కృష్ణుడి దగ్గరికి సత్రాజిత్తు వెళతాడు .. ఆయన ఆగ్రహావేశాలతో ఉండటం చూసిన కృష్ణుడు అయోమయానికి లోనవుతాడు. ఏం జరిగిందని అడుగుతాడు. చేసినదంతా చేసి ఏమీ తెలియనివాడి మాదిరిగా నటించవద్దంటూ సత్రాజిత్తు మండిపడతాడు. విషయమేవిటో అర్థంకాక అతనివైపు ప్రశ్నార్థకంగా చూస్తాడు. కృష్ణుడు మాయదారి అనీ అతను శ్యమంతకమణి కోసం తన తమ్ముడిని హతమార్చాడని అంటాడు సత్రాజిత్తు. తన తమ్ముడు ఒంటరిగా వేటకు వెళ్లడం గమనించి, ఆయనను అనుసరించి హతమార్చి ఆ మణిని దొంగిలించాడని నిందిస్తాడు.
అక్కడున్న వాళ్లంతా కూడా కృష్ణుడు అలాంటివాడు కాదనీ, అనవసరంగా ఆయనను నిందిస్తే తగిన ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందని అంటారు. ముమ్మాటికీ తన తమ్ముడిని కృష్ణుడే హతమార్చాడనీ, ఆ మణిని అడిగితే ఇవ్వలేదని అలా చేశాడని చెబుతాడు. ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని అంటాడు. సత్రాజిత్తు అంత బలంగా మాట్లాడుతూ ఉండటంతో అంతా ఆశ్చర్యపోతారు. ప్రసేనుడు మరణించాడు .. శ్యమంతకమణి మాయమైంది అనే విషయం మాత్రం కృష్ణుడికి అర్థమవుతుంది. దాంతో ఆయన జరిగిన సంఘటనతో తనకి ఎలాంటి ప్రమేయం లేదని చెబుతాడు.
కానీ సత్రాజిత్తు ఆ మాటలను నమ్మడు .. కృష్ణుడు చెప్పేవన్నీ అబద్దాలనీ, ఆ విషయం అందరికీ తెలుసని అంటాడు. తన తమ్ముడు మహాపరాక్రమవంతుడు అనీ .. ఆయనను అంతమొందించవలసిన అవసరం కృష్ణుడికి తప్ప మరెవరికీ లేదని చెబుతాడు. ఆ మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని కృష్ణుడు అంటాడు. ఇలాంటి నిందను భరించవలసి ఉంది కనుక భరించవలసిందే. చవితి చంద్రుడిని పాలలో చూసిన కారణంగా ఇలాంటి అపవాదు ఏదో వస్తుందని తను ముందుగానే అనుకున్నాననీ .. అలాగే జరిగిందని అంటాడు.
తనపై పడిన నింద నిజం కాదని నిరూపించుకుంటాను .. అందుకు తగిన సమయం ఇవ్వమని కృష్ణుడు కోరతాడు. శ్యమంతకమణి ఎక్కడ ఉందో .. ఎవరు అపహరించారో తెలుసుకుని దానిని తీసుకువచ్చి అప్పగిస్తానని అంటాడు. అప్పటివరకూ ద్వారకలో అడుగుపెట్టనని శపథం చేస్తాడు. ఆ క్షణమే అడవులకు బయల్దేరతాడు. కొంతమంది ముఖ్యమైన అనుచరులు కృష్ణుడిని అనుసరిస్తారు. ఆయన రథం అడవిని చేరుకుంటుంది .. అంతటా అన్వేషిస్తూ తన పరివారంతో కలిసి కృష్ణుడు ముందుకు వెళుతుంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.