Karthika Puranam – 30: Deity trees Raavi, Marri – Reason for worshiping Raavi tree on Saturday
కార్తీకమాసంలో ప్రాతః స్నానం .. శివకేశవ ఆరాధన .. దీపదానం .. ఉపవాసం .. జాగరణ విశేషమైన పుణ్యఫలాలను ఇస్తాయి. కార్తీక వ్రత ఆచారణ వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. కార్తీకంలో చేసే “గోపూజ” ఎంతో విశేషమైనది. అందుకు కుదరనప్పుడు రావి – మర్రి వృక్షాలను పూజించవచ్చు అని మహర్షులతో సూతుడు చెబుతాడు. అయితే రావి .. మర్రి వృక్షాలు ఏ విధంగా దేవతా వృక్షాలుగా చెప్పబడుతున్నాయో సెలవీయమని మహర్షులు కోరతారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం మొదలుపెడతాడు.
కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉంటారు. అదే సమయంలో వారి ఏకాంతానికి భంగం కలిగిస్తూ దేవతలు వస్తారు. తమ ఏకాంతానికి భంగం కలిగించిన దేవతల పట్ల పార్వతీదేవి ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంది. దేవతలంతా వృక్షాలుగా మారిపోవాలని ఆమె శపిస్తుంది. దాంతో బ్రహ్మ .. విష్ణు .. మహేశ్వరులు కూడా వృక్షాలుగా మారిపోతారు. పలాశ వృక్షంగా బ్రహ్మదేవుడు … రావి వృక్షంగా విష్ణుమూర్తి .. మర్రి వృక్షంగా పరమశివుడు మారిపోతారు.
బ్రహ్మకు పూజార్హత లేని కారణంగా విష్ణు స్వరూపంగా “రావి” .. శివ స్వరూపంగా “మర్రి” పూజలందుకుంటున్నాయి. రావి వృక్షాన్ని శనివారాలలో మాత్రమే పూజించాలి .. ఇతర వారాలలో దానిని తాకకూడదని మహర్షులతో సూతుడు చెబుతాడు.
రావిచెట్టును ఒక్క శనివారం రోజున మాత్రమే పూజించాలి .. ఇతర వారాలలో దానిని తాకరాదు అని సూతుడు చెప్పడంతో, అందుకుగల కారణం ఏమిటో చెప్పమని మహర్షులు అడుగుతారు. అప్పుడు సూతుడు చెప్పడం మొదలుపెడతాడు. క్షీర సాగరమథనం జరిగినప్పుడు ఎన్నో విలువైన వస్తువులు బయటపడ్డాయి. లక్ష్మీదేవిని .. కౌస్తుభమణిని శ్రీమహావిష్ణువుకు సమర్పించిన దేవతలు, మిగిలినవి తాము తీసుకుంటారు. లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు.
అయితే తనకి ఒక అక్కయ్య ఉందనీ .. జ్యేష్ఠకు వివాహం కాకుండా తాను పెళ్లి చేసుకోవడం సరికాదని లక్ష్మీదేవి అంటుంది. తనని వివాహం చేసుకోవాలనుంటే జ్యేష్ఠకు మంచి సంబంధం చూడమని కోరుతుంది. దాంతో విష్ణుమూర్తి .. “ఉద్దాలకుడు” అనే ఒక మునితో జ్యేష్ఠ వివాహాన్ని జరిపిస్తాడు. ఆ తరువాత జ్యేష్ఠను వెంటబెట్టుకుని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి వెళతాడు. ఆశ్రమం లోపలికి రాకుండా జ్యేష్ఠ ఏడుపు మొదలుపెడుతుంది. ఆమె ఎందుకు ఏడుస్తున్నది అర్థంకాకపోవడంతో, విషయమేమిటని అడుగుతాడు.
అనునిత్యం వేదాలు వినిపించే చోటున .. యజ్ఞయాగాలు జరిగే చోటున .. గురువులు – పితృదేవతలు పూజించబడే చోటున ఉండటం తనకి ఎంత మాత్రం ఇష్టం ఉండదని జ్యేష్ఠ చెబుతుంది. ఎక్కడైతే భార్యాభర్తలు తగవులు పడుతుంటారో .. ఎక్కడైతే అతిథులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో .. పెద్దల పట్ల గౌరవము .. పిన్నల పట్ల ప్రేమ ఉండదో అక్కడ ఉండటం తనకి ఇష్టం అని అంటుంది. అలాంటి ప్రదేశంలో తనని ఉంచడానికి ప్రయత్నించమని కోరుతుంది. ఆ మాటకి ఉద్దాలకుడు అయోమయానికి లోనవుతాడు.
నిదానంగా తేరుకుని .. ఆమెకి ఇష్టమైనటువంటి ప్రదేశం ఎక్కడ ఉందో చూసుకుని వస్తాను అని చెప్పేసి ఉద్దాలకుడు వెళతాడు. ఆయన కోసం ఎదురుచూస్తూ ఒక రావిచెట్టు మొదట్లో జ్యేష్ఠ కూర్చుంటుంది. ఎంతకాలానికీ భర్త తిరిగి రాకపోవడంతో దుఃఖిస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీనారాయణులు అక్కడికి వస్తారు. తన అంశావతారమైన రావి చెట్టు మొదట్లో స్థిరనివాసం ఏర్పరచుకోమనీ, శనివారం రోజున రావి చెట్టును పూజించినవారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విష్ణుమూర్తి చెబుతాడు. అందువల్లనే రావి చెట్టును శనివారాల్లో మాత్రమే పూజించాలని ఋషులతో సూతుడు చెబుతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.
Karthika Puranam – 30: Deity trees Raavi, Marri – Reason for worshiping Raavi tree on Saturday