Sri Bhagavatam – Hiranyakashipu Punishes Prahlad

ప్రహ్లాదుడు తన మాట వినకపోవడం హిరణ్యకశిపుడికి ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. ఇక ఆలస్యం చేయకూడదనీ, తగిన విధంగా ప్రహ్లాదుడిని దండించవలసిందేననే అభిప్రాయానికి హిరణ్యకశిపుడు వస్తాడు. దాంతో ఆయనను శాంతపరచడానికి లీలావతి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రహ్లాదుడు పసివాడనీ … అతని మాటలను పట్టించుకోవలసిన అవసరం లేదని చెబుతుంది. తాను ఏం మాట్లాడుతున్నది తనకి తెలియదనీ, తండ్రి గొప్పతనం తెలియక పోవడం వలన అతను అలా ప్రవర్తిస్తున్నాడని అంటుంది.

ప్రహ్లాదుడు బాలుడే అయితే చెప్పినమాట వినేవాడనీ, హెచ్చరిస్తే భయపడేవాడని హిరణ్యకశిపుడు అంటాడు. తాను ఏం మాట్లాడుతున్నది తెలిసే అతను మాట్లాడుతున్నాడనీ, చాలా తక్కువ కాలంలో వేదాలు వంటబట్టించుకున్నాడని గురువులు చెప్పిన మాటలను మరిచిపోవద్దని చెబుతాడు. అతను కావాలనే తన శత్రువైన విష్ణువును పదే పదే గుర్తుకు తెస్తున్నాడనీ, ఆ విధంగా తనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని అంటాడు. అందువలన అతనికి శిక్ష పడవలసిందేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.

తన అనుచరులను పిలిచి ప్రహ్లాదుడిని చీకటి గదిలో బంధించమని ఆదేశిస్తాడు. శ్రీహరి నామాన్ని ఇకపై తలవనని అతను చెప్పిన తరువాతనే బయటికి వదలమని చెబుతాడు. ప్రహ్లాదుడు భయపడతాడేమోనని లీలావతి ఆందోళన చెందుతుంది. తాను ఎంతగా చెబుతున్నా భర్త పట్టించుకోకపోవడంతో కన్నీళ్ల పర్యంతమవుతుంది. హిరణ్యకశిపుడి ఆదేశం మేరకు ఆయన అనుచరులు ప్రహ్లాదుడిని తీసుకెళ్లి చీకటిగదిలో బంధిస్తారు. భయంతో అతను మనసు మార్చుకోవడం ఖాయమని వాళ్లంతా అనుకుంటారు.

చీకటిగదిలో ఎటు వైపు ఏముందో తెలియక ప్రహ్లాదుడు అడుగుముందుకు వేయలేక వెంటనే శ్రీహరిని ధ్యానిస్తాడు. ఆ గది అంతా కూడా ఒక్కసారిగా వెలుగు పరుచుకుంటుంది. ఆ చీకటిగదిలో కూడా ప్రహ్లాదుడు హరినామస్మరణ చేస్తూ కూర్చుంటాడు. అది చూసిన హిరణ్యకశిపుడి అనుచరులు ఆశ్చర్యపోతారు. ఆ విషయాన్ని ఆయనకి తెలియజేస్తారు. ఆకలిదప్పుల ఆలోచన లేకుండా .. కటిక చీకటిలో కూడా భయమనేది లేకుండా ఉన్న ప్రహ్లాదుడిని చూసి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోతాడు. అంతటా హరి ఉండగా తనకి భయమేల ఉంటుందని ప్రహ్లాదుడు అనడంతో మండిపడతాడు.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.