పరీక్షిత్తు మహారాజు తన విశ్రాంతి మందిరంలో పచార్లు చేస్తుంటాడు. ఎప్పుడూ తెల్లవారుతోంది .. పొద్దుపోతోంది. కానీ కాలం కరిగిపోతోందనే ఆలోచన ఎప్పుడూ కలిగింది లేదు. కానీ ఈ భూమిపై తనకి మిగిలింది ఏడు రోజులు మాత్రమేనని తెలిసిన దగ్గర నుంచి, ప్రతి క్షణం విలువైనదిగా అనిపిస్తోంది. మరణం మనిషిలో ఇంతటి మార్పును తీసుకొస్తుందా? ఇక ఆలస్యం చేయకూడదు. జీవుడు ఈ శరీరంలో నుంచి వెళ్లిపోయేలోగా ముక్తికి సంబంధించిన మార్గాలను అన్వేషించాలి అనుకుంటూ మహర్షులందరికీ కబురు చేస్తాడు.

పరీక్షిత్తు మహారాజు కబురును అందుకున్న మహర్షులంతా, వెంటనే బయల్దేరి వచ్చేస్తారు. తమను ఉన్నపళంగా రావలసిందిగా కోరడంలో ఆంతర్యం ఏమిటని అడుగుతారు. దాంతో అహంభావంతో .. అజ్ఞానంతో .. విధి బలీయమైనది కావడంతో తాను ఒక పాపం చేశానంటూ పరీక్షిత్తు మహారాజు జరిగినదంతా చెబుతాడు. ఏడవ రోజున తాను శరీరం విడిపెట్టడం ఖాయం కనుక, రాజుగా తనకి గల అధికారాలను .. భోగాలను సమస్త త్వజించానని అంటాడు. తనకి కావలసినది ముక్తి మాత్రమేననీ, అందుకు ఏం చేయాలో సెలవీయమని కోరతాడు.

అదే సమయంలో వేదవ్యాసుడి కుమారుడైన “శుక మహర్షి” కూడా అక్కడికి వస్తాడు .. జరిగింది తెలుసుకుంటాడు. “శుక మహర్షి” మహా తపోధనుడు. సృష్టిలోని జీవరాశులన్నింటిలోను దైవాన్ని చూడగల తపస్వి ఆయన. తనదేహంపై తనకి ఎలాంటి ధ్యాస లేకుండా .. భగవంతుడి గురించిన ఆలోచనలతోనే ఆయన రమిస్తుంటాడు. ఆ దివ్యమైన ఆనందానుభూతుల్లోనే ఆయన నిరంతరం తేలియాడుతుంటాడు. ఎక్కడా కొంతసేపైనా నిలవక .. నిరంతరం భగవంతుడి ధ్యానంలోనే కాలాన్ని గడుపుతుంటాడు.

అలాంటి “శుక మహర్షి” .. పరీక్షిత్తు చెప్పినదంతా వింటాడు. సంసార బంధాల నుంచి .. భోగ భాగ్యాల పట్ల గల మమకారం నుంచి బయటపడేలా చేసి, ముక్తి మార్గం వైపు మళ్లించే శక్తి ఒక్క భాగవతానికి మాత్రమే ఉందని శుక మహర్షి చెబుతాడు. శ్రీమన్నారాయణుడి లీలా విశేషాలు .. లోక కళ్యాణం కోసం ఆయన అనుసరించిన విధానాలు .. భక్తులను అనుగ్రహించిన వైనాలు .. అసుర సంహారం కోసం అవతరించిన ఘట్టాలను గురించిన విశేషాలను “భాగవతం” ఆవిష్కరిస్తుందనీ, “భాగవతం” వినడం వలన ముక్తిమార్గం లభిస్తుందని సెలవిస్తాడు. అయితే తనకి “భాగవతం” వినిపించే కార్యక్రమాన్ని తక్షణమే మొదలుపెట్టమని పరీక్షిత్తు కోరడంతో, “శుక మహర్షి” భాగవతాన్ని చెప్పడం మొదలుపెడతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.