శ్రీమహా విష్ణువు ధరించిన అవతారాలు .. లోక కళ్యాణం కోరి ధరించిన ఆ అవతార విశేషాలను గురించి వివరించమని శుక మహర్షిని పరీక్షిత్ మహారాజు కోరతాడు. అప్పుడు ఆయనకు శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో మొదటి అవతారమైన కూర్మావతారాన్ని గురించి శుకమహర్షి వివరించడం మొదలుపెడతాడు. ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా అంతరించిపోతుంది. బ్రహ్మదేవుడు మళ్లీ సృష్టిచేయడానికి పూనుకుంటాడు. అయితే సృష్టికి ఆధారమైన వేదాలు కనిపించకపోవడంతో ఆయన ఆందోళన చెందుతాడు.

వేదాలు దొంగిలించబడ్డాయనే విషయాన్ని శ్రీమహావిష్ణువుతో బ్రహ్మదేవుడు చెబుతాడు. బ్రహ్మదేవుడు సృష్టిరచన చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను హయగ్రీవుడనే రాక్షసుడు అపహరించాడనే విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది. వేదాలను ఒక పెట్టెలో భద్రపరిచిన హయగ్రీవుడు, వాటిని తీసుకుని వెళ్లి సముద్రగర్భంలో దాచేస్తాడు. ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీమహావిష్ణువు “మత్స్యావతారం” ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు. మత్స్యావతారంలో వచ్చింది సాక్షాత్తు శ్రీమహా విష్ణువు అనే విషయం హయగ్రీవుడికి అర్థమైపోతుంది.

అయినా ఎంతమాత్రం భయపడకుండగా ఆయన నుంచి తప్పించుకోవడానికి హయగ్రీవుడు శతవిధాలా ప్రయత్నిస్తాడు. స్వామి మత్స్య రూపాన్ని అంతకంతకూ పెంచుతూ హయగ్రీవుడి వెంటపడతాడు. మత్స్య రూపం సముద్రాన్నే ఆక్రమిస్తున్నట్టుగా పెరిగిపోతూ ఉంటుంది. దాంతో సముద్రగర్భంలో చీకట్లు కమ్ముకుంటాయి. ఎటు వెళ్లాలనేది హయగ్రీవుడికి అర్థంకాదు. దాంతో ఆయన అయోమయానికి లోనవుతాడు. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని తెలిసి, స్వామిని ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు.

శ్రీమహావిష్ణువు తన ఎదురుగా నిలిచిన హయగ్రీవుడిపైకి దూసుకెళతాడు. హయగ్రీవుడు ఆ వేగానికే తట్టుకోలేకపోతాడు. వేదాలను అపహరించి లోకాలను చీకట్లలో ఉండేలా చేయాలనే హయగ్రీవుడిపై స్వామి విరుచుకుపడతాడు. ఇకపై అసురులు ఎవరూ ఇలాంటి పనికి పూనుకోకుండా .. అలాంటి ఆలోచన వస్తేనే భయపడేలా హయగ్రీవుడిని సంహరిస్తాడు. సముద్రగర్భంలో ఆయన దాచిన వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. లోక కళ్యాణం కోసం హయగ్రీవుడిని అంతమొందించిన స్వామిని ఇంద్రాది దేవతలు కొనియాడతారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో  సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.