Pillaiyarpatti – Karpaga Vinayagar Temple
ఎవరు ఏ శుభకార్యాన్ని ఆరంభించినా తొలి పూజ వినాయకుడికి చేస్తారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడమని ప్రార్ధిస్తారు. ఆయనను విస్మరించడం వలన .. మరిచిపోవడం వలన దేవతలు సైతం అష్టకష్టాలు పడిన సందర్భాలు ఉన్నాయి. అందువలన దేవతలైనా .. మానవులైనా .. మహర్షులైనా ముందుగా ఆయనను పూజించవలసిందే .. అంకితభావంతో ఆరాధించవలసిందే. అలాంటి వినాయకుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. ఆ భక్తుల నుంచి పూజాభిషేకాలు అందుకుంటూ .. వాళ్లపై తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తున్నాడు.
అలా తమిళనాడు ప్రాంతంలో ఆవిర్భవించిన ప్రాచీన వినాయక క్షేత్రంగా “పిళ్లైయార్ పట్టి” వినాయక క్షేత్రం కనిపిస్తుంది. “తిరుప్పత్తూరు” సమీపంలో వెలుగొందుతున్న ఈ క్షేత్రానికి చెన్నై నుంచి చేరుకోవడం చాలా తేలిక. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం, అలనాటి వైభవానికి అద్దం పడుతూ ఉంటుంది .. స్వామివారి మహిమలకు నిదర్శనంగా నిలుస్తుంటుంది. పొడవైన ప్రాకారాలు .. ఎత్తైన గాలిగోపురం .. వివిధ ఉపాలయాలు .. మంటపాలతో ఈ క్షేత్రం అడుగడునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది.
సాధారణంగా చతుర్భుజుడైన వినాయకుడు .. ఒక చేతిలో ఉండ్రాయిగా చెప్పుకునే లడ్డు పట్టుకుని కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈ క్షేత్రంలో స్వామివారి చేతిలో శివలింగం ఉంటుంది. ఆయన చేతిలో శివలింగం ఉండటం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. పూర్వం “గజముఖాసురుడు” అనే రాక్షసుడు పరమశివుడి సాక్షాత్కారం చేసుకుని, తయారు చేయబడిన ఎలాంటి ఆయుధం వలన తనకి మరణం లేకుండా వరాన్ని పొందుతాడు. అప్పటి నుంచి ఆ అసురుడి ఆగడాలు ఎక్కువైపోతాయి.
దేవతలంతా కూడా ఈ విషయంలో వినాయకుడిని శరణు కోరతారు. దాంతో ఆ అసురుడితో వినాయకుడు యుద్ధానికి దిగుతాడు. ఎలాంటి ఆయుధాలు ఆ రాక్షసుడిపై పనిచేయకపోవడంతో, తన దంతంతో అతనిని సంహరించడానికి సిద్ధపడతాడు. అప్పుడు ఆ అసురుడు ఎలుక రూపాన్ని ధరించి పారిపోవడానికి ప్రయత్నించి హతుడవుతాడు. వినాయకుడికి వాహనంగా ఉండేలా వరాన్ని ప్రసాదించమని చివరి నిమిషంలో ప్రార్ధిస్తాడు. ఆ తరువాత అతని కోరిక నెరవేరుతుందని వినాయకుడు వరమిస్తాడు.
గజముఖాసురుడిని వధించిన దోషం తొలగిపోవడం కోసం, వినాయకుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడట. స్వామివారి చేతిలోని శివలింగం ఈ సంఘటనను సూచిస్తూ ఉంటుందని చెబుతారు. లోక కల్యాణం కోసం అసుర సంహారం చేసిన ఇక్కడి స్వామిని కర్పగా వినాయకుడు అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన ఎలాంటి ఆటంకాలు లేకుండా తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా ఇక్కడ పది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతుంటాయి. స్వామివారికి జరిగే ప్రత్యేకమైన పూజలు .. వివిధ వాహనసేవలు చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు .. భక్తి శ్రద్ధలతో కొలుస్తూ తరిస్తుంటారు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక:
ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.