కార్తీకమాసం ఎంతో పవిత్రమైన మాసం .. అలాంటి ఈ మాసాన్ని గురించి వశిష్ఠ మహర్షి ద్వారా జనక మహర్షి తెలుసుకుంటాడు. జనక మహారాజు కోరిక మేరకు వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నట్టుగా “కార్తీక పురాణం” కొనసాగుతుంది. లోక కల్యాణం కోసం వశిష్ఠ మహర్షి ఒక యాగాన్ని తలపెడతాడు. అందుకు అవసరమైన యాగ ద్రవ్యాల కోసం ఆయన జనక మహారాజు దగ్గరికి వెళతాడు. ఆయనను సాదరంగా ఆహ్వానించిన జనక మహారాజు, విషయమేమిటని ఎంతో వినయంగా అడుగుతాడు. తాను వచ్చిన పనిని గురించి వశిష్ఠ మహర్షి ఆయనకు వివరంగా చెబుతాడు.

వశిష్ఠ మహర్షి కోరినవి ఏర్పాటు చేయడానికి జనక మహారాజు ఆనందంగా అంగీకరిస్తాడు. వశిష్ఠుడు తమ ప్రాంగణంలో అడుగుపెట్టడమే పెద్ద విశేషమని సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. ఒక విషయంలో తనకి గల సందేహాలను తొలగించవలసిందిగా మనవిచేస్తాడు. అందుకు వశిష్ఠుడు అంగీకరించడంతో, కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటని అడుగుతాడు. మాసాలలో కార్తీకమాసం ఎందువలన ప్రత్యేకమైనదనే విషయాన్ని తెలుపవలసినదిగా కోరతాడు. మిగతా మాసాల కంటే కార్తీక మాసం ఎలా గొప్పదనే విషయాన్ని వివరించమని అడుగుతాడు.

వశిష్ఠుడు తన యాగానికి అవసరమైన ద్రవ్యాలను సమకూర్చుతానని చెప్పిన జనక మహారాజుకు ఆశీస్సులు అందజేస్తాడు. కార్తీకమాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడానికి జనక మహర్షి ఆసక్తిని చూపడం .. ఆత్రుతను కనబరచడం వశిష్ఠుడికి ఆనందాన్ని కలిగిస్తుంది. కార్తీకమాసం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడంతోనే సగం పాపాలు నశిస్తాయనీ. పాపాల నుంచి బయటపడి, పుణ్యమార్గంలో ప్రయాణించాలనుకునే వారికే ఇలాంటి ఆలోచన కలుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.

కార్తీకమాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది. మహిమాన్వితమైనదైన ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవడం .. నదీ స్నానం చేయడం .. ఇటు శివుడినీ .. అటు విష్ణుమూర్తిని అంకితభావంతో పూజించడం .. ఉపవాస దీక్షను చేపట్టి, కార్తీక వ్రతాన్ని ఆచరించడం అనేక ఫలితాలను అందిస్తుంది. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఎంతో విశిష్టమైనది .. సోమవార వ్రతం ఎంతో శక్తివంతమైనది. కార్తీక సోమవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి, శివారాధన చేయడం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది అంటూ అందుకు ఉదాహరణగా వశిష్ఠుడు ఒక కథను చెప్పడం మొదలుపెడతాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.