లోక కల్యాణం కోసం ఒక్కో అసురుడిని కృష్ణుడు మట్టుబెడుతూ రావడంతో, ద్వారక వాసులంతా సుఖశాంతులతో జీవిస్తుంటారు. ఒక వైపున బలరాముడు .. మరో వైపున కృష్ణుడు ఉండటంతో ద్వారక వైపు చూడటానికి కూడా ఇతర రాజులు భయపడుతూ ఉండేవారు. దాంతో శత్రువుల బెడద లేకుండా ప్రజలంతా ఆనందంగా .. హాయిగా ఉంటూ ఉంటారు. ఎవరు అనుసరించే ధర్మం వాళ్లను కాపాడుతుందని కృష్ణుడు చెప్పడం వలన, ప్రజలంతా ధర్మాన్ని అనుసరిస్తూ .. ఆచరిస్తూ ఉంటారు.
బలరాముడు .. కృష్ణుల సోదరి అయిన “సుభద్ర” యుక్తవయసుకు వస్తుంది. దాంతో ఆమెకు వివాహం చేయాలని బలరాముడు భావిస్తాడు. దుర్యోధనుడు తన శిష్యుడు .. తానంటే ఎంతో అభిమానం ఉన్నవాడు … పరాక్రమం విషయంలోను ఆయనకు వంకబెట్టవలసిన అవసరం లేదు. అందువలన ఆయనకి తన సోదరిని ఇచ్చి వివాహం చేయాలని బలరాముడు నిర్ణయించుకుంటాడు. అయితే అప్పటికే సుభద్ర మనసులో అర్జునుడు ఉన్నాడనే విషయం కృష్ణుడు గ్రహిస్తాడు. అయినా ఆ విషయం అన్నగారి దగ్గర ప్రస్తావించకుండా మౌనంగా ఉంటాడు.
పెద్దన్నయ్య తన వివాహాన్ని దుర్యోధనుడితో జరిపించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా సుభద్రకు తెలుస్తుంది. దాంతో ఆమె ఆందోళనకు లోనవుతుంది. తన మనసులో అర్జునుడికి తప్ప మరొకరికి స్థానం లేదని భావిస్తుంది. ఆయనను తప్ప మరొకరిని భర్తగా ఊహించలేనని అనుకుంటుంది, కానీ బలరాముడి సంగతి ఆమెకి బాగా తెలుసు. ఆయన ఏదైనా అనుకున్నాడంటే ఆ పని చేసేస్తాడు అంతే. అందువలన ఆయనను ఆపడం కష్టమనే విషయం ఆమెకి అర్థమైపోతుంది. దాంతో తన మనసులోని మాటను కృష్ణుడితో చెబుతుంది.
సుభద్ర మనసులో అర్జునుడికి మాత్రమే స్థానం ఉందనే విషయం తనకి తెలుసుననీ, ఈ విషయంలో కంగారుపడవలసిన పనిలేదని కృష్ణుడు చెబుతాడు. కృష్ణుడు అభయం ఇచ్చాడు అంటే ఇక దానికి ఎదురులేదు. ఏదేమైనా ఆయన అనుకున్నట్టుగానే జరిగేలా చూస్తాడు. కనుక వివాహం విషయంలో ఆమె ఆందోళన తగ్గుతుంది. కృష్ణుడు మాత్రం బలరాముడికి ఎలాంటి సందేహం కలగకుండా అర్జునుడితో సుభద్ర వివాహాన్ని జరిపించడం ఎలా? అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తుంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.