కాలయవనుడిని తప్పించుకోవడం కోసం కృష్ణుడు ఒక గుహలోకి ప్రవేశిస్తాడు. అది చూసిన కాలయవనుడు .. ఆ వెనుకనే ఆ గుహలోకి వెళతాడు. పొడవైన .. విశాలమైన ఆ గుహలో అంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలోనే ఆయన కృష్ణుడి కోసం వెతకడం మొదలుపెడతాడు. ఎక్కడా కృష్ణుడు కనిపించకపోవడంతో లోపల అంగుళం .. అంగుళం వెతకసాగాడు. ఆ గుహలో ఒక చోట ఒకరు ముసుగుపెట్టి పడుకోవడం చూస్తాడు. తన బారి నుంచి తప్పించుకోవడం కోసమే కృష్ణుడు అలా నటిస్తున్నాడని భావిస్తాడు.
ముసుగుపెట్టి పడుకున్న వ్యక్తి దగ్గరకి కాలయవనుడు వెళతాడు. ఎక్కడ ఉన్నా .. ఎన్ని వేషాలు వేసినా తన నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదని కాలయవనుడు అంటాడు. కృష్ణుడు తన చేతికి చిక్కడం అసంభవమనీ .. అసాధ్యమని చాలామంది చెప్పారనీ, అలాంటి వాళ్లందరికి తానేమిటనేది తెలుస్తుందని గర్వంతో పలుకుతాడు. ముసుగు తొలగించి బయటికి వస్తే బలాబలాలు తేల్చుకుందామని అంటాడు. అయినా ఎలాంటి సమాధానం రాకపోవడంతో, లేవమంటూ కాలయవనుడు తన కాలితో ఒక్క తన్ను తంతాడు.
కాలయవనుడు అలా తన్నడంతో అప్పటివరకూ ముసుగుపెట్టి పడుకున్న “ముచుకుందుడు” నెమ్మదిగా ముసుగు తొలగిస్తాడు. కృష్ణుడికి బదులుగా అక్కడ ఎవరో ఉండటం చూసి కాలయవనుడు బిత్తరపోతాడు. కృష్ణుడు ఎక్కడికి పోయాడు? ఏమైపోయాడు? అన్నట్టుగా ఆయన కోసం చుట్టూ చూస్తుంటాడు. తనకి నిద్రాభంగం కలిగించింది ఎవరూ? అనుకుంటూ ముచుకుందుడు కళ్లు నలుపుకుంటూ లేస్తాడు. ఆయన కళ్లు తెరిచి చూడగానే తీక్షణమైన ఆ శక్తికి కాలయవనుడు ఒక్కసారిగా భస్మమైపోతాడు.
ఏళ్లపాటు నిద్రలో ఉండి లేచిన కారణంగా ఏం జరిగిందనేది ముచుకుందుడికి అర్థం కాదు. తన గుహలోకి ప్రవేశించింది ఎవరు? తనని నిద్రలో నుంచి లేపింది ఎవరు? తనతో వాళ్లకి గల పనేమిటి? ఇలా ముచుకుందుడు ఆలోచన చేస్తుంటాడు. తన కళ్ల ఎదురుగా పోగుపడిన భస్మ రాశిని చూస్తాడు. అనవసరంగా తనని నిద్ర నుంచి మేల్కొలిపి తన ప్రాణాలను పోగోట్టుకున్నాడని అనుకుంటాడు. అలా ప్రాణాలను కోల్పోయినది ఎవరో అనుకుంటూ తనలో తానే ఆలోచన చేస్తుంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.