Sri Bhagavatam – Prahlad’s mother Leelavati worries about his son
ఎలాంటి శిక్షలు ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోతుండటం .. అతను మాత్రం హరినామస్మరణ మానకపోతుండటం హిరణ్యకశిపుడిని తీవ్రమైన అసహనానికి గురిచేస్తుంది. దాంతో ఇక అతను హరినామం మానవలసిందేనని తేల్చి చెబుతాడు. ఇకపై అతని నోటివెంట హరి నామం తాను వినకూడదని అంటాడు. హరినామం మానమని తనకి చెబుతూనే పలుమార్లు ఆయన ఆ నామాన్ని పలుకుతూ ఉండటం గురించి ప్రహ్లాదుడు ప్రస్తావిస్తాడు. తనకంటే ఎక్కువగా హరి నామాన్ని ఆయనే ఎక్కువగా పలుకుతున్నాడని అంటాడు.
ఆ మాటలకు హిరణ్యకశిపుడు మరింత కోపంతో మండిపడతాడు. ఆయన కోపం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని లీలావతి భయాందోళనలకు లోనవుతుంది. తన బిడ్డకి తాను నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఎంతగా చెప్పినా ప్రహ్లాదుడు వినిపించుకోడు. తన తండ్రి తమ రాజ్యానికి మాత్రమే ప్రభువు అనిపించుకోగలడు .. కానీ సమస్త విశ్వానికి ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడే. తన తండ్రిని అడిగితే సిరిసంపదలు మాత్రమే ఇవ్వగలడు .. కానీ ముక్తిని ప్రసాదించువాడు ఆ జగన్నాథుడే అని తేల్చి చెబుతాడు.
తన తండ్రి పట్ల తనకి ప్రేమ ఉంది .. ఆ శ్రీమన్నారాయణుడి పట్ల అపారమైన భక్తి ఉన్నది. ఆ స్వామిపై భక్తి లేదని ఎలా చెబుతాను? ఆయన నామానికి దూరంగా ఉంటానని ఎలా అంటాను? ఆ స్వామి రూపాన్ని దర్శించకుండా .. నామాన్ని స్మరించకుండా తాను క్షణమాత్రమైనా ఉండలేనని స్పష్టం చేస్తాడు. కనుక తనని ఈ విషయంలో వత్తిడి చేయవద్దని కోరతాడు. అలా చేయడం వలన ప్రయోజనం ఉండదని అంటాడు. మనసు కష్టపెట్టుకోకుండా అసలు తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని కోరతాడు.
అయ్యో ఇక తాను ఏం చేయాలి? ఏం చేయగలదు? పిల్లలు చెడు మార్గంలో వెళుతూ ఉండటం తల్లిదండ్రులకు బాధను కలిగిస్తుంది. మంచి విషయాలందు వాళ్లు చెప్పిన మాట వినకపోవడం ఆవేదన కలిగిస్తుంది. ప్రహ్లాదుడు భక్తి మార్గంలో వెళుతున్నాడు. అది తప్పుకాదని తెలిసినా, తన భర్త కోపానికి బాలుడు బాలి కాకూడదనే ఉద్దేశంతో తాను నచ్చజెబ్బుతూ వస్తోంది. అయినా అణుమాత్రమైనా ప్రయోజనం కనిపించడం లేదు. ఏమిటి చేయడం? హిరణ్యకశిపుడికి ఏమిటి చెప్పడం? అని ఆందోళన చెందుతూ ఉంటుంది.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.