Significance of Rakhi Festival – Raksha Bandhan story

రాఖీ పండుగ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను రాఖీ పౌర్ణమి లేదా రక్షా బంధన్ అని కూడా పిలుస్తారు. ఇది అక్కచెల్లెల్లు తమ అన్నదమ్ములకు ప్రేమ, రక్షణ మరియు ఆశీర్వాదాలను అందించే పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రాఖీ పండుగ భారతదేశంలో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు జరుపుకునే ఒక ప్రసిద్ధ పండుగ. ఈ పండుగ భారతీయ సంస్కృతి మరియు ఐక్యతకు ఒక ప్రధాన ప్రతిబింబం.

రాఖీ పౌర్ణమి రోజున సోదరీమణులు తమ సోదరులకు నుదుట తిలకం పెట్టి రాఖీ పట్టీలను కట్టి హారతి ఇచ్చి వారి ఆరోగ్యం, సంపద మరియు శుభం కోసం దేవుడిని ప్రార్థిస్తారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు మరియు వారిని రక్షించే వాగ్దానం చేయడంతోపాటు జీవితాంతం తోడుగా ఉంటామనే భరోసా కల్పిస్తారు. ఈ అందమైన ఆచారం కుటుంబ సంబంధాల యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మరియు తోబుట్టువుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. అయితే రాఖీ పండుగ కేవలం అన్నాచెల్లులు లేక అక్కాతమ్ముళ్ల మధ్యనే కాకుండా పురాణాల ప్రకారం ఏ స్త్రీ అయినా పురుషుడికి కట్టే రక్షా తోరాన్ని రక్షా బంధనం అంటారు.

రక్షాబంధన్ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? (Raksha Bandhan story)

పూర్వం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. దేవతల రాజైన దేవేంద్రుడు ఓడిపోయి శక్తిహీనుడయ్యాడు. తన పరివారంతోపాటు అమరావతిలో ఆశ్రయం పొందుతాడు. తన భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి బాధ పడుతుంది. రాక్షస రాజు అమరావతిని ముట్టడిస్తున్నాడని గ్రహించిన ఆమె దేవేంద్రుడిని తిరిగి పోరాడటానికి ప్రేరేపించింది. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు పార్వతి పరమేశ్వరుడిని, లక్ష్మీనారాయణుడిని పూజించి దేవేంద్రుని చేతికి రాఖీ కట్టి అభయమిచ్చింది. అది చూసి దేవతలందరూ తమ పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి యుద్ధానికి పంపుతారు. యుద్ధంలో విజయం సాధించిన తరువాత ఇంద్రుడు త్రిలోకంపై తన ఆధిపత్యాన్ని తిరిగి పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన రక్షాబంధన్‌ను రాఖీ పండుగగా నేటికీ జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది మధ్య ఉన్న అన్నాచెల్లెల అనుబంధం

పాండవుల రాజసూయ యాగంలో శిశుపాలుడి వంద తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతనిని వదిస్తాడు. ఆ సమయంలో కృష్ణుని చూపుడు వేలుకి గాయంతో బాగా రక్తం కారుతుంది. అది గమనించిన ద్రూపది వెంటనే తన పట్టు చీరను చింపి గాయపడిన కృష్ణుని వేలుకి కట్టుకడుతుంది. దానికి కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి శాశ్వతమైన మద్దతునిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కృతజ్ఞతా చిహ్నంగా, అతను దుశ్శాసనుడి కనికరం లేని చర్యల నుండి ఆమెను కాపాడతాడు. ద్రౌపది కృష్ణునికి కట్టిన కట్టును ఒక అన్నకి చెల్లెలు కట్టిన రక్షణ అంటారు.

శ్రీ మహావిష్ణువు – బలిచక్రవర్తి కథ

బలి చక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు అతనితోపాటు పాతాళ లోకంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి స్వయంగా వెళ్లి బలిచక్రవర్తికి రక్షా బంధనం కట్టి ఆమె భర్తను వైకుంఠానికి తీసుకువెళుతుంది. అలా రక్షాబంధానికి ఎంతో విశిష్టత ఏర్పడింది.

అలెగ్జాండర్‌ భార్య – పురుషోత్తముడి కథ

చారిత్రకంగా గ్రీకు రాజు అలెగ్జాండర్ తన పెద్ద సైన్యంతో భారతదేశంపైకి దండెత్తి వస్తాడు. ఈ క్రమంలో జీలం నదికి ఆవల ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడితో యుద్ధానికి తలపడుతాడు. అయితే పురుషోత్తముడి శక్తి సామర్ధ్యాల గురించి విన్న అలెగ్జాండర్ భార్య రుక్సానా తన భర్త క్షేమం కోసం పురుషోత్తముడిని శరణు కోరి అతనికి రాఖీ కడుతుంది. రుక్సానాను సోదరిగా భావించిన పురుషోత్తముడు యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినా అతనిని చంపకుండా వదిలేస్తాడు.

ఇలా రాఖీ పండుగ ఎంతో ప్రాముఖ్యత కలిగివుంది. రాఖీ పౌర్ణమి రోజు కట్టే రక్షలో అసామాన్యమైన శక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Significance of Rakhi Festival – Raksha Bandhan story

మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: