షించే అందం తన సొంతం అన్నట్టుగానే ఆమె ప్రవర్తిస్తూ ఉండేది. ఆమె స్వభావం మంచిది కాకపోవడంతో, పర పురుషులతో పరిచయాలు పెరుగుతుండేవి. తన కూతురు గురించి నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉండటంతో, ఆ బ్రాహ్మణుడు ఆమెకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు.

అలా “మిత్రవర్మ” అనే యువకుడితో “కర్కశ” పెళ్లి అవుతుంది. మిత్రవర్మ మంచి ఆరోగ్యవంతుడు .. అందగాడు. అంతేకాదు గుణవంతుడు .. శాంత స్వభావుడు. అందువలన కర్కశ దార్లో పడుతుందని తండ్రి భావిస్తాడు. మిత్రవర్మ తల్లిదండ్రులు కూడా కర్కశను కూతురుగానే భావించి ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. అయితే తన చుట్టూ ఉన్న వాళ్లంతా మంచివారే అయినప్పటికీ, ఆమె స్వభావంలో మార్పేమీ రాదు. గతంలో పరపురుషులతో తనకి గల సంబంధాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో అత్తామామలుగానీ .. భర్తగాని ఆమెను నియంత్రించలేకపోతారు.

ఊళ్లో తన తండ్రికి గల పేరు ప్రతిష్ఠలను గురించిగానీ .. అత్తగారింటి కుటుంబ గౌరవం గురించిగాని ఆమె ఎంతమాత్రం ఆలోచన చేయదు. తన మనసుకు తోచినట్టుగా ఆమె నడచుకుంటూ ఉంటుంది. ఊళ్లో తమ కుటుంబానికి గల పరువు కారణంగా మిత్రవర్మ చాలావరకూ సహిస్తూ వచ్చేవాడు. సహనం నశించినప్పుడు మాత్రం ఆమెను మందలిస్తూ ఉండేవాడు. కొడుకు .. కోడలు విషయంలో తలదూరిస్తే గొడవ మరింత పెద్దది అవుతుందని అత్తామామలు భరిస్తూ ఉండేవారు. ఇది కర్కశ మరింత అలుసుగా తీసుకుంది.

కర్కశ ధోరణి శ్రుతి మించుతూ వెళుతోంది .. అప్పటికే మిత్రవర్మ గౌరవ మర్యాదలు మట్టిలో కలిసిపోయాయి. ఆయన నిస్సహాయుడిగా చూస్తుండిపోతాడు. అయినా అతను తమకి అడ్డుగా ఉన్నాడనే విషయం పట్ల పరపురుషులు తరచూ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవారు. దాంతో తన భర్తను అడ్డు తప్పించడమే పరిష్కారమని ఆమె భావిస్తుంది. ఒక రోజు రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఆమె అతనిని హతమారుస్తుంది. అతని శవాన్ని పొలిమేరల్లోని పాడుబడిన బావిలో పారేస్తోంది. ఏమీ ఎరుగనట్టుగా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుంది.

మిత్రవర్మ తల్లిదండ్రులు జరిగినది గ్రహించి చాలా బాధపడతారు. కర్కశకు పరపురుషుల అండదండలు ఎక్కువగా ఉండటం వలన ఆమెను ఏమీ అనలేని పరిస్థితి. అందువలన తమ కొడుకు లేని చోటున తాము ఉండకూడదని భావించి, కర్కశ కంటపడాకుండా ఆ ఊరునుంచి వెళ్లిపోతారు. ఇంతకాలంగా తనని అదుపులో పెట్టడానికి ప్రయత్నించిన భర్త లేడు .. అత్తమామలు లేరు. అందువలన ఇక తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఆమె భావిస్తుంది. అప్పటి నుంచి ఇక మరింత స్వేచ్ఛగా ప్రవర్తించడం మొదలవుతుంది.

కర్కశ వైఖరి గురించి ఊళ్లో వాళ్లు కొంతమంది చాటుగా గుసగుసలాడితే .. మరికొందరు ముఖాన్నే అనడం మొదలుపెట్టారు. అయితే తనకి గల అండదండలతో అందరినీ భయపెడుతూ ఆమె బతికేస్తూ ఉండేది. ఆమె కారణంగా మిగతా స్త్రీలకు కూడా రక్షణ లేకుండాపోతుంది. అలా కర్కశ అడ్డూ అదుపూ లేని జీవితాన్ని గడుపుతూ వస్తుంది. వయసు ఇంద్రధనుస్సులాంటిది. చూసుకుని మురిసిపోయేలోగా మాయమవుతుంది. అలా కర్కశకి వయసు మీద పడింది .. వయసులో ఉండగా చేసిన పనుల కారణంగా అనారోగ్యాలు ఆమెను చుట్టుముడతాయి.

కర్కశ దేహ సౌందర్యం చూసి మాత్రమే ఆమె వెంటపడిన వాళ్లంతా, ఇప్పుడు తాము కనిపిస్తే ఏ సాయం అడుగుతుందో అని తప్పించుకుని తిరగడం మొదలుపెడతారు. ఆమె ప్రవర్తన మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిన కారణంగా ఎవరూ ఆమెను పలకరించేవారు కూడా కాదు. ఆదరించేవారులేక .. ఆపదలో పిలిస్తే పలికేవారు లేక కర్కశ ఆ ఊళ్లో ఒంటరిదైపోతుంది. తన శరీరమూ సహకరించక .. తనకి ఎవరూ సహకరించక నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతూ వస్తుంది. చివరికి పలకరించేవారు కూడా లేని పరిస్థితుల్లో చివరి శ్వాసను విడుస్తుంది.

యవ్వన గర్వంతో .. అందగత్తెననే అహంభావంతో మిడిసిపడిన కర్కశ, చనిపోయిన తరువాత నేరుగా నరకానికి వెళుతుంది. భూలోకంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ అనేక పాపాలు చేసినందుకు .. భర్తను హత్య చేసినందుకు .. అత్తమామలను కష్టపెట్టినందుకు .. ధర్మాచరణను పాటించనందుకు యమధర్మరాజు ఆమెకు అనేక రకాల శిక్షలను విధిస్తాడు. ఆ శిక్షలను కర్కశ అతి కష్టం మీద భరిస్తూ వెళుతుంది. “చేసుకున్నవారికి చేసుకున్నంత” అని ఎందుకంటారనేది ఆమెకు అర్థమవుతుంది.

అలా నరకలోకంలో అన్ని రకాల శిక్షలను అనుభవించిన కర్కశ .. ఆ పాపాలకు ఫలితంగా భూలోకంలోని ఒక ఊళ్లో కుక్కగా పుడుతుంది. వీధి కుక్కగా తిరుగుతూ .. ఒక బ్రాహ్మణుడి ఇంటికి సమీపంలోని ఒక చెట్టుక్రింద పడుకునేది. ఏ రోజుకు ఆ రోజు ఎక్కడైనా ఏదైనా దొరికితే తినడం .. లేదంటే లేదు. ఏమీ దొరకని రోజున నీరసించి వచ్చి చెట్టుక్రింద పడుకునేది. అలా ఒక రోజున ఆ కుక్క .. చెట్టు నీడలో పడుకుని ఉండగా, అక్కడికి సమీపంలోని ఇంట్లో ఉండే ఒక బ్రాహ్మణుడు కొంత ఆహారం తీసుకుని వచ్చి దాని ముందుంచుతాడు.

ఆ బ్రాహ్మణుడు తెచ్చిన ఆహారాన్ని కుక్క గబగబా తినేస్తూ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళుతూ ఉండగా, కుక్క ఏడుపు వినిపిస్తుంది. ఆ కుక్క ఒక మనిషి మాదిరిగా రోదిస్తూ ఉండటం ఆయనకి విచిత్రంగా అనిపిస్తుంది. తన కళ్లను తానే నమ్మలేకపోతూ కుక్క దగ్గరికి వెళతాడు. “ఓ బ్రాహ్మణుడా నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు .. నేను చేసిన పాపాల నుంచి నాకు ముక్తిని ప్రసాదించు” అని కుక్క దీనంగా అడుగుతుంది. ఒక కుక్క మనిషిలా మాట్లాడుతూ ఉండటం ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఆ బ్రాహ్మణుడు అదే విషయాన్ని ఆ కుక్క దగ్గర వ్యక్తం చేస్తాడు. అప్పుడు కుక్క రూపంలోని కర్కశ .. “బ్రాహ్మణుడా నేను 14 జన్మల క్రితం ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిని. ఆ జన్మలో నేను అనేక పాపాలు చేసిన కారణంగా, నరకలోకంలో అనేక శిక్షలను అనుభవించాను. ఆ తరువాత కుక్కగా 14 జన్మలు ఎత్తాను .. ఇది 15వ జన్మ. అయితే ఈ విషయాలేవీ నాకు ఇంతకుముందు వరకూ గుర్తుకురాలేదు. నువ్వు పెట్టిన ఆహరం తిన్న తరువాతనే పూర్వ జన్మలకు సంబంధించిన జ్ఞాపకాలు వరుసగా నాకు గుర్తుకు వచ్చాయి.

ఒక కుక్కకి పూర్వజన్మ స్మృతి కలగడం .. పైగా 14 జన్మల క్రితం తాను ఎవరన్నది చెప్పగలగడం ఆ బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకు కారణం ఏమిటా అని ఆలోచన చేసిన ఆయనకు విషయం అర్థమవుతుంది. హఠాత్తుగా నాకు పూర్వ జన్మల గురించిన విషయాలు ఎలా తెలిశాయి? దీనికి కారణం ఏమిటి? అని ఆ కుక్క అడుగుతుంది. తాను చేసిన “సోమవార వ్రతం” .. ఆ ఫలితం ఇందుకు కారణం అని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు.

నేను నియమ నిష్ఠలు కలిగిన బ్రాహ్మణుడిని. ఆచార వ్యవహారాలకు నేను ఎంతో విలువను ఇస్తాను. భగవంతుడి ఆరాధన పూర్తయ్యేవరకూ ఎలాంటి ఆహారం తీసుకోను. అలాంటి నేను కార్తీకమాసంలో ప్రతి రోజు శివాభిషేకం చేస్తూ ఉంటాను. ఇక కార్తీక మాసంలో “సోమవార వ్రతం” ఎంతో విశిష్టమైనటువంటిది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ, నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేస్తారు. ముందుగా జీవరాశికి కొంత ఆహారాన్ని అందించి, ఆ తరువాతనే భోజనం చేయవలసి ఉంటుంది. ఈ రోజున సోమవారం వ్రతం ముగించి ముందుగా ఆ ప్రసాదాన్ని నేను నీకు ఆహరంగా అందించాను. ఆ వ్రతానికి గల మహిమ కారణంగానే నీకు పూర్వ జన్మ స్మృతి కలిగింది .. మాట్లాడే శక్తి వచ్చింది అని చెబుతాడు.

అప్పుడు ఆ కుక్క “ఓ బ్రాహ్మణుడా నువ్వు చేసిన మేలును నేను ఎప్పటికీ మరిచిపోలేను. అయితే ఇప్పటివరకూ నేను పడిన బాధలు వేరు .. పూర్వ జన్మల స్మృతి కారణంగా ఇక ముందు మరింతగా బాధపడవలసి ఉంటుంది. అందువలన నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు” అని ప్రాధేయపడుతుంది. ఆ బ్రాహ్మణుడు అంతవరకూ అనేక సోమవార వ్రతాలను ఆచరిస్తూ వచ్చాడు. అందువలన ఆ కుక్క బాధను చూడలేక, ఒక సోమవార వ్రతం యొక్క ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోస్తాడు. దాంతో ఆ కుక్క ఆ జన్మ నుంచి విముక్తిని పొంది దివ్య శరీరాన్ని ధరించి శివలోకానికి చేరుకుంటుంది.

ఈ కథను జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెబుతాడు. ఇలా ఒక యువతి తాను చేసిన పాపాల కారణంగా 15 జన్మల పాటు కుక్కగా పుడుతూ నానా బాధలు అనుభవిస్తూ వచ్చింది. అలాంటి కుక్క “సోమవార వ్రతం” ఫలితం కారణంగా శివలోకానికి చేరుకుంది. సోమవార వ్రతానికి అంతటి శక్తి ఉంది. అది ఎలాంటి పాపాలనైనా భస్మం చేస్తుంది. పుణ్యరాశిని అమాంతంగా పెంచేసి ఉత్తమ జన్మలకు కారణమవుతుంది. ఉత్తమ గతులను పొందడానికి దోహదం చేస్తుంది. కార్తీకంలో అలాంటి సోమవారం వ్రతం చేయడం మరిచిపోకూడదు అని సెలవిస్తాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.