Introduction to Karthika Puranam

తెలుగు మాసాలలో .. అత్యంత పుణ్యప్రదమైన మాసంగా “కార్తీకమాసం” కనిపిస్తుంది. దీనిని కౌముదీ మాసం .. వెన్నెల మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతి రోజూ ఓ ప్రత్యేకతను .. ప్రతిరోజూ ఒక విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. పరమశివుడికి .. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తీకమాసం చెప్పబడుతోంది. ఈ మాసంలో చేసే నదీ స్నానం .. దీపారాధన .. జపం .. దానం .. ఉపవాసం .. నోములు .. వ్రతాలు .. పురాణ పఠనం .. పురాణ శ్రవణం విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

సదాశివుడు భక్త సులభుడు .. దోసెడు నీళ్లతో అభిషేకిస్తే చాలు ఆయన ఆనందంతో మురిసిపోతాడు .. పిడికెడు మారేడు దళాలు సమర్పిస్తే చాలు సంతోషంతో పొంగిపోతాడు. అంకితభావంతో శివా .. శంకరా .. అని పిలిస్తే చాలు కరుణతో కరిగిపోతాడు .. అలసట ఎరుగక పరుగు పరుగున కదిలివస్తాడు. తనని పూజించిన .. సేవించిన భక్తుల కోరికలను నెరవేర్చడం కోసం వరాల వర్షం కురిపిస్తాడు. అలాంటి ఈ మాసంలో విష్ణుమూర్తి “దామోదరుడు” అనే పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. భక్తులను అనుగ్రహించే విషయంలో ఆయన శంకరుడితో పోటీపడుతూ ఉంటాడు.

ఇక వ్రతాలు .. నోముల పేరుతో ఇటు పార్వతీదేవి .. అటు లక్ష్మీదేవి కూడా ఈ మాసంలో పూజలు అందుకుంటూ ఉంటారు. స్త్రీలు కోరుకునే సౌభాగ్యాన్ని .. సిరిసంపదలను అనుగ్రహిస్తారు. ఇలా దేవతల ఆరాధన త్వరగా ఫలించి .. వాళ్ల అనుగ్రహాన్ని తేలికగా అందించే శక్తి కార్తీక మాసానికి మాత్రమే ఉంది. ఎన్నో యజ్ఞయాగాలు .. జపతపాల వలన లభించే ఫలితం కార్తీకమాసంలో చేసే తేలికపాటి పూజాభిషేకాలతో పొందవచ్చని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే కార్తీకమాసంలో, భగవంతుడి అనుగ్రహాన్ని పొందే అవకాశాలను ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోకూడదు.

కార్తీక మాసంలో అత్యంత పుణ్యప్రదమైనవిగా పురాణ పఠనం .. పురాణ శ్రవణం కనిపిస్తాయి. ఈ మాసంలో “కార్తీక పురాణం” చదవడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. కార్తీక మాసం యొక్క విశిష్టత మనకి పురాణాలలోను కనిపిస్తుంది. కార్తీకమాసం యొక్క గొప్పతనం ఏమిటి? ఈ పురాణంలోని విశేషాలను ఎవరు ఎవరితో చెప్పారు? ఈ పురాణంలో దాగిన అంశాలు ఎలాంటివి? కార్తీకపురాణం చదవడం వలన .. వినడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అనేది ఇప్పుడు మనం కథల ద్వారా తెలుసుకుందాం ..

ముందుగా కార్తీకంలో ఆచరించదగిన విధివిధానాలను గురించి తెలుసుకుందాం. గతంలో పృథు చక్రవర్తి కార్తీక మాస విధివిధానాలను గురించి వివరించవలసిందిగా నారద మహర్షిని కోరతాడు. ఆయన ప్రశ్నకి సమాధానంగా నారదుడు చెప్పడం మొదలుపెడతాడు. ఓ రాజా కార్తీక వ్రతాన్ని ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి రోజునే ఆరంభించాలి. ముఖమును .. నాలుకను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యోదయానికి ముందుగా నదీ స్నానం చేసి, ఆ తరువాత శివాలయానికి గానీ .. విష్ణు ఆలయానికి గాని వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలి. స్వామి లీలా విశేషాలను గురించి గానం చేస్తూ ఆనందించాలి.

ఈ మాసంలో అడవిపూలు .. తెల్లని అక్షితలు విష్ణుమూర్తి పూజకు పనికి రావు. అలాగే శివుడి పూజకు మల్లెపూలు .. బండి గురువింద పూలు .. దిరిసెన పూలు పనికిరావు. అవిసె పూలతో సూర్యభగవానుడిని .. తులసితో వినాయకుడిని .. గరికతో దుర్గాదేవిని పూజించకూడదనే నియమం ఉంది. ఈ మాసంలో శివకేశవ బేధము లేకుండా ఎవరైతే ఇద్దరినీ ఒకటిగా భావిస్తూ పూజిస్తారో వాళ్లకి ఉత్తమగతులు కలుగుతాయి.

కార్తీకంలో బావులలో .. చెరువులలో చేసే స్నానం కంటే నదీ సంగమ స్థానంలో స్నానం చేయడం వలన పది రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో పితృతర్పణాలు వదలడం వలన, అందులో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు వాళ్లు స్వర్గంలో ఉంటారు. తులసి పూజ .. బ్రాహ్మణులకు చేసే దానం .. పురాణపఠనం .. ఇవన్నీ కూడా అనేక పుణ్య ఫలాలను అందిస్తాయి అని నారదుడు .. పృథు చక్రవర్తితో చెబుతాడు.

ఇంకా నారద మహర్షి .. కార్తీకవ్రతం విషయంలో ఆచరించవలసిన నియమాలను గురించి పృథు చక్రవర్తికి ఈ విధంగా చెబుతాడు. కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు శాకాహారమును మాత్రమే తీసుకోవాలి. ఏ విషయంలోనైనా ఎవరినీ కూడా నిందించకూడదు. విష్ణు వ్రతం చేసేవారు గుమ్మడికాయ .. పుచ్చకాయ .. వంకాయ వంటి వాటిని తినకూడదు. ఉసిరికాయను అసలే తినకూడదు. ఆకులలోనే భోజనం చేయాలి .. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపైనే నిద్రించాలి.

కార్తీక వ్రతాన్ని ఆచరించేవారి దరిదాపులలోకి కూడా యమభటులు రాలేరు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు వైకుంఠానికి చేరుకుంటారు. యజ్ఞయాగాలకు మించిన ఫలితాన్ని కార్తీక వ్రతం ఇస్తుందని అంటారు. కార్తీక వ్రతాన్ని ఆచరించేవారి కనుచూపు మేరలో కూడా భూత ప్రేతాలు సంచరించలేవు. ఎన్నో తీర్థయాత్రలు చేస్తే కలిగే ఫలితం కార్తీక వ్రతం చేయడం వలన కలుగుతుంది.

కార్తీక శుద్ధ చతుర్థి రోజున ఉద్యాపనం చేయాలి .. లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తిని పూజించాలి. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించి, ఆ మరుసటి రోజున బ్రాహ్మణ సమారాధన చేసి దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి. ఈ విధానంగా చేయడం వలన ఏడు జన్మలుగా వెంటాడుతున్న పాపాలు నసిస్తాయి .. వైకుంఠ పాప్తి కలుగుతుంది అని పృథు చక్రవర్తికి నారద మహర్షి వివరిస్తాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి