Penuganchiprolu Tirupatamma Temple
ఒక ఇంటికి గారాల కూతురు .. మహా భక్తురాలు .. అత్తారింటికి పోయిన తరువాత అన్నీ అష్టకష్టాలే. అయినా భర్త కోసం భరిస్తుంది .. సహిస్తుంది. ఆ తర్వాత ఊళ్లోని వాళ్లంతా చూస్తుండగానే తాను అమ్మవారి అంశనని చెబుతూ అదృశ్యమైన కథలు జానపదుల మధ్యలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మనిషిగా జన్మించి .. మనుషుల మధ్య తిరిగి పవిత్రమైన జీవితాన్ని గడిపి దేవతలుగా పూజలందుకుంటున్నవారి క్షేత్రాలు కొన్ని కనిపిస్తాయి. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాలలో పెనుగంచిప్రోలు తిరుపతమ్మ క్షేత్రం (Penuganchiprolu Tirupatamma Temple) ఒకటిగా కనిపిస్తుంది.
ఈ క్షేత్రం కృష్ణా జిల్లా .. జగ్గయ్యపేటకు సమీపంలో విలసిల్లుతోంది. ఇక్కడ ప్రధానమైన దైవం తిరుపతమ్మ తల్లి. చాలాకాలం క్రిందట ఇక్కడికి సమీపంలోని “గోపినేనిపాలెం”లో శివరామయ్య – రంగమ్మ దంపతులకు తిరుపతి వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో ఒక పాప జన్మించింది. ఆ పాపకి వాళ్లు “తిరుపతమ్మ” అనే పేరు పెట్టి ఎంతో గారాబంగా పెంచారు. చిన్నప్పటి నుంచి తిరుపతమ్మకి దైవభక్తి ఎక్కువ. ఆమెలో దివ్యమైన తేజస్సు ఉండటం .. కలుపుగోలుతనం కారణంగా ఊళ్లోని వాళ్లంతా కూడా ఆమె పట్ల ప్రేమాభిమానాలు చూపించేవారు.
అలాంటి తిరుపతమ్మకు యుక్తవయసు వచ్చిన తరువాత “పెనుగంచిప్రోలు” గ్రామానికి చెందిన గోపయ్యతో వివాహం జరుగుతుంది. గోపయ్య మంచి ధైర్యస్తుడు .. మానవత్వం ఉన్నవాడు. తిరుమతమ్మ వచ్చిన తరువాత తమకి కలిసిరావడంతో ఆమెను మరింత అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో కరవుకాటకాలు ఏర్పడటంతో, గోపయ్య తన ఆవుల మందను తీసుకుని అడవిలోకి పోతాడు. ఆయన ఇంట్లోలేని ఆ సమయంలో తిరుపతమ్మను అత్తారింటి వాళ్లు నానా ఇబ్బందులు పెడుతుంటారు.
అలాంటి పరిస్థితుల్లో అడవికి వెళ్లిన భర్త పులిబారిన పడి చనిపోతాడు. ఆ కబురు వచ్చేలోగానే ఆ విషయం తిరుపతమ్మకి తెలిసిపోతుంది. ఆ సమయంలో ఆమె మరింత తేజస్సుతో వెలిగిపోవడం ఊళ్లోవారు చూశారు. తాను ఉన్న ప్రదేశంలో తనకీ .. భర్తకీ ఆలయాన్ని నిర్మించి పూజలు జరిగేలా చూడమని తిరుపతమ్మ చెబుతుంది. కష్టకాలంలో తనకి అండగా నిలిచిన పాపమాంబ వంశీకుల నుంచే తాను ప్రథమ పూజలు అందుకుంటానని చెబుతూ అదృశ్యమవుతుంది. ఆమె చెప్పినట్టుగానే గ్రామస్తులు ఆ పనులను పూర్తి చేశారు.
అప్పటి నుంచి ఇక్కడ తిరుపతమ్మ దంపతులకు నిత్యపూజలు జరుగుతున్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో తిరుపతమ్మ ఇలవేలుపుగానో .. ఇష్టదేవతగానో కనిపిస్తూ ఉంటుంది. తమ సంతానానికి ఆ తల్లి పేరు పెట్టుకునేవారు ఎక్కువ. మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు పెద్ద తిరునాళ్లు .. ఫాల్గుణ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు చిన్న తిరునాళ్లు జరుగుతుంటాయి. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన వివాహ సంబంధమైన దోషాలు తొలగిపోయి, సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Penuganchiprolu Tirupatamma Temple