పరమశివుడిని అవమానపరచాలనే ఉద్దేశంతో దక్షుడు నిరీశ్వర యాగం చేస్తాడు. ఆ విషయం సదాశివుడికి అర్థమవుతుంది. అయితే తండ్రి మనసులో ఏవుందో తెలియని సతీదేవి, భర్త మాటను కాదని తను అక్కడికి వెళుతుంది. అక్కడికి వెళ్లిన తరువాత ఆమెకి విషయం అర్థమవుతుంది. తాను రావడానికి తన భర్త ఎందుకు అభ్యంతర పెట్టాడనేది స్పష్టమవుతుంది. దాంతో యోగాగ్నిలోకి ప్రవేశిస్తుంది. విషయం తెలిసిన శివుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ఆ తరువాత బాధతో సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని తిరుగుతుంటాడు.

సతీదేవి ధ్యాసలో నుంచి శివుడిని బయటికి తీసుకుని రావడానికిగాను, ఆయన భుజంపై ఉన్న సతీదేవి దేహాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలు చేస్తాడు విష్ణుమూర్తి. సతీదేవి దేహంలోని భాగాలు పడిన ప్రదేశాలే “శక్తిపీఠాలు”గా ఆవిర్భవించాయి. అలాంటి శక్తి పీఠాలలో ఒకటిగా “నైనతాల్” కనిపిస్తుంది. అమ్మవారి ఎడమ నేత్రం ఈ ప్రదేశంలో పండిందని స్థలపురాణం చెబుతోంది. అమ్మవారి నేత్రం ఇక్కడ పడటంతోనే విశాలమైన సరస్సుగా మారిపోయింది. అందువల్లనే దానిని నైనీ సరస్సుగా పిలుస్తుంటారు .. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో .. నైనితాల్ జిల్లా కేంద్రంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఎంతోమంది మహర్షులు ఈ ప్రదేశంలో తపస్సు చేసేవారని చెబుతారు. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉండటం వలన ఇప్పటికీ చాలామంది యోగులు నైనితాల్ ను తమ ధ్యానానికి తగిన ప్రదేశంగా భావిస్తుంటారు. ఇక్కడ అమ్మవారు “నైనాదేవి” పేరుతో పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆ పక్కనే వినాయకుడు .. భైరవుడు కొలువై దర్శనమిస్తూ ఉంటారు. ఇక అమ్మవారి ప్రధానమైన ద్వారం దగ్గరే హనుమంతుడు దర్శనమిస్తూ ఉంటాడు. హనుమ ఎడమచేతిలో గదా ఉండటం ఇక్కడి విశేషం.

ఇక 18వ శతాబ్దంలో ఒక భక్తుడు అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి .. నిత్య పూజలకు సంబంధించిన ఏర్పాట్లు చేశాడట. ఆ తరువాత ప్రకృతి విపత్తు కారణంగా ఆలయం పడిపోయింది .. అమ్మవారి మూర్తి మరుగున పడిపోయింది. అలా కొంతకాలం గడిచిపోయింది. ఆలయం నిర్మించిన భక్తుడు కాలం చేయడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో ఆ భక్తుడి కుమారుడికి అమ్మవారు స్వప్న దర్శనమిచ్చి, తన జాడను తెలియజేసిందట.

అమ్మవారు ఇచ్చిన సూచనల మేరకు ఆ భక్తుడి కుమారుడు అమ్మవారి జాడను తెలుసుకుని ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి అమ్మవారికి నిత్య పూజలు జరుగుతూనే వస్తున్నాయి. అమ్మవారి క్షేత్ర వైభవం పెరుగుతూనే వెళ్లింది. అమ్మవారు .. తన నేత్రాలే ప్రధానమన్నట్టుగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. ఆ తల్లి చల్లని చూపు తమపై పడితే చాలు అన్నట్టుగా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. మనసులోని ధర్మబద్ధమైన కోరికలను చెప్పుకుంటారు. తన కోరిక నెరవేరితే వెండితోగానీ .. బంగారంతో గాని చేసిన నేత్రాలను మొక్కు బడులుగా చెల్లిస్తుంటారు.

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.