Sri Bhagavatam – Samba gives birth to pestle

ఒక రోజున వశిష్ఠ మహర్షి .. విశ్వామిత్రుడు .. అత్రి .. అంగిరసుడు .. కశ్యపుడు .. నారద మహర్షి అంతా కూడా శ్రీకృష్ణుడి దర్శనార్థం ద్వారక చేరుకుంటారు. కృష్ణుడు ఆ మహర్షులను సాదరంగా ఆహ్వానిస్తాడు. కృష్ణుడు అనుసరిస్తూ వచ్చిన ధర్మబద్ధమైన మార్గాన్ని గురించి ప్రస్తావిస్తారు. ఆయన లీలావిశేషాలను కొనియాడతారు. వాళ్లతో కృష్ణుడు ఎంతో ఆత్మీయంగా ముచ్చటిస్తాడు. ఆ తరువాత వాళ్లని తగిన రీతిన సత్కరించి పంపుతాడు. అలా వాళ్లు కృష్ణుడి దగ్గర నుంచి తిరిగి వస్తుండగా, కొంతమంది యాదవ బాలాకులు వాళ్లను చూస్తారు.

వాళ్లలో కృష్ణుడి కుమారుడైన సాంబుడు కూడా ఉంటాడు. వాళ్లకి మహర్షులను ఆటపట్టించాలనే కోరిక కలుగుతుంది. దాంతో చకచకా సాంబుడికి స్త్రీ వేషం వేస్తారు. గర్భవతిగా ఉన్నట్టుగా అతని ఉదర భాగంలో గుడ్డలు చుడతారు. సాంబుడు నిండు చూలాలుగా నటిస్తూ భారంగా నడుస్తూ ఉంటాడు. మిగతా వాళ్లు మహర్షుల దగ్గరికి వెళ్లి గర్భవతిగా ఉన్న ఆమె కడుపున మగపిల్లాడు పుడతాడా? ఆడపిల్ల పుడుతుందా? చెప్పమని అడుగుతారు. ఆకతాయి తనంగా వాళ్లంతా అలా అడగడం మహర్షులకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది.

వాళ్లంతా గర్భవతిగా నటిస్తున్న సాంబుడి వైపు కోపంగా చూస్తారు. అతని కడుపున “ముసలం” (రోకలి) పుడుతుందనీ, ఆ రోకలి కారణంగానే యాదవులు నశిస్తారని శపిస్తారు. ఆ మాటకి ఆ కుర్రాళ్లంతా ఉలిక్కిపడతారు. సాంబుడు కంగారు పడిపోయి .. తనకి చుట్టిన గుడ్డలను తీసేస్తాడు .. తన స్త్రీ వేషాన్ని ఆతను తొలగిస్తూ ఉండగానే “ముసలం” పుడుతుంది. అది చూడగానే అంతా భయపడిపోతారు. ఏం చేయాలో తెలియక అయోమయానికి లోనవుతారు. తాము చేసింది తప్పేననీ .. క్షమించమని మహర్షులను కోరతారు. అహంభావానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మహర్షులు వెళ్లిపోతారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో  సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Samba gives birth to pestle