Karthika Puranam – 5: Karthika Vrat importance – Rat gets redemption from a curse

కార్తీక వ్రతం చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఒకవేళ కార్తీక వ్రతం చేయడం కుదరకపోతే, ఆ వ్రత మహాత్మ్యం విన్నా కూడా అనేక శుభాలు కలుగుతాయి. పాపాలు పూర్తిగా ధ్వంసమవుతాయి. అందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను అంటూ జనకమహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలుపెడతాడు. పూర్వం కావేరి నదీ తీరంలో “దేవశర్మ” అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమ నిష్టలు కలిగినవాడు. ప్రతి నిత్యం పూజ పూర్తయితేనే తప్ప, ఆహారంగా ఏమీ తీసుకునేవాడు కాదు.

ఇక కార్తీక మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి శివకేశవులను సమానంగా ఆరాధించేవాడు. అలాగే పురాణం పఠనం .. శ్రవణం చేసేవాడు. ఆయన నియమనిష్ఠలను గురించి తెలిసినవారు ఆయనను ఎంతో గౌరవించేవారు. ఉన్నదాంట్లోనే ఎంతో గౌరవంగా .. సంతృప్తికరంగా జీవిస్తున్న ఆయనకి, తన కొడుకు “దేవదత్తుడు” తన మాట వినకపోవడం బాధను కలిగిస్తూ ఉంటుంది. మంచి మార్గంలో నడవకపోయినా ఫరవాలేదు .. కానీ కొడుకు చెడు మార్గం దిశగా అడుగులు వేస్తూ వెళుతుండటం ఆయనకి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది.

ఇక కొడుకు ధోరణిలోని మరో కోణం ఆయనని మరింత వేధిస్తూ ఉంటుంది. తాను ఎంతగా భగవంతుడిని ఇష్టపడతానో అలాంటి భగవంతుడు లేడని అతను వాదిస్తూ ఉండటాన్ని ఆయన భరించలేకపోతాడు. ఈ విషయంలో తన కుమారుడికి నచ్చజెప్పడానికి ఆయన ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. కనీసం కార్తీక మాసంలోనైనా కోవెల్లో దీపం పెట్టమని దేవదత్తుడితో చెబుతాడు. అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా అసలు దేవుడే లేడంటూ తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు.

ఆ మాట దేవశర్మకి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో ఆయనలోని సహనం నశిస్తుంది. దేవుడు లేడని అన్నందుకుగాను “ఎలుక”వై చెట్టుతొర్రలో కాలం గడపమని శపిస్తాడు. తండ్రి శాపం ఫలిస్తుందని తెలిసిన దేవదత్తుడు, తన తప్పును మన్నించమని కోరుతూ ఆయన పాదాలపై పడతాడు. దాంతో ఆ తండ్రి మనసు కాస్త కరుగుతుంది. కార్తీక వ్రత మహాత్మ్యం గురించి పూర్తిగా విన్నప్పుడు తిరిగి మానవరూపం వస్తుందని శాపవిమోచనం చెబుతాడు.

తండ్రి శపించినట్టుగానే దేవదత్తుడు ఒక భయంకరమైన అడవిలో .. ఒక పెద్ద వృక్షం తొర్రలో ఎలుకలా రోజులు గడుపుతూ ఉంటాడు. ఆయన ఎలుకగా మారినా మానవ స్పృహ ఉంటుంది. అందువలన అడవికి .. అక్కడి జంతువులకు ఆయన మరింత భయపడుతూ ఉంటాడు. ఆ చెట్టు తొర్రలో నుంచి బయటికి వస్తే ఏం జరుగుతుందో అనే భయంతో లోపలే ఉంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే విశ్వామిత్రుడు తన శిష్య బృందంతో కలిసి ఆ ఆడవి మార్గంలో వెళుతూ ఉంటాడు.

అలా ప్రయాణ బడలిక కారణంగా అలసిపోయిన ఆయన ఆ చెట్టు నీడలో కూర్చుంటాడు. అది కార్తీక మాసమే కావడంతో, ఆ మాసాన్ని గురించిన ప్రస్తావన వస్తుంది. శిష్యులు అడిగిన ప్రశ్నలను ఆయన సమాధానాలు ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక కిరాతుడు అటుగా వస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చిన ఆ కిరాతుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమైపోతుంది. అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరతాడు.

అడవిలో తిరుగుతూ .. ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపడంలో తనకి సంతోషం లేదని చెబుతాడు. అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గమేదైనా ఉంటే సెలవీయమని కోరతాడు. కార్తీక వ్రత మహాత్మ్యాన్ని వినడం వలన, సమస్త పాపాలు .. దోషాలు .. శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రశాంతమైన జీవితము .. మరణానంతరం శివలోక ప్ర్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో తనకి చెప్పమని ఆ కిరాతుడు కోరతాడు.

అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు .. కార్తీక మాసం విశిష్టతను .. స్నానం .. జపం .. దానం .. ఉపవాసం .. దీపారాధన .. దీపదానం .. పురాణ శ్రవణం .. మొదలైనవాటి గురించి వివరంగా చెబుతాడు. అలా విశ్వామిత్రుడు .. ఆ కిరాతుడికి కార్తీక వ్రత మహాత్మ్యం గురించి చెబుతూ ఉండగా, ఆ చెట్టు తొర్రలోని ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాపవిమోచనం అవుతుంది. దేవదత్తుడు వచ్చి విశ్వమిత్రుడికి నమస్కరించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తరువాత కాలంలో ఆ కిరాతుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.

Karthika Puranam – 5: Karthika Vrat importance – Rat gets redemption from a curse