Mangalagiri – Panakala Lakshmi Narasimha Swamy

శ్రీమహావిష్ణువు లోక కల్యాణం కోసం ధరించిన దశావతారాలలో నాల్గొవదిగా నరసింహస్వామి అవతారం కనిపిస్తుంది. మిగతా అవతారాల మాదిరిగా స్వామివారు ఒక వ్యూహ రచన చేయకుండా .. అప్పటికప్పుడు ధరించిన అవతారం ఇది. అదే ఈ అవతారం యొక్క ప్రత్యేకత. తన భక్తుడిని రక్షించడం కోసం .. తాను ఉన్నాననే ఒక బలమైన విశ్వాసాన్ని లోకాలకు కలిగించడం కోసం స్వామి ఈ అవతారాన్ని ధరించాడు. హిరణ్యకశిపుడి సంహారం జరిగిన తరువాత స్వామివారు తన అవతారకార్యానికి తగిన విధంగానే ఎక్కువగా కొండలపై .. గుహలలో ఆవిర్భవించాడు.

అలా స్వామివారు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో ఒకటిగా “మంగళగిరి”(Mangalagiri) కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ .. గుంటూరు జిల్లాలో విలసిల్లుతోంది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు నిర్మించిన ఎత్తైన గోపురం ఈ క్షేత్ర వైభవాన్ని చాటుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంతటి ఎత్తైన గాలి గోపురం ఇదేనని అంటారు. ఈ కొండపై భాగంలో స్వామిని పానకాల నరసింహస్వామి అంటారు. ఇక్కడి స్వామికి భక్తులు “పానకం” సమర్పిస్తుంటారు. స్వామివారు ఇక్కడ విగ్రహ రూపంలో కనిపించరు. గుహ గోడకి గల బిలమే స్వామి ముఖాకృతిగా భావన చేస్తుంటారు.

స్వామివారి నోట్లో చెంబుతో పానకం పోసినా సగమే లోపలికి వెళుతుంది .. బిందెతో పోసినా సగమే లోపలోకి వెళుతుంది. మిగిలిన దానిని భావించి భక్తులు స్వీకరిస్తూ ఉంటారు. స్వామివారి ఆవిర్భావమే ఉగ్రనరసింహస్వామిగా జరిగింది. అందువలన ఆయనను శాంతపరచడానికీ .. చలవ చేయడానికి పానకాన్ని సమర్పించడమనేది పూర్వకాలం నుంచి వస్తోంది. అనునిత్యం భక్తులు పొసే ఈ పానకమంతా ఎటు పోతోంది .. ఏమైపోతోంది అనేది ఎవరికీ తెలియదు.

కొండ శిఖర భాగంలోని స్వామిని “గండాలయ్య స్వామి” అంటారు. “గండా దీపం” మొక్కును ఇక్కడే తీర్చుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా గండం ఎదురైనప్పుడు దానిని నుంచి బయటపడితే “గండా దీపం” తీయిస్తానని మొక్కుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లంతా ఈ క్షేత్ర దర్శనం చేసుకుని ఇక్కడ దీపం పెడుతుంటారు. ఇక కొండకి దిగువున లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామిని పాండవులు ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది.

మంగళగిరి స్వామి దర్శనం సాయంత్రం వేళ ఉండదు. సాయంత్రం తరువాత కొండపైకి భక్తులు వెళ్లరు. ఆ సమయంలో దేవతలు అదృశ్య రూపంలో వచ్చి స్వామివారిని సేవిస్తారు. వాళ్లకి అంతరాయం కలిగించరాదనే ఉద్దేశంతో ఇక్కడ ఈ నియమం కనిపిస్తుంది. ఆయా రాజుల ఏలుబడిలో ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతూ వచ్చింది. అందుకు సంబంధించిన శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి. మంగళగిరి ఉత్సవాల్లో రథోత్సవం విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. ఈ రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. రథంపై స్వామివారిని చూడటం వలన మోక్షం లభిస్తుందనేది పురాణాలు ప్రస్తావించిన మాట.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Mangalagiri – Panakala Lakshmi Narasimha Swamy