కాళీయుడు అను ఒక మహాసర్పం .. యమునా తీరంలోని ఒక మడుగులో నివసిస్తూ ఉంటుంది. గరుత్మంతుడి ఆగ్రహానికి గురైన కాళీయుడు, తన భార్య బిడ్డలతో కలిసి ఆ మడుగులో తలదాచుకుంటాడు. మడుగు నుంచి తాను బయటికి వస్తే, గరుత్మంతుడి కంట పడతాననే భయంతో, లోపలే ఉంటూ ఆ మడుగు సమీపంలోకి వచ్చిన జీవులను ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు. ఆ మహాసర్పం విషజ్వాలల వలన, మడుగులో నీరు అంతా కూడా విషపూరితమైపోతుంది. ఆ నీరు తాగిన జీవులు క్షణాల్లో మృత్యువాత పడుతుంటాయి.

ఈ విషయం తెలుసుకున్న చిన్నికృష్ణుడు, ఉన్నపళంగా మడుగులోకి దూకేస్తాడు. కృష్ణయ్య అలా చేస్తాడని ఊహించని గోపాలకులు బిత్తరపోతారు. వెనక్కి వచ్చేయమని పెద్దగా అరవడం మొదలుపెడతారు. మడుగులో నీరు అల్లకల్లోలం అవుతుండటం .. బయటి నుంచి ఏవో శబ్దాలు వినిపించడంతో నీటి పైభాగానికి కాళీయుడు చేరుకుంటాడు. ఒక చిన్నపిల్లవాడు నీటిపై ఈదుతూ కనిపిస్తాడు. తన మడుగు వైపుకు రావడానికే అంతా భయపడుతుంటే, ఒక పిల్లవాడు ధైర్యంగా మడుగులోకి దిగడం చూసి కాళీయుడు ఆశ్చర్యపోతాడు.

పిల్లవాడే కదా అని జాలి పడి వదిలేస్తే, రేపటి నుంచి ప్రతి ఒక్కరూ మడుగులోకి దిగుతారు. అప్పుడు తన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అందువలన ఇకపై ఎవరూ ఈ మడుగువైపు కన్నెత్తకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా కృష్ణయ్య వైపు వేగంగా కదులుతాడు. అది గమనించిన గోపాలకులు ఒడ్డుపై నుంచి అరవడం మొదలుపెడతారు. కాళీయుడు తన తోకతో కృష్ణయ్యను చుట్టేసి, నీళ్లలో ఊపిరి ఆడకుండా చేస్తుంటాడు.

కాళీయుడి తోక పట్టుకుని పైకి ఎగిరి పడగలపైకి చేరుకున్న కృష్ణయ్య, ఎంతమాత్రం భయపడకుండా నాట్యం చేస్తాడు. చూసేవాళ్లకి కాళీయుడి పడగలను కృష్ణయ్య పాదాలతో స్పర్శిస్తున్నట్టుగా కనిపిస్తుందిగానీ, ఆయన బలానికి తట్టుకోలేక .. ఆ బరువును మోయలేక బాధతో కాళీయుడు విలవిలలాడిపోతాడు. తనని మన్నించి ప్రాణాలతో విడిచిపెట్టమని కోరతాడు. దాంతో కృష్ణయ్య కాళీయుడిని వదిలి .. ఆ మడుగు విడిచి వెళ్లమని ఆదేశిస్తాడు. గరుత్మంతుడికి భయపడవలసిన పనిలేదనీ, కాళీయుడి పడగలపై గల తన పాద చిహ్నాలను చూసిన గరుత్మంతుడు ఏమీ చేయడని హామీ ఇస్తాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.