శ్రీకృష్ణుడి లీలా విశేషాలు తలచుకుంటే తనువు పులకరిస్తుంది .. మనసు పరవశించిపోతుంది. ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు కొన్నయితే . ఆ స్వామి తిరుగాడిన క్షేత్రాలు మరికొన్ని. అలా ఆ స్వామికి సంబంధించిన క్షేత్రాలలో ద్వారక .. మధుర .. బృందావనం .. ఇలా ఎన్నో కనిపిస్తాయి. “బృందావనం” విషయానికే వస్తే, ఇది రాధాకృష్ణుల రమణీయ దృశ్య కావ్యంగా కనిపిస్తుంది. ఇక్కడ చెట్టూ .. పుట్టా .. గుట్టా .. గూడు అన్నీ కూడా స్వామివారి లీలా విశేషాలను గురించి చెప్పడానికి తహతహలాడుతున్నట్టుగా అనిపిస్తుంది.

ఉత్తరప్రదేశ్ లోని “మధుర” జిల్లా పరిథిలో .. యమునా నదీతీరంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. బృందావనంలో అడుగుపెట్టడానికి అదృష్టం .. పూర్వజన్మ పుణ్యవిశేషం వెంటరావాలనే విషయం అక్కడికి వెళ్లిన తరువాత అర్థమవుతుంది. రాధాకృష్ణులకు సంబంధించిన గుర్తులను .. వారి ఆటపాటలకు సంబంధించిన ప్రదేశాలను .. యమునా తీరంతో వాళ్లకి గల అనుబంధాన్ని చూసుకుంటు వెళుతుంటే మనసు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంది. మరి కాసేపట్లో రాధాకృష్ణులను చూడబోతున్నామనే అనిపిస్తుంది.

రాధారమణల ఆలయం .. బడే కుంజ్ .. సేవాకుంజ్ .. బీర్ ఘాట్ … కాళీయ ఘాట్ .. నిధివన్ .. రాధాకృష్ణుల శయ్యా మందిరం .. ఇలా అనేక ప్రదేశాలు ఇక్కడ చూడదగినవిగా కనిపిస్తాయి. “నిధివన్” పరిధిలో రాధాకృష్ణుల శయ్యా మందిరం కనిపిస్తూ ఉంటుంది. రాత్రివేళలో రాధాకృష్ణులకు సుగంధ ద్రవ్యాలను .. పాలు – పండ్లు .. తీపి పదార్థాలు .. తాంబూలం ఇక్కడ ఉంచుతారు. ఆ తరువాత తాళాలు వేసేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకుండా వెళ్లిపోతారు. ఆ మరునాడు ఉదయం తాళాలు తీసేసి చూస్తే తీపి పదార్థాలు కొంత తినేసి .. తాంబూలం నమిలేసి .. అలంకరణ వస్తువులు పెట్టిన స్థానంలో లేకుండా కనిపిస్తాయి.

ఇది ఎలా సాధ్యమనేది పరిశీలించడానికీ .. పరిశోధన చేయడానికి ఎవరు ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇక ఇప్పటికీ నిధివన్ నుంచి రాత్రివేళలో వేణుగానం వినిపిస్తూ ఉంటుందని చెబుతుంటారు. రాధాకృష్ణుల ఏకాంతానికి ఎవరూ భంగం కలిగించడానికి ప్రయత్నం చేయరు. అసలు ఆ వనంలో ఏం జరుగుతుందో చూడాలనే ఆసక్తితో రహస్యంగా ప్రయత్నించిన వాళ్లెవరూ ప్రాణాలతో లేరని చెబుతారు. అలాంటి సాహసాలు చేయవద్దనే హెచ్చరిక కూడా అక్కడ కనిపిస్తుంది. ఆ నిధివనంలో ఉన్న చెట్లన్నీ గోపికల రూపాలేనని విశ్వసిస్తూ ఉంటారు.

ఒకసారి శివుడు కూడా స్త్రీ వేషాన్ని ధరించి వచ్చి .. గోపికలతో కలిసి పాల్గొనగా, ఆయన మేలిముసుగు తొలగిపోయి దొరికిపోయాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఇక్కడి “బడేకుంజ్”లో శివలింగానికి రాత్రివేళలో స్త్రీ అలంకరణ చేస్తారు. ఇక్కడి ఈశ్వరుడిని “గోపీశ్వరుడు”గా కొలుస్తూ ఉంటారు. ఇలా బృందావనం అంతా కూడా అడుగుగడునా అనేక విశేషాలను ఆవిష్కారిస్తూ ఉంటుంది. మళ్లీ జన్మంటూ ఉంటే కృష్ణుడి కాలంలో .. ఆయన మిత్రబృందంలోనో .. ఆయన గోపికలలో ఒకరిగానో పుట్టాలనిపిస్తుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.