నారద మహర్షి .. పృథు మహారాజుకు మధ్య జరిగిన సంభాషణను గురించి, కృష్ణుడి ద్వారా సత్యభామ తెలుసుకుంటుంది. అసలు పాపపుణ్యాలు ఎలా వస్తాయి? ఉత్తమగతులు ఎలా లభిస్తాయి? అని కృష్ణుడిని సత్యభామ అడుగుతుంది. అందుకు కృష్ణుడు ఇలా చెప్పడం మొదలుపెడతాడు. కృతయుగంలో ఎవరు పాపం చేసినా గ్రామస్థులంతా అనుభవించవలసి వచ్చేది. ద్వాపరయుగంలో ఒక వ్యక్తి పాపాలు చేస్తే, అతని కుటుంబ సభ్యులు మాత్రమే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వచ్చేది. కానీ కలియుగంలో ఎవరైతే పాపం చేస్తారో .. ఆ ఒక్కరు మాత్రమే ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది.

అంతేకాదు కలియుగంలో ఉద్దేశ పూర్వకంగా పుణ్యం చేయకపోయినా, పుణ్యకార్యాలను చూడడం వలన కూడా కొంత పుణ్యం లభిస్తుంది. అలా లభించే పుణ్యం వలన కూడా ఉత్తమగతులు కలుగుతాయి. అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెబుతాను విను … అంటూ చెప్పటం మొదలుపెడతాడు. అవంతీపురములో “ధనేశ్వరుడు” అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచారవ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తాడు. నియమనిష్టలు ఆయనకి తెలియనే తెలియవు.

మద్యానికి బానిసైన ఆయన, వేశ్యాలోలుడు కూడా అవుతాడు. సత్యాన్ని మాట్లాడటం ఆయనకి ఎంతమాత్రం అలవాటు లేని పని. ఎప్పుడూ ఎవరికీ పొరపాటున కూడా సహాయ సహకారాలను అందించేవాడు కాదు. దానధర్మాలకు సాధ్యమైనంత దూరంలో ఉండేవాడు. ఏదో వ్యాపారం చేసుకుంటూ, ఆ పనిపై అన్ని ఊళ్లూ తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఒక కార్తీక మాసానికి “మాహిష్మతీ నగరం” చేరుకుంటాడు. ఆ నగరం చుట్టూ “నర్మదా నది” ప్రవహిస్తూ ఉంటుంది. కార్తీకంలో పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు తరలి వస్తుంటారు.

అందువలన తన వ్యాపారం బాగా సాగుతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడికి చేరుకుంటాడు. ప్రతి రోజు తెల్లవారక ముందే భక్తులు కార్తీక స్నానాలు చేయడం చూస్తాడు .. తాను కూడా చేస్తాడు. అలాగే దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయనకి పరిచయమవుతారు. కార్తీక వ్రత విశేషాలను గురించి వాళ్లు చెబుతూ ఉంటే వింటాడు. అలాగే భగవంతుడి లీలా విశేషాలను గురించి మాట్లాడుకుంటుంటే ఆసక్తితో వింటాడు. అలా సజ్జన సాంగత్యం వలన ఆయన, భగవంతుడి నామాన్ని స్మరించడం మొదలుపెడతాడు.

ఇలా కార్తీకమాసంలో తన వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉండటంతో, ధనేశ్వరుడు ఆ నగరంలోనే ఆ నెలంతా ఉండిపోతాడు. కార్తీక పౌర్ణమి రోజున చేసే “దీపోత్సవం” కూడా తిలకిస్తాడు. ఆలయాలకు వచ్చి వెళ్లే భక్తులను చూస్తాడు. భగవంతుడు .. ఆయనను సేవించడానికి సంబంధించిన సందేహాలను సాధుసజ్జనులను అడిగి తెలుసుకుంటాడు. ఇక ఆ ఊరు నుంచి ధనేశ్వరుడు వెళ్లిపోవాలని అనుకుంటూ ఉండగా, ఒక విష సర్పం ఆయనను కరుస్తుంది. దాంతో వెంటనే ఆయన మరణిస్తాడు.

అలా పాము కాటు కారణంగా మరణించిన ధనేశ్వరుడు యమలోకానికి వెళతాడు. ధనేశ్వరుడి గురించిన విషయాలు చెప్పమని చిత్రగుప్తుడిని యమధర్మరాజు అడుగుతాడు. మొదటి నుంచి ఆయన అనుసరిస్తూ వచ్చిన పాపకార్యాలను గురించి చిత్రగుప్తుడు వివరంగా చెబుతాడు. దాంతో ధనేశ్వరుడిని అగ్నిగుండంలో తోయమని యమధర్మరాజు ఆదేశిస్తాడు. ఆ మాట వినగానే ధనేశ్వరుడు హడలిపోతాడు. తనని వదిలేయమని కేకలు పెడతాడు. ఆ మాటలను వినిపించుకోకండా యమభటులు ఆయనను అగ్నిగుండంలో తోసేస్తారు.

అగ్నిగుండంలో పడగానే ధనేశ్వరుడు మాడిపోతాడని యమభటులు అనుకుంటే, అలా జరగక పోవడం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అగ్నిగుండం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నట్టుగా చల్లగా మారిపోవడం ధనేశ్వరుడికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన ఒక్కడి విషయంలోనే ఇలా జరుగుతుందా? లేదంటే అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుందా? అనే ఒక రకమైన అయోమయానికి ఆయన లోనవుతాడు. యమభటులు వెళ్లి ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెబుతారు.

జరిగింది తెలుసుకున్న యమధర్మరాజు, ఒక పాపాత్ముడి విషయంలో ఇలా జరిగిందా? అని ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు. ధనేశ్వరుడు పాపాత్ముడే అయినప్పటికీ, చివరి రోజుల్లో సజ్జన సాంగత్యం చేశాడు. కార్తీకంలో నర్మదా నది స్నానం చేశాడు. అందరూ పూజలు .. దీపారాధనలు చేస్తుంటే చూశాడు. కార్తీకవ్రత మహాత్మ్యం గురించి విన్నాడు .. దైవనామస్మరణ చేశాడు. ఆ పుణ్యవిశేషాల కారణంగా ధనేశ్వరుడిని నరక బాధలు ఏమీ చేయలేవు అని నారద మహర్షి చెబుతాడు.

ధనేశ్వరుడు నరకలోకంలో ఉండతగినవాడు కాదని నారద మహర్షి చెప్పడంతో యమధర్మరాజు ఆలోచనలో పడతాడు. ఆ తరువాత తన దూతను పిలిచి, ధనేశ్వరుడికి నరకలోక దర్శనం చేయించి, ఆపై యక్షలోకానికి పంపించేసి రమ్మని చెబుతాడు. అలాగేనని చెప్పిన యమదూత, ధనేశ్వరుడిని వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయల్దేరతాడు. నరకాలు .. వివిధ రకాలుగా అమలుచేసే శిక్షలను గురించి చెబుతూ యమదూత అతణ్ణి తీసుకుని వెళుతుంటాడు.

“తప్తవాలుకము” .. “అంధతామిశ్రము” .. “క్రకచము” .. “అసిపత్ర వనం” .. “కూటశాల్మలి” .. “రక్తపూయము” .. “కుంభీపాకము” .. “రౌరవము” అనే నరకంలోని శిక్షించే కేంద్రాలను ధనేశ్వరుడికి చూపిస్తాడు. ఎవరు చేసిన పాపాలకు వారిని ఇక్కడ శిక్షించడం జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే జీవుడు ఎక్కువగా భయపడేది .. బాధపడేది “కుంభీపాకము” అనే నరకానికి. ఒక వైపున మహా దుర్గంధము .. మరో వైపున మహా భయంకరము అయిన కుంభీపాకమును చూసినప్పుడు జీవుడు పడే హింస అంతా ఇంతా కాదు అని చెబుతాడు.

ఆ తరువాత “రౌరవము” అనే నరకం కూడా భయానకమైనదే. దీర్ఘకాలికంగా బాధలను అనుభవించవలసివారిని తీసుకుని వచ్చి ఇందులో పడవేస్తారు. ఒకసారి ఇందులో పడినవారు .. కొన్ని వేల సంవత్సరాల పాటు ఇందులో నుంచి బయటపడలేరు. నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ, కార్తీక వ్రతాన్ని ఆచరించినవారితో కలిసి ఉన్నావు. ఆ వ్రతాన్ని గురించి విన్నావు. అందువలన నువ్వు ఎలాంటి శిక్షలను అనుభవించకుండా నరకాన్ని దగ్గర నుంచి మాత్రమే చూసి వెలుతున్నావు అంటాడు.

యమదూత వెంటరాగా ధనేశ్వరుడు .. “యక్షలోకం” చేరుకుంటాడు. ఆ లోకంలోకి అడుగుపెట్టగానే ఆయన యక్ష రూపాన్ని పొందుతాడు. అంతేకాదు ఆయన పేరు ధనయక్షుడి గా మారిపోతుంది. అలా ధనేశ్వరుడు .. కార్తీక వ్రత విశేషం వలన, ధనయక్షుడిగా మారిపోతాడు. అని కృష్ణుడు చెప్పడంతో సత్యభామ ఆశ్చర్యపోతుంది. అలా కార్తీక వ్రత మహాత్మ్యాన్ని గురించి సత్యభామకి కృష్ణుడు తెలియజేశాడు అని సూతుడు .. మహర్షులతో చెబుతాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.