త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఒక రోజున “ద్వారక” చేరుకుంటాడు. రుక్మలోచన దిగాలుగా ఉండటం గమనించిన ఆయన, విషయమేమిటని అడుగుతాడు. దాంతో రుక్మిణీ కలగజేసుకుని, కొన్ని నెలల క్రితం శయ్యా మందిరంలో నిద్రిస్తున్న అనిరుద్ధుడు తెల్లవారేసరికి అదృశ్యమయ్యాడనే విషయం చెబుతుంది. అప్పటి నుంచి అనిరుద్ధుడి కోసం వెదుకుతూనే ఉన్నామని అంటుంది. అయినా ఆయన జాడ తెలియరాలేదని చెబుతుంది. రుక్మలోచనను ఓదార్చడం చాలా కష్టంగా ఉందని అంటుంది.

అనిరుద్ధుడు అసలు ఏమయ్యాడు? .. ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎందుకు అదృశ్యమయ్యాడు? జరిగిన సంఘటన రాక్షస మాయనా? మరేదైననా? అనే విషయం అర్థం కావడం లేదని రుక్మిణి ఆవేదన చెందుతుంది. అనిరుద్ధుడి జాడ తెలుసుకోవడానికి వెళ్లిన వాళ్లలో, ఎవరకూ కూడా తమకి ఆనందాన్ని కలిగించే సమాచారంతో తిరిగిరాలేదని అంటుంది. దాంతో తమకి ఏం చేయాలో పాలుపోవడం లేదని చెబుతుంది. ఈ విషయంలో తమకి ఏదైనా సాయం చేయమని నారదమహర్షిని కోరుతుంది.

మనవడు కనిపించకపోతే ఆ మాత్రం బాధ ఉండటం సహజమేననీ, అయితే ప్రస్తుతానికి అనిరుద్ధుడికి వచ్చిన ప్రమాదమేమీ లేదని నారదుడు అంటాడు. ఆ మాట వినగానే రుక్మిణి కంగారుపడుతూ, అనిరుద్ధుడు ఎక్కడ ఉన్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? అని ఆత్రుతగా అడుగుతుంది. బాణాసురుడు పరిపాలిస్తున్న “శోణపురము”లో ఉన్నాడనీ, ఆయన కుమార్తె అయిన ఉషను గాంధర్వ వివాహమాడాడని నారదుడు చెబుతాడు. అయితే ఈ వివాహం ఇష్టం లేని బాణాసురుడు, అనిరుద్ధుడిని బంధించాడని అంటాడు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన కృష్ణుడు ఆ మాటలు వింటాడు. తన మనవడిని బాణాసురుడు బంధించాడనే విషయం తెలియగానే ఆయన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తనపై గల కోపంతో తన మనవడిని బాణాసురుడు హింసించడం సరికాదని నారదుడితో అంటాడు. తనని ఎవరూ ఎదిరించలేరు అనే అహంభావంతోనే బాణాసురుడు దీనికి పాల్పడ్డాడని చెబుతాడు. బాణాసురిడికి తగిన విధంగా బుద్ధి చెప్పి తన మనవడిని అతని చెర నుంచి విడిపించుకువస్తానని అంటాడు. వెంటనే బాణాసురుడిపై యుద్ధానికి బయలుదేరమని బలరాముడితో చెబుతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.