పాండవులు రాజసూయయాగం తలపెడతారు .. ఒక వైపు నుంచి కృష్ణుడు .. మరో వైపు నుంచి కౌరవులు హాజరవుతారు. “ఛేది” భూపాలుడైన శిశుపాలుడు కూడా రాజసూయాగానికి వస్తాడు. రాజసూయ యాగం పూర్తయిన తరువాత అగ్రపూజను అందుకోవలసినదిగా పాండవులు కృష్ణుడిని కోరతారు. భీష్ముడు తదితరులు కూడా అందుకు కృష్ణుడే తగినవాడు అనడంతో, అగ్రపూజను అందుకోవడానికి కృష్ణుడు సిద్ధమవుతాడు. పాండవులంతా కలిసి కృష్ణుడికి అగ్రపూజ చేయడానికి సమాయత్తమవుతారు.

అదే సమయంలో శిశుపాలుడు లేచి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తాడు. ఏ విధంగా కృష్ణుడు అగ్రపూజకు అర్హుడో చెప్పవలసిందిగా కోరతాడు. కులగోత్రాలు లేనివాడు .. పద్ధతులు పట్టనివాడు .. మాయామర్మాలే తప్ప పెద్దరికం ఎంతమాత్రం తెలియనివాడు ఎలా అగ్రపూజకు అర్హుడు అవుతాడని అడుగుతాడు. కృష్ణుడు అగ్రపూజకు అర్హుడని పాండవులు భావించడం, మిగతావారిని అవమానపరచడమేనని అంటాడు. రాజసూయయాగానికి తమని ఆహ్వానించింది ఈ విధంగా అవమానపరచడానికేనా? అని అడుగుతాడు.

శ్రీకృష్ణుడు ధర్మం తెలిసినవాడు .. న్యాయమార్గంలో నడిపించేవాడు .. పాండవులు కష్టాల్లో ఉన్నప్పుడు అనుక్షణం వాళ్ల వెన్నంటి ఉన్నవాడు. అలాంటి కృష్ణుడికి కృతజ్ఞతా పూర్వకంగా అగ్రపూజ చేయడంలో తప్పేమీ లేదని భీష్ముడు అంటాడు. కృష్ణుడు గొప్పవాడనీ .. ఆయనను మాత్రమే పూజించాలని ముందుగానే నిర్ణయించుకున్నప్పుడు తమను పిలవడం ఎందుకని శిశుపాలుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. వయసు పరంగా .. శాస్త్ర విజ్ఞానం పరంగా .. పరాక్రమం పరంగా దేనిలో కృష్ణుడు గొప్పవాడని నిలదీస్తాడు. అందరికీ ఆమోదయోగ్యం కానివారికి అగ్రపూజ ఎలా చేస్తారని ఎద్దేవా చేస్తాడు.

అలా శిశుపాలుడు తన నోటికి వచ్చినట్టుగా కృష్ణుడిని విమర్శిస్తూ .. నిందిస్తూ .. ఎద్దేవా చేస్తూ మాట్లాడుతుంటాడు. అతను అంత అవమానకరంగా మాట్లాడుతుంటే, కృష్ణుడు తన మేనత్తకి ఇచ్చిన మాట ప్రకారం అతని తప్పులను లెక్కిస్తూ వెళుతుంటాడు. కృష్ణుడి మౌనాన్ని అలుసుగా తీసుకున్న శిశుపాలుడు మరింతగా పెట్రేగిపోతుంటాడు. అలా తనకి తెలియకుండానే కృష్ణుడి విషయంలో వంద తప్పులు చేసేస్తాడు. ఆ మరుక్షణమే కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు. అది నేరుగా వెళ్లి శిశుపాలుడి శిరస్సును ఖండించి వేస్తుంది.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.