అభిమన్యుడు – ఉత్తర దంపతులకు జన్మించిన పరీక్షిత్తు, “హస్తినాపురం” రాజ్య సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ధర్మ బద్ధమైన పాలనను అందిస్తూ ప్రజల ప్రేమాభిమానాలను చూరగొంటాడు. ఆయన పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తూ ఉంటారు. అలాంటి పరీక్షిత్తు మహారాజు ఒక రోజున తన పరివారంతో కలిసి వేటకు వెళతాడు. అడవిలోని క్రూరమృగాలు వేటాడుతూ, తన పరివారం నుంచి ఆయన వేరైపోతాడు. అలా దట్టమైన ఆ అడవిలో ఆయన చాలా లోపలికి వెళ్లిపోతాడు.

అలా కొంతదూరం వెళ్లిన ఆయనకి చాలా దాహం వేస్తుంది. దాంతో ఆయన దగ్గరలో మంచినీళ్లు దొరుకుతాయేమోనని చూస్తాడు. ఎక్కడా జలాశయాల జాడ కనిపించకపోవడంతో, వెదుకుతూ మరికొంత ముందుకు వెళతాడు. అక్కడ ఒక చెట్టుక్రింద కూర్చుని తపస్సు చేసుకుంటున్న “శమీక మహర్షి”ని చూస్తాడు. ఆయనను అడిగితే మంచినీళ్లు ఇవ్వొచ్చనే ఉద్దేశంతో దగ్గరికి వెళతాడు. తాను పరీక్షిత్ మహారాజుననీ, వేటకి వచ్చిన తాను పరివారం నుంచి దూరంగా వచ్చేశానని చెబుతాడు. తనకి చాలా దాహంగా ఉందనీ .. దప్పిక తీర్చమని అడుగుతాడు.

శమీక మహర్షి తపస్సులో ఉన్న కారణంగా ఆ మాటలేవీ ఆయనకి వినిపించవు. దాంతో ఆయనలో ఎలాంటి చలనమూ ఉండదు. దాంతో పరీక్షిత్తు మహారాజు ఆయనకి మరోసారి చెబుతాడు. గొంతు ఎండిపోతోందనీ .. దగ్గరలో ఎక్కడా జలాశయాలు కనిపించడం లేదనీ .. త్వరగా తన దప్పిక తీర్చమని కోరతాడు. అయినా శమీక మహర్షి ఆలా తపస్సు చేసుకుంటూనే ఉంటాడు. దాంతో పరీక్షిత్తు మహారాజుకి అవమానంగా అనిపిస్తుంది. తాను ఎంతగా ప్రాధేయపడుతున్నా పట్టించుకోని శమీక మహర్షిపై ఆగ్రహం కలుగుతుంది.

ఆ కోపంతో పరీక్షిత్తు రగిలిపోతుండగా ఆయనకి ఆ పక్కనే ఓ చచ్చిపడి ఉన్న పాము కనిపిస్తుంది. దాంతో తన చేతిలోని బాణంతో ఆయన ఆ పామును ఎత్తి దానిని “శమీక మహర్షి” మెడలో వేస్తాడు. తనని ఎంతమాత్రం లెక్కచేయని మహర్షికీ .. తన మాటలు విని కూడా విననట్టుగా నటించిన మహర్షికి ఇదే తగిన శాస్తి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదేమీ తెలియని “శమీక మహర్షి” ఎప్పటిలానే తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో శమీక మహర్షి కుమారుడు “శృంగి” అక్కడికి వస్తాడు. తన తండ్రి మెడలో చచ్చిన పాము ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. తన తండ్రిని అవమానించడం కోసం ఎవరో అలా చేశారని గ్రహించి ఆగ్రహావేశాలకు లోనవుతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.