Karthika Puranam: Poli hardships at mother-in-law house – Poli goes to heaven

పూర్వం కృష్ణా నదీ తీరంలో “బాదర” అనే గ్రామం ఉండేది. ఆ ఊళ్లో “పోతడు” అనే ఒక చాకలి ఉండేవాడు. ఆయన భార్య “మాలి” మహా గయ్యాళి. ఆ వీధిలోనూ .. ఆ ఊళ్లోను ఆమె ఎవరినీ నెగ్గనిచ్చేది కాదు. ఆమెకు నలుగురు కొడుకులు .. వాళ్లందరికీ కూడా వివాహం జరుగుతుంది. మొదటి ముగ్గురు కోడళ్లు కూడా అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం. అందువలన మాలి ఆ ముగ్గురి విషయంలో తగ్గి ఉండేది. నాల్గొవ కోడలు “పోలి” అంటేనే ఆమెకు మహా లోకువ. పోలికి అణకువ .. దైవభక్తి ఎక్కువ.

పోలి భర్త కాస్త మెతక మనిషి .. అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసు అవుతుంది. అత్తతో పాటు మిగతా ముగ్గురు కోడళ్లు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్లంతా ఏ పనీ చేయకుండా మొత్తం పని అంతా కూడా పోలికి అప్పగించేస్తూ ఉంటారు. దాంతో పోలికి చాలా కష్టమైపోతుంటుంది. పోలి చాలా కష్టపడుతుందని తెలిసినా, భర్త ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. పాపం ఊళ్లో వాళ్లు కూడా పోలి పరిస్థితికి జాలిపడుతూ ఉంటారు. ఆమెకి ఆ ఇల్లే పంజరమైపోయిందని చెప్పుకుంటూ ఉంటారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే కార్తీక మాసం వస్తుంది .. మాలి తన ముగ్గురు కోడళ్లను తీసుకుని రోజూ నదీ స్నానానికి వెళ్లివస్తూ ఉంటుంది. అక్కడ వారు దీపాలను వెలిగించి వస్తుంటారు. పోలిని ఇంటి దగ్గరే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెబుతారు. పోలి ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటుంది. అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్లు నది స్నానానికి వెళ్లినా, వాళ్లకి భగవంతుడిపై దృష్టి నిలవదు. ఇంటిదగ్గర పోలి పాలు తాగేస్తుందేమో .. దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో అని ఆమె గురించే ఆలోచన చేస్తుంటారు.

పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటుంది. కార్తీక మాసంలో నదీ స్నానం కాదుగదా, పూజ చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెబుతున్నారు .. తీరిక ఉండటం లేదు అని బాధపడుతుంది. తన వంటి దురదృష్టవంతురాలు ఉండకూడదని అనుకుంటుంది. ఎలాగైనా కార్తీక మాసంలో దీపం వెలిగించాలానే పట్టుదలతో కుండలోని నీటితో స్నానం చేస్తుంది. చిరిగినదే అయినా వాటిలో కాస్త మంచిదైన వస్త్రం ధరిస్తుంది. ఒక గుడ్డపీలికను ఒత్తిగా చేసి, కవ్వానికి అంటిన వెన్నను తీసి .. దీపం వెలిగించి భగవంతుడికి నమస్కరించుకుంటుంది.

అత్తవారింట అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి .. తనని పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి .. ఎలాగైనా కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి .. నిజంగా ఆమె గొప్ప భక్తురాలు అని విష్ణుమూర్తి అనుకుంటాడు. వెంటనే తన సేవకుడైన సుశీలుడిని పిలిచి … పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. దాంతో క్షణాల్లో సుశీలుడు … పోలి ఇంటికి చేరుకుంటాడు.

ఒక దివ్య విమానం తన వాకిట్లో నిలవడం .. అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది. తాను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడను అని సుశీలుడు చెబుతాడు. ఆమె భక్తికి మెచ్చిన విష్ణు మూర్తి, ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తనని పంపించాడని అంటాడు. ఆ మాటలను పోలి నమ్మలేక పోతుంది. ఆమెలో ఆనందాశ్చర్యాలు చోటుచేసుకుంటాయి.

దివ్యవిమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా, ఆమె అత్త .. తోడికోడళ్లు ఇంటికి తిరిగివస్తూ దూరం నుంచే ఆ దృశ్యాన్ని చూస్తారు. విషయమేమిటనేది వాళ్లకి అర్థమైపోతుంది. పోలి స్వర్గానికి వెళుతోంది .. తాను కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్లాలి అనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది. మాలి పాదాన్ని పెద్దకోడలు .. ఆమె పాదాన్ని తరువాత కోడలు ఇలా అంతా ఒకరి పాదాలు ఒకరు పట్టుకుని గాల్లో వ్రేలాడుతూ ఉంటారు.

“ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగుపెట్టగలిగే దివ్య విమానం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికీ ప్రవేశం ఉండదు. అందువలన పోలి పాదాలను వదలండి. మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యం .. మీరు వెళ్లవలసింది అక్కడికే” అని సుశీలుడు అంటాడు. అయినా వాళ్లెవరూ ఆ దివ్య విమానాన్ని వదలకపోవడంతో, మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు. దాంతో ఆమెతో పాటు ముగ్గురు కోడళ్లు కూడా అక్కడి నుంచి క్రింద పడిపోతారు. పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది. నిస్వార్థమైన బుద్ధి .. స్వచ్ఛమైన భక్తి కలిగినవారి పట్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని పోలి కథ స్పష్టం చేస్తూ ఉంటుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.

Karthika Puranam : Poli hardships at mother-in-law house – Poli goes to heaven