Mellacheruvu Shambu Lingeswara Swamy Temple
తెలంగాణ ప్రాంతంలో విలసిల్లుతున్న ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో “మేళ్ల చెరువు”(Mellacheruvu) ఒకటిగా కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా .. కోదాడ సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడి స్వామివారిని శంభులింగేశ్వరస్వామిగా భక్తులు కొలుస్తుంటారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం .. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతుంటుంది. ఇక్కడి స్వామివారు ఈ ప్రదేశంలో ఎప్పుడు ఆవిర్భవించారో .. ఎవరిచే పూజాభిషేకాలు అందుకున్నారనేది ఎవరికీ తెలియదు. కాకతీయుల కాలంలో స్వామివారు వెలుగులోకి వచ్చారు.
కాకతీయుల పాలానా కాలంలో స్వామివారికి ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి నిత్యపూజాభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడి శివలింగం రెండు ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. శివలింగం ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకూ ఎదుగుతూ వెళుతోంది. అర్చకులు శివలింగం మధ్య భాగంలో బొట్టు పెడుతూ వస్తున్నారు. అలా బొట్టు పెట్టడం వలన ఏర్పడిన గుర్తులను బట్టి చూసుకుంటే శివలింగం ఎదుగుతూ ఉందనే విషయం అర్థమవుతుంది.
ఇక ఇక్కడికి దగ్గరలో ఎలాంటి జలాశయాలు లేవు. అయినప్పటికీ తల భాగంలోని రంధ్రం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు శివలింగంలోకి ఎలా వస్తుందనేది ఎవరికీ తెలియడు. ఆ రంధ్రంలో నుంచి ఎంతనీరు బయటికి తీస్తే అంతవరకే ఊరడం జరుగుతూ ఉంటుంది. ఆ రంధ్రాన్ని దాటుకుని మాత్రం నీరు బయటికి రాదు. అర్చకులు ఈ నీటినే తీర్థంగా ఇస్తుంటారు. ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండటం .. చల్లగా ఉండటం విశేషం. ఇదంతా కూడా భగవంతుడి లీలా విశేషంగానే చెప్పుకుంటూ ఉంటారు.
సాధారణ రోజుల్లో భక్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. శివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు మాత్రం వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగే ఎడ్ల పందాలు ప్రత్యేకమైన ఆకర్షణ. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కానుకలు .. ముడుపులు సమర్పించుకుంటూ ఉంటారు.
శంభులింగేశ్వరస్వామి దర్శనం వలన సమస్త పాపాలు .. దోషాలు నశించిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని అంటారు. ఇక ఈ స్వామి దర్శనం వలన ఆపదలు .. అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భావిస్తుంటారు. తెలంగాణ ప్రాంతంలో జరిగే అతిపెద్ద జాతరలలో మేళ్లచెరువు జాతర ఒకటి. జాతర సమయంలో ఇక్కడ జరిగే సందళ్లు .. సంబరాలు చూసి తీరవలసిందే.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Mellacheruvu Shambu Lingeswara Swamy Temple