Kukke Subramanya Swamy Temple
సుబ్రహ్మణ్యస్వామి కొన్ని క్షేత్రాలలో విగ్రహరూపంలోను .. కొన్ని క్షేత్రాలలో సర్పరూపంలోను .. మరికొన్ని క్షేత్రాలలో పుట్ట రూపంలోనూ పూజలు అందుకుంటూ ఉంటాడు. సుబ్రహ్మణ్యస్వామి కొన్ని క్షేత్రాలలో ప్రధాన దైవం గాను .. మరి కొన్ని క్షేత్రాలలో ఉపాలయాలలోను దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాలలో “కుక్కె సుబ్రహ్మణ్యస్వామి”(Kukke Subramanya Temple) క్షేత్రం ఒకటి గా కనిపిస్తూ ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని చెప్పు కోదగిన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి.
పచ్చని ప్రకృతి ఒడిలో .. ఆహ్లాదకరమైన వాతావరణంలో .. “కుమారపర్వతం”పై నిర్మితమైన ఆలయం అందంగా కనిపిస్తూ ఉంటుంది. అందంగా తీర్చదిద్దబడిన ఈ ఆలయంలో స్వామివారు నెమలి వాహనంపై దర్శనమిస్తూ ఉంటాడు. తర్పణ – కుమారధార అనే రెండు నదుల సమీపంలో ఈ ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఈ క్షేత్రంలో అడుగుపెట్టడానికి పురాణ సంబంధమైన కథనం ఒకటి ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. వరబల గర్వితుడైన తారకాసురిడి ఆగడాలను గురించి దేవతలంతా సుబ్రహ్మణ్యస్వామి దృష్టికి తీసుకుని వస్తారు.
దేవతలను .. సాధుజనులను రక్షించడం కోసం .. ధర్మకార్యాలు ఆటంకం కలగకుండా చేయడం కోసం తారకాసురిడిని సుబ్రహ్మణ్యస్వామి సంహరిస్తాడు. ఆ పాపం నుంచి విముక్తిని పొందడం కోసం స్వామి ఇక్కడే తపస్సు చేసినట్టుగా స్థలపురాణం చెబుతోంది. తారకాసురిడిని సంహరించిన శక్తి ఆయుధాన్ని శుభ్రం చేయడానికి స్వామి సృష్టించిన నీటి ప్రవాహమే “కుమారధార” అని చెబుతారు. తారకాసురిడిని సంహరించిన సుబ్రహ్మణ్యస్వామికి దేవేంద్రుడు తన కూతురైన దేవసేనను ఇచ్చి వివాహం చేస్తాడు.
సుబ్రహ్మణ్యస్వామి – దేవసేనల వివాహం ఇక్కడే జరిగిందని చెబుతుంటారు. సర్ప సంబంధమైన దోషాలు ఉన్నవారు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకుని .. ఆ రాత్రికి అక్కడ నిద్రచేసి .. మరునాడు ఉదయం మళ్లీ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతుంటారు. తమ కోరికలు నెరవేరినవారు మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ నాగప్రతిష్ఠలు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా చేయడం వలన, వంశంలో ఎవరికి నాగ దోషాలు ఉన్నప్పటికీ తొలగిపోతాయని చెబుతారు.
మార్గశిర శుద్ధ షష్ఠి నాడు స్వామివారికి ప్రత్యేకమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ దర్శనం అఞ్ఞతరం “పుట్టమన్ను”ను ప్రసాదంగా ఇస్తుంటారు. దీనిని “పుట్టబంగారం” అని పిలుస్తుంటారు. ఈ పుట్టమన్నును శరీరం పై రాసుకోవడం వలన చర్మ సంబంధమైన వ్యాధులు దరిచేరవని అంటారు. ఎంతోమంది మహర్షులు ఇక్కడి స్వామివారిని సేవించి తరించారు. అలాంటి ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త దోషాలు తొలగిపోయి .. సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Kukke Subramanya Temple