Chejerla – Sri Kapoteswara Swami Temple

పరమశివుడు తన భక్తులను పరీక్షించడానికీ .. అనుగ్రహించడానికి రావడం, వారి పేరుతో ఆ ప్రదేశంలో ఆవిర్భవించడం అనేక ప్రాంతాలలో జరుగుతూ వచ్చింది. అలా సదాశివుడు పావురం రూపాన్ని ధరించి, భక్తుడి త్యాగనిరతిని పరీక్షించి ఆ త్యాగానికి గుర్తుగా తాను అక్కడే ఆవిర్భవించిన క్షేత్రం ఒకటి ఉంది .. అదే “కపోతేశ్వరస్వామి” క్షేత్రం. “చేజర్ల” (Chejerla) గ్రామంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ .. పల్నాడు జిల్లా .. నరసరావుపేట సమీపంలో దర్శనమిస్తుంది. ఈ ప్రాంతంలోని ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో ఇది ఒకటి.

“శిబి” చక్రవర్తి ఎంతటి ధర్మపరుడో .. ఎంతటి దానగుణం కలిగినవాడనేది అందరికీ తెలిసిందే. ఆయన దాన గుణాన్నీ .. ధర్మనిరతిని చాటే ఒక కథ చాలామందికి తెలుసు. ఆ సంఘటనకు జరిగింది ఇక్కడే .. ఈ ఊరే అందుకు వేదికగా మారిందని చెబుతుంటారు. ఆ కథలోకి వెళితే .. శిబి చక్రవర్తి ధర్మబద్ధమైన పాలన గురించి .. ఆయన దానగుణాన్ని గురించి దేవలోకానికి కూడా పాకుతుంది. అప్పటికే ఆయన అనేక యజ్ఞయాగాలు చేస్తాడు. దాంతో తన పదవికి ఎసరు వస్తుందని దేవేంద్రుడు ఆందోళన చెందుతాడు.

తన ఆందోళనని ఆయన త్రిమూర్తుల దగ్గర వ్యక్తం చేస్తాడు. దాంతో త్రిమూర్తులు శిబి చక్రవర్తి గొప్పతనాన్ని పరీక్షించాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మదేవుడు పావురంగా .. పరమశివుడు వేటగాడుగా .. శ్రీమహా విష్ణువు విల్లుగా మారతారు. అలా వాళ్లు శిబి చక్రవర్తి ఉండే ప్రాంతానికి వెళతారు. శిబి చక్రవర్తి ధ్యానంలో ఉండగా కాస్త గాయపడిన పావురం వెళ్లి ఆయన ఒళ్లో వాలుతుంది. దానిని తరుముతున్నట్టుగా వేటగాడి వేషంలో శివుడు అక్కడికి వస్తాడు. ఆయన ఆ పావురాన్ని అందుకోబోతుండగా శిబి చక్రవర్తి అడ్డుపడతాడు.

ఆ పావురం తనని శరణు కోరిందనీ .. అందువలన దానిని రక్షించడం తన బాధ్యతని శిబి అంటాడు. తనకి అందుబాటులోకి వచ్చిన ఆహారాన్ని అందకుండా చేయడం ధర్మం కాదని వేటగాడు అంటాడు. అయితే ఆ పావురంతో సమానమైన మాంసం తన శరీరం నుంచి తీసి ఇస్తానని చెప్పిన శిబి, అలాగే చేయడం మొదలుపెడతాడు. శరీరంలో ఏ అవయవం నుంచి మాంసం తీసినా తూకం సరిపోకపోవడంతో .. చివరికి తన శిరస్సును సమర్పించడానికి సిద్ధపడతాడు. అప్పుడు త్రిమూర్తులు నిజరూపాలు ధరించి ఆయనను అభినందిస్తారు.

ఈ సంఘటనకి గుర్తుగా శివుడు ఇక్కడ లింగ రూపంలో ఆవిర్భవించాడు. శిబి తన శరీరంలోని వివిధ భాగాల నుంచి మాంసం తీసిన గుర్తుగా ఇక్కడి శివలింగంపై పెకిలించినట్టు గుంటలు కనిపిస్తూ ఉంటాయి. శివలింగం పైభాగంలో రెండు రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రంలో ఎంత నీరుపోసినా అది నిండదు .. ఆ నీరు ఎక్కడికి పోయేది ఎవరికీ తెలియదు. ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు కనిపిస్తూ ఉంటాయి. కపోతేశ్వరస్వామితో పాటు అమ్మవారు కూడా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Chejerla – Sri Kapoteswara Swami Temple