Pattiseema – Sri Veerabhadra Swamy Temple

సాధారణంగా వీరభద్రుడు .. ప్రళయకాల రుద్రుడిలా కనిపిస్తూ ఉంటాడు. కానీ వీరభద్రుడు లింగ రూపంలో కొలువైన క్షేత్రం ఒకటి ఉంది .. అదే “పట్టిసీమ” .. దీనినే పట్టసాచల క్షేత్రమని పిలుస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా .. గోదావరి తీరంలో .. రాజమండ్రికి సమీపంలో ఈ క్షేత్రం దర్శనమిస్తూ ఉంటుంది. భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటూ ఉండగా, క్షేత్రపాలకుడిగా భావనారాయణస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. పురాణాలలో సైతం ఈ క్షేత్రం ప్రస్తావన ఉంది. చోళులు .. చాళుక్యల కాలంలో ఆలయ నిర్మాణం జరిగినట్టుగా చరిత్ర చెబుతోంది.

జాంబవంతుడు ఇక్కడి కొండపై తపస్సు చేయగా శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. తన సేవలు అందుకుంటూ అదే కొండపై కొలువై ఉండమని జాంబవంతుడు కోరాడు. భవిష్యత్తులో పరమశివుడు కూడా ఆ కొండపై కొలువై ఉంటాడని తెలిసిన స్వామి భావనారాయణస్వామిగా అక్కడ కొలువైయ్యాడు. ఇక శివుడిని అవమానించి సతీదేవి అగ్నిప్రవేశం చేయడానికి కారణమైన దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడు తన “జట” నుంచి వీరభద్రుడుని సృష్టిస్తాడు, దక్షుడి తలను నరకమని ఆదేశిస్తాడు, దక్షుడి శిరస్సును “పట్టసం” అనే ఆయుధంతో ఖండించిన వీరభద్రుడు .. దానిని ఇక్కడి గోదావరిలో కడుగుతాడు. అందువల్లనే ఈ క్షేత్రానికి పట్టిసీమ అనే పేరు వచ్చింది.

ఇక్కడి కొండపై ఉగ్రుడైన వీరభద్రుడిని శాంతిపజేయడానికి శ్రీమహావిష్ణువు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో ఆయన సుదర్శన చక్రాన్ని వీరభద్రుడు మింగేస్తాడు. వీరభద్రుడి రూపంలో ఉన్నది శివుడనే విషయం ఆయనకి అర్థమవుతుంది. అప్పుడు ఆయనను సహస్ర కమలాలతో అర్చిస్తాడు. ఒక కమలం తక్కువైతే అందుకు బదులుగా తన నేత్రాన్ని అర్పించడానికి సిద్ధపడతాడు. అప్పుడు స్వామికి సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేసిన శివుడు .. అక్కడే లింగరూపంలో ఆవిర్భవిస్తాడు. అమ్మవారు భద్రకాళిగా పూజలు అందుకుంటూ ఉంటుంది.

ఇక భాగవతంలో అత్యంత కీలకమైన ఘట్టంగా కనిపించే “గజేంద్రమోక్షం” ఘట్టం ఇక్కడే జరిగిందని స్థలపురాణం చెబుతోంది. పూర్వం అగస్త్య మహర్షి శాపానికి గురైన ఇంద్రద్యుమ్నుడనే హరి భక్తుడు ఏనుగులా మారిపోయి ఇక్కడి దేవకూట పర్వత ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాడు. ఇక దేవలముని శాపం కారణంగా మొసలిగా మారిపోయిన “హూ హూ” అనే గంధర్వుడు ఇక్కడి సరోవరంలో జీవిస్తూ ఉంటాడు. ఒక రోజున ఆ ఏనుగు ఆ సరోవరంలోకి దిగినప్పుడు ఆ మొసలి దాని కాలు పట్టుకుంటుంది. దాని బారి నుంచి బయటపడటానికి ఏనుగు ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది.

అప్పుడు ఆ ఏనుగు పూర్వ జన్మ స్మృతి వలన శ్రీహరిని ప్రార్ధిస్తుంది. ఆ స్వామి దానిని కాపాడే కంగారులో శంఖు చక్రాలు తారుమారు అయినా పట్టించుకోకుండా వచ్చి ఏనుగును రక్షిస్తాడు. స్వామి అనుగ్రహంతో ఏనుగుకు .. మొసలికి కూడా శాప విమోచనం అవుతుంది. ఈ సంఘటనకి గుర్తుగా ఇక్కడ ఒక కొండపై ఏనుగు ఆకారంలో ఒక శిల కనిపిస్తూ ఉంటుంది. దానిని “ఏనుగు కొండ” అని పిస్తుంటారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ ఐదు రోజులపాటు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడి శివకేశవుల దర్శనం వలన సమస్త పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.