Srirangam – Sri Ranganathaswamy Temple

శ్రీమహావిష్ణువు ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో .. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో “శ్రీరంగం” ప్రధానమైనదిగా కనిపిస్తుంది. శ్రీరంగం క్షేత్రాన్ని దర్శించడం వలన, మిగతా 107 దివ్య తిరుపతులను దర్శించిన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చును. ఇక్కడ రంగనాథస్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఈ ఆలయాన్ని చూస్తేనే స్వామివారి వైభవం ఎంతటిదో అర్థమైపోతుంది. స్వామివారి మూర్తిని చూస్తే ఉప్పొంగే భక్తితో మనసు అదుపు తప్పుతుంది.

శ్రీరంగం ఆలయం 156 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. 7 ప్రాకారాలాతో .. 15 గాలి గోపురాలతో ఈ ఆలయం ఆధ్యాత్మిక సామ్రాజ్యంగా అనిపిస్తుంది. ఒక చోట నిలబడిగానీ .. ఒక రోజులో తిరిగిగాని చూడలేని ఆలయం ఇది. అందరూ చెప్పుకునే వైకుంఠం ఇదేనేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎంతసేపు చూసినా తనివి తీరదు .. స్వామివారిని విడిచి రావాలంటే మనసొప్పదు. అంతటి సౌందర్యం ఆయన సొంతం. అలాంటి స్వామివారు ఇక్కడ కొలువై ఉండటానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది.

బ్రహ్మదేవుడు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీమహా విష్ణువును ఆరాధించి, ఆయనను అనునిత్యము పూజించాలనే కోరికను వ్యక్తం చేస్తాడు. అప్పుడు స్వామి రంగవిమానంలో తాను శేషశాయిగా ఉన్న మూర్తిని బ్రహ్మదేవుడికి అందజేస్తాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఆ మూర్తిని సూర్యవంశ రాజైన ఇక్ష్వాకునకు ఇస్తాడు. అలా అది శ్రీరాముడి వరకూ వస్తుంది. రావణ సంహారం అనంతరం .. విభీషణుడు శ్రీరాముడికి భక్తుడిగా మారిపోతాడు. రంగనాథుడిని ఆరాధిస్తే తనని పూజించినట్టే అవుతుందని ఆ మూర్తిని విభీషణుడికి అందజేస్తాడు రాముడు.

అలా విభీషణుడు ఆ మూర్తిని లంకా నగరానికి తీసుకుని వెళుతూ ఉండగా, పూర్వం ధర్మవర్మకి ఇచ్చిన మాట కోసం రంగనాథస్వామి కావేరీ నదీ సమీపంలోనే కొలువవుతాడు. ఆ మూర్తిని లంకా నగరానికి తీసుకుని వెళ్లలేక విభీషణుడు బాధపడుతూ ఉంటే, రాత్రివేళలో తనని పూజించే అవకాశాన్ని విభీషణుడికి ఇస్తాడు. ఆ తరువాత కాలంలో చోళరాజుకి స్వప్నంలో కనిపించిన స్వామి, తన ఆలయాన్ని నిర్మించే బాధ్యతను అప్పగిస్తాడు. అప్పటి నుంచి రంగనాథ క్షేత్రం అభివృద్ధి చెందుతూ వచ్చింది.

ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులంతా స్వామివారిని తమ ఇలవేల్పుగా భావించి పూజించారు .. ఎన్నో కానుకలు సమర్పించారు. గర్భాలయంలోని స్వామివారు ఆదిశేషుడిపై శయన ముద్రలో దర్శనమిస్తూ “పెరియ పెరుమాళ్” గా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి గాయత్రి మంటపం .. చందన మంటపం .. చంద్ర పుష్కరిణిని ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. స్వామివారి దివ్యమంగళ మూర్తిని దర్శించి ధన్యులవుతుంటారు.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.