పూర్వం “కన్యాకుబ్జం”లో సత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన మహా పండితుడు. ఎప్పుడూ కూడా అసత్యం ఆడనివాడు. ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా ఆయన సత్యానికి కట్టుబడి ఉంటాడు. ఉన్నదాంట్లోనే ఇతరులకు సాయపడుతూ, సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. భగవంతుడి ఆరాధన … ధర్మకార్యాలు గురించి తప్ప మరి దేని గురించి ఆయన ఆలోచన చేయడు.పరమ నియమనిష్ఠలతో మసలుకుంటూ ఉండే ఆయన అంటే ఆ ఊళ్లోని వాళ్లందరికీ ఎంతో గౌరవం.

అలాంటి సత్యనిష్ఠుడికి “అజామీళుడు” అనే ఒక కుమారుడు కలుగుతాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏది మంచి .. ఏది చెడు అనే విషయాలను చెబుతూనే పెంచుతాడు. తన కుమారుడు నలుగురికీ మంచి చెప్పే స్థాయికి ఎదగాలనే ఆయన కోరుకుంటాడు. తన కుమారుడిలో భక్తి శ్రద్ధలు పెంచడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ వస్తాడు. అయితే తండ్రి ఎంత శ్రద్ధగా చెబుతున్నా అజామీళుడు పట్టించుకునేవాడు కాదు. అసలు తండ్రి చెప్పే విషయాలపై ఆయనకి దృష్టి ఉండేది కాదు. అయినా చిన్నతనం .. నెమ్మదిగా అతనే దారికొస్తాడు అని సత్యనిష్ఠుడు అనుకుంటాడు.

కానీ వయసుతో పాటు అజామీళుడులో మొండితనం పెరుగుతూ పోతుంటుంది. ఆచారవ్యవహారాలు .. పూజలు ఒక చాదస్తంగా అతనికి అనిపిస్తాయి. దేవుడు .. దర్శనం .. పూజలు .. వీటివలన సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమి లేదని అనుకుంటాడు. తండ్రి చెప్పే మాటలు తనని బంధిస్తున్నాయనీ .. తన స్వేచ్ఛను హరిస్తున్నాయని భావిస్తాడు. అందువలన తండ్రి ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన అభిప్రాయాలను తనపై రుద్దడానికి ప్రయత్నించవద్దని తేల్చి చెబుతాడు.

అజామీళుడు ధర్మం తప్పి నడచుకోవడం .. ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నిస్తే అసత్యాలాడటం తండ్రికి ఎంతో బాధను కలిగిస్తుంది. ఒక్కగానొక్క కొడుకు అలా తయారు కావడం ఆయనకి ఆందోళన కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఊరికి దూరంగా జీవించే ఒక దాసీతో అజామీళుడు ప్రేమలో పడతాడు. అనునిత్యం ఆ అమ్మాయితోనే తిరుగుతూ ఉంటాడు. సత్యనిష్ఠుడి కుమారుడు ఇలా తిరుగుతున్నాడంటూ అంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలిసి సత్యనిష్ఠుడు తన కుమారుడిని మందలిస్తాడు.

తండ్రి మాటలను అజామీళుడు ఎదిరిస్తాడు. ఎవరేమనుకున్నా తాను ఆ అమ్మాయితోనే ఉంటానని తేల్చి చెబుతాడు. దాంతో ఆగ్రహించిన తండ్రి అలా అయితే ఇకపై తన ఇంటికి రావొద్దని చెప్పి పంపించివేస్తాడు. అజామీళుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయి, ఆ దాసీ ఇంట్లో ఉంటూ ఉంటాడు. అప్పటికే ఆమెకి ఒక కూతురు ఉంటుంది. అజామీళుడు ఆ ఇద్దరితో కలిసి ఉంటూ .. ఆ గూడెంలోని వాళ్లతో కలిసి పనులకు వెళుతూ ఉంటాడు. వాళ్లతో తిరుగుతూ ఉండటం వలన తన ఆచారాలను పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజున తాటిచెట్టు పై నుంచి పడి ఆ దాసీ మరణిస్తుంది.

అజామీళుడు చాలా బాధపడతాడు .. వావి వరుసలు మరిచిపోయి ఆ దాసీ కూతురును వివాహం చేసుకుంటాడు. ఆ ఇద్దరికీ కొంతమంది సంతానం కలుగుతారు. అయితే వాళ్లలో చివరి సంతానమైన ఒక్క పిల్లవాడు మాత్రమే బ్రతుకుతాడు. దాంతో ఆ పిల్లవాడికి “నారాయణ” అనే పేరు పెట్టి ఎంతో అపురూపంగా వాడిని చూసుకుంటూ ఉంటాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత అజామీళుడికి వయసుపై బడిన కారణంగా అనారోగ్యనికి లోనవుతాడు. తనకి అవసాన దశ సమీపించిందనే విషయం ఆయనకి అర్థమవుతుంది.

అజామీళుడిని తీసుకుని వెళ్లడానికి యమభటులు వచ్చేస్తారు. మంచంలో ఉన్న ఆయనకి యమభటులు కనిపిస్తారు. వాళ్ల రూపాలను చూసిన ఆయన భయపడిపోతాడు. ఎవరూ లేనివేళ ఇంట్లోకి ఎవరో చొరబడ్డారనీ, తనని వాళ్లు ఏం చేస్తారోనని ఆయన అనుకుంటాడు. యమభటులు తనని సమీపిస్తూ ఉండటంతో కంగారుపడిపోయి “నారాయణా .. నారాయణా” అంటూ పదే పదే పిలవడం మొదలుపెడతాడు. ఆయన అలా ఆగకుండా “నారాయణా .. నారాయణా” పిలుస్తూ ఉండటంతో యమభటులు ఆగిపోతారు.

అజామీళుడి కుమారుడు అక్కడ లేకపోవడం వలన ఎంతగా పిలిచినా రాడు. అలా పిలుస్తూనే అజామీళుడు తన ప్రాణాలను వదిలేస్తాడు. ఆ మరుక్షణమే దివ్యవిమానంలో విష్ణు దూతలు అక్కడికి చేరుకుంటారు. వాళ్లను చూసి యమభటులు ఆశ్చర్యపోతారు. ఆచారవ్యవహారాలు పాటించని వ్యక్తి .. వావి వరసలు మరిచిన వ్యక్తి .. అనేక వ్యసనాలతో జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి .. నరకానికి రావలసి ఉంటుంది. ఆయనను తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ. అలాంటి వ్యక్తిని విష్ణు లోకానికి ఎలా తీసుకువెళతారు? అని విష్ణుదూతలను యమభటులు అడుగుతారు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.