Ketaki Sangameshwara Swamy Temple

పరమశివుడు ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో “కేతకీ సంగమేశ్వర క్షేత్రం”(Ketaki Sangameshwara Swamy Temple) ఒకటి. అనేక మహిమాన్వితమైన సంఘటనల సమాహారంగా కనిపించే ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రం – మెదక్ జిల్లా .. జహీరాబాద్ సమీపంలో విలసిల్లుతోంది. “కేతకీ” అంటే మొగలిపువ్వు అని అర్థం. మహా లింగోద్భవం సమయంలో బ్రహ్మదేవుడి సూచనమేరకు అబద్ధమాడిన మొగలిపువ్వు, పరమశివుడి శాపానికి గురైన సంగతి తెలిసిందే. అప్పుడు మొగలిపువ్వు స్వామిని వేడుకోగా, భూలోకంలోని ఒక ప్రదేశంలో కేతకీ వనంగా విస్తరించమనీ, భవిష్తత్తులో తాను అక్కడ ఆవిర్భవిస్తాననీ .. కేతకీ పుష్పాలతో పూజలు అందుకుంటానని అనుగ్రహిస్తాడు.

కేతకీ .. భూలోకానికి చేరుకొని అక్కడ ఒక అందమైన వనంగా మారిపోయింది. ఆ తరువాత కాలంలో పరమశివుడి కోసం తపస్సు చేయడానికిగాను ప్రశాంతమైన ఈ ప్రదేశాన్ని బ్రహ్మదేవుడు ఎంచుకుంటాడు. బ్రహ్మదేవుడు తపస్సుకు మెచ్చిన సదాశివుడు ఆయన అభ్యర్ధన మేరకు అక్కడే కొలువవుతాడు. అలా బ్రహ్మదేవుడి కోరికను .. కేతకికి ఇచ్చిన మాటను శివుడు నెరవేర్చినవాడవుతాడు. అలా కేతకీ వనంలో స్వామివారు వెలసిన క్షేత్రమే ఇది. ఈ క్షేత్రంలో కాశీ నుంచి వచ్చిన గంగ పాయ (ఝరా) ఇక్కడి తీర్థాల్లో కలుస్తుందనీ .. అందువల్లనే దీనిని “ఝరా సంగం” కేతకీ సంగమేశ్వర క్షేత్రమని పిలుస్తుంటారు.

ఈ క్షేత్రంలో స్వామివారు పార్వతీ సమేతుడై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి అమృతకుండం మహిమాన్వితమైనదని స్థలపురాణం చెబుతోంది. ఈ కుండంతో ముడిపడిన కథనం కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఒక రాజు కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఎలాంటి వైద్యులు మందులు ఇచ్చినా .. ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన కేతకీవనం మీదుగా ప్రయాణం చేస్తూ అక్కడ ఆగుతాడు. ఆహ్లాదకరమైన ఆ వనంలో శివలింగం ఉండటం చూస్తాడు. అక్కడి అమృతకుండంలోని నీటితో దాహం .. తాపం తీర్చుకుంటాడు.

అక్కడి నుంచి ఆయన ఇంటికి చేరుకోగానే భార్య చూసి ఆశ్చర్యపోతుంది. తన కుష్ఠువ్యాధి పూర్తిగా తగ్గిపోవడాన్ని ఆ రాజు అప్పుడు గమనిస్తాడు. అమృత కుండంలోని నీటిని తనపై చల్లుకోవడం వల్లనే తన వ్యాధి తగ్గిపోయిందనే విషయాన్ని గ్రహిస్తాడు. తిరిగి ఆ ప్రదేశానికి వెళ్లి .. అక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మించి .. అమృతకుండంలో భక్తులు స్నానమాచరించేలా సౌకర్యాలు కల్పిస్తాడు. ఇక్కడి అమృతకుండంలో స్నానమాచరించడం వలన చర్మవ్యాధులను తగ్గించుకున్నవారు ఎంతోమంది ఉన్నారని చెబుతుంటారు.

సోమవారంతో పాటు కార్తీక మాసంలోను .. శివరాత్రి పర్వదినం రోజున ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. “మాఘ బహుళ దశమి” నుంచి “ఫాల్గుణ శుద్ధ పాడ్యమి” వరకూ స్వామివారికి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తరిస్తారు. అనేక విశేషాల మాలికగా కనిపించే ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Ketaki Sangameshwara Swamy Temple