Mattapalli Lakshmi Narasimha Swamy Temple
లోక కళ్యాణం కోసం హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామి, ఆ తరువాత మహర్షుల అభ్యర్థనతో అనేక క్షేత్రాలలో ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడిని తన గోళ్లతో సంహరించిన స్వామి .. ఆ అసురుడి రక్తం గోళ్లలోకి పోయి స్వామిని బాధిస్తూ ఉంటే, ఆ స్వామికి అనేక విధాలుగా లక్ష్మీదేవి ఉపశనం కలిగించింది. అందువలన ఆయన లక్ష్మీదేవితో కలిసి చాలా ప్రదేశాలలో వెలిశాడు. అయితే తాను ఎవరినైతే కాపాడటానికి నరసింహస్వామిగా అవతరించాడో ఆ ప్రహ్లాదుడితో కలిసి వెలసిన క్షేత్రం ఒకటి ఉంది .. అదే “మట్టపల్లి”.
కృష్ణా నదీ తీరంలోని పంచనారసింహ క్షేత్రాలలో ఒకటిగా మట్టపల్లి వెలుగొందుతోంది. సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. కృష్ణానదీ సమీపంలోని ఈ క్షేత్రంలో స్వామి గుహలో దర్శనమిస్తూ ఉంటాడు. గుహలో స్వామివారు ఆదిశేషుడు పడగ నీడలో ప్రహ్లాదుడితో కలిసి కొలువైన ఆనవాళ్లు పెద్ద బండరాయిపై కనిపిస్తూ ఉంటాయి. కాస్త దిగువున రాజ్యలక్ష్మిదేవి రూపం గోచరిస్తూ ఉంటుంది. ఒక భక్తుడితో కలిసి భగవంతుడు ఆవిర్భవించిన అద్భుతమైన ఘట్టానికి ఈ క్షేత్రం సాక్షీ భూతంగా కనిపిస్తూ ఉంటుంది.
పూర్వం ఈ ప్రాంతమంతా అడవీ ప్రాంతగా ఉండేది .. ఇప్పుడున్న ఈ గుహ వైపుకు ఎవరూ వచ్చేవారు కాదు. అసలు ఇక్కడ ఒక గుహ ఉందనే విషయం కూడా ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మాచిరెడ్డి అనే భక్తుడికి స్వామివారు స్వప్నంలో కనిపించి తన జాడను తెలియజేశాడట. రైతు కుటుంబానికి చెందిన మాచిరెడ్డిని అనుముల మాచిరెడ్డి అంటారు. అనుముల ఇంటిపేరుగా మారడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది.
“తంగెడ” గ్రామానికి చెందిన మాచిరెడ్డి కోడలు మహా భక్తురాలట. ఒకరోజున ఆమె అనుములను పొలంలో చల్లడానికి తీసుకుని వెళుతుంటే, కొంతమంది జంగమదేవరలు ఎదురై .. ఆమె దగ్గర ఏది ఉంటే అది దానం చేయమని కోరారట. దాంతో ఆమె తన దగ్గరనున్న అనుములను దానం చేసేసింది. అయితే పొలం దగ్గరున్న మామ తిడతాడని భావించిన ఆమె, అనుములకు బదులుగా పొలంలో ఇసుకను చల్లింది. దైవానుగ్రహం వలన అసలు అనుములకు బదులుగా బంగారు అనుముల పండాయట.
బంగారు అనుములతో ఆయన తన ఊరును అభివృద్ధి చేశాడు. అప్పటి నుంచి అంతా ఆయనను అనుముల మాచిరెడ్డి అనేవారు. ఆయన స్వప్నంలోనే స్వామి దర్శనమిచ్చి తన జాడను తెలియజేశాడు. గ్రామస్తులను వెంటబెట్టుకుని వెళ్లి స్వామి జాడను తెలుసుకున్నాడు. అప్పటి నుంచి స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు జరిగేలా చూసుకున్నారు. విశేషమైన పర్వదినాల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పూర్వం ఈ ప్రదేశంలో తపస్సు చేసిన భరద్వాజ మహర్షి, త్రేతాయుగంలో దేవతలతో .. ద్వాపరయుగంలో మహర్షులతో పూజాభిషేకాలు అందుకున్న స్వామి, కలియుగంలో మానవులతో పూజలు అందుకోవలసినదిగా కోరడంతో స్వామి అందుకు అంగీకరించారని అంటారు. ఈ క్షేత్ర దర్శనం వలన గ్రహ సంబంధమైన దోషాలు .. దుష్టశక్తుల పీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి