అనవసరంగా కృష్ణుడిని అనుమానించినందుకు సత్రాజిత్తు పశ్చాత్తాప పడతాడు. నలుగురిలో ఆయనను అనరాని మాటలు అన్నందుకు బాధపడతాడు. కృష్ణుడిని ద్వేషిస్తూ .. ఆయన పట్ల సత్యభామకు గల ప్రేమానురాగాలను అర్థం చేసుకోలేకపోయినందుకు ఆవేదన చెందుతాడు. ఇందుకు శతధన్వుడు .. ప్రసేనజిత్తు ఇద్దరూ కారణమేనని భావిస్తాడు. తన కూతురు ప్రేమ తనకి ముఖ్యం .. ఆమె వివాహం .. అన్యోన్య దాంపత్యం తనకి ముఖ్యం అనుకుంటాడు. ఆమెకి ఆనందాన్ని కలిగించే నిర్ణయాన్ని తీసుకోవడమే సరైనదని భావిస్తాడు.
ఆ క్షణమే బయల్దేరి “ద్వారక” చేరుకుంటాడు. కృష్ణుడిని కలుసుకుంటూనే తనని మన్నించమని కోరతాడు. అజ్ఞానికి మాత్రమే ఆవేశం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని తాను మరోసారి నిరూపించానని అంటాడు. తన మాటలను మన్నించమనీ .. వాటిని మనసులో పెట్టుకోవద్దని కోరతాడు. జరిగినదానికి తాను చాలా బాధపడుతున్నానని చెబుతాడు. బాగా ఆలోచించగా “శ్యమంతకమణి” కృష్ణుడి దగ్గర ఉండటమే సరైనదని అనిపిస్తోందనీ, తీసుకోమని అందజేయబోతాడు.
కృష్ణుడు ఆయనను సున్నితంగా వారిస్తాడు .. “శ్యమంతకమణి”ని అడిగినది తన కోసం కాదనీ, ప్రజల సుఖ సంతోషాల కోసమేనని కృష్ణుడు అంటాడు. ఆ “శ్యమంతకమణి”ని ఆయన దగ్గరే ఉంచి ప్రజా క్షేమం కోసం ఉపయోగించమని జెబుతాడు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడానికి సత్రాజిత్తు అంగీకరిస్తాడు. తన కుమార్తె సత్యభామను పెళ్లి చేసుకోమని సత్రాజిత్తు కోరతాడు. ఆయన కోరిక మేరకు .. సత్యభామ మనోభీష్టం మేరకు కృష్ణుడు ఆమెను చేపడతాడు. అలా సత్యభామ .. కృష్ణుల వివాహం జరుగుతుంది.
అలా రుక్మిని ఎదురించి రుక్మిణీదేవిని .. జాంబవంతుడితో యుద్ధం చేసి “జాంబవతి”ని .. సత్రాజిత్తు మనసు మారేలా చేసి సత్యభామను కృష్ణుడు వివాహం చేసుకుంటాడు. సత్యభామ – కృష్ణుడి వివాహం పట్ల ద్వారక వాసులంతా ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తారు. కృష్ణుడి కారణంగా ద్వారకలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు. రుక్మిణి .. జాంబవతి .. సత్యభామ ముగ్గురూ కూడా ఎవరికి వారు కృష్ణుడి ప్రేమ తమకే అధికంగా దక్కాలనే ఆలోచనలో ఉంటారు. ఎవరి మనసు నొచ్చుకోకుండా కృష్ణుడు నడచుకుంటూ ఉంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.