Introduction to Sri Bhagavatam

వేదవ్యాస మహర్షిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశావతారమని చెబుతారు. అనంతమైన వేదరాశిని ఆయన “ఋగ్వేదం” .. “యజుర్వేదం” .. “సామవేదం” .. “అధర్వణ వేదం” అనే నాలుగు భాగాలుగా విభజిస్తాడు. వేదాలను ముఖతా ప్రచారం చేయడానికి గాను తన శిష్యులను నియమిస్తాడు. ఋగ్వేదాన్ని పైలుడుకి .. యజుర్వేదాన్ని వైశంపాయనుడికి .. సామవేదాన్ని జైమినికి .. అధర్వణ వేదాన్ని సుమంతుడికి ఉపదేశిస్తాడు. వేదరాశిని ప్రాచుర్యంలోకి తీసుకురావలసిన బాధ్యతను వాళ్లకు అప్పగించి పంపిస్తాడు.

అయితే వేదం సామాన్య మానవులకు అర్థమవుతుందా? ధర్మబద్ధమైన జీవితం దిశగా అడుగులు వేయమని తాను చెప్పిన విషయాన్ని వాళ్లు గ్రహించగలుగుతారా? అనే సందేహం వ్యాస మహర్షికి కలుగుతుంది. దాంతో ఆయన జీవితంలో ఎలా నడుచుకోవాలో .. ఎలా నడచుకోకూడదో చెప్పడం కోసం 18 పురాణాలను రచించాడు. అందులో ఒకటిగా “శ్రీభాగవతం” కనిపిస్తుంది. భాగవతానికి ముందుగా వ్యాసమహర్షి “మహాభారతం”ను సంస్కృతంలో రచించాడు.

అయితే వేదాలను నాలుగు భాగాలుగా విభజించి అందించినా, పురాణాలను రచించినా, ఇతిహాసంగా “మహాభారతం”ను ఆవిష్కరించినా ఏదో తెలియని అసంతృప్తికి వ్యాస మహర్షి లోనవుతుంటాడు. లోకానికి ఇన్ని అందించినప్పటికీ ఏదో తెలియని వెలితి ఆయన మనసుకు శాంతి లేకుండా చేస్తుంటుంది .. అదేమిటి? తానేమి మరిచిపోయాను? అని ఆయన సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచిస్తూ ఉండగా నారద మహర్షి అక్కడికి వస్తాడు. వ్యాస మహర్షి దిగాలుగా ఉండటం చూసి కారణం తెలుసుకుంటాడు.

శ్రీమన్నారాయణుడి లీలా విశేషాలను ప్రధానంగా చేసుకుని, ఆయన భక్తులకు సంబంధించిన జీవిత విశేషాలతో ప్రత్యేకించి ఒక కావ్యాన్ని రాయకపోవడమే వ్యాస మహర్షి అసంతృప్తికి గల కారణమని నారద మహర్షి అంటాడు. శ్రీమహావిష్ణువును సేవించి తరించిన భక్తుల కథలు .. వాళ్లను స్వామి అనుగ్రహించిన విధానం .. లోక కల్యాణం కోసం స్వామివారు చూపిన లీలా విశేషాలే ప్రధానంగా ఒక కావ్యాన్ని రాయమని చెబుతాడు. భాగవతులకు .. భగవంతుడైన నారాయణుడికి సంబంధించిన ఆ కావ్యాన్ని రాయడం వలన ఆయనకి సంతృప్తి కలుగుతుందనీ, ఆయన జీవితం సార్థకమవుతుందని సెలవిస్తాడు. అలా నారద మహర్షి సూచన మేరకు వ్యాస మహర్షి “భాగవతం” రచించారు. అలాంటి “భాగవతం”లోని కొన్ని ఆసక్తికరమైన ఘట్టాలను గురించి మున్ముందు తెలుసుకుందాం.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి