సుధాముడు .. కృష్ణుడు బాల్యంలో ఒకే గురువు దగ్గర కలిసి చదువుకుంటారు. ఆ తరువాత ఎటు వాళ్లు అటు వెళ్లిపోతారు. సుధాముడికి వివాహమవుతుంది. ఆయన బహు సంతానంతో బాధలు పడుతుంటాడు. ఒకవైపున పేదరికం .. మరో వైపున అధిక సంతానం. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక ఆయన సతమతమైపోతుంటాడు. ఎంతగా కష్టపడినా ఒక పూట గడవడం కష్టమైపోతుంటుంది. ఊళ్లో వాళ్లు సహాయసహకారాలు అందిస్తూనే ఉంటారుగానీ, అలా ఎంతకాలం. దాంతో ఆ భార్యాభర్తలు పస్తులుండి పిల్లల కడుపునిండితే చాలని అనుకుంటూ ఉంటారు.

ఒక రోజున సుధాముడు తన ఇంటి అరుగుపై కూర్చుని తన పేదరికాన్ని తలచుకుని బాధపడుతూ ఉంటాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటనే విషయం ఆయనకు బోధపడదు. ఎంతకాలం ఇలా కడుపుమాడ్చుకుని .. కన్నీళ్లు తాగుతూ బ్రతకడం? .. ఎవరు మాత్రం ఎంతకని సాయం చేస్తారు? ఇలా చాలీచాలని వస్త్రాలను ధరించి .. ఆకలితీరని జీవితాన్ని గడపడంలో అర్థం లేదని నిరాశ చెందుతాడు. అదే మాటను ఆయన భార్యతో అంటాడు. ఇలాంటి కష్టాలతో తాము ఎక్కువకాలం జీవితాన్ని కొనసాగించలేమంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు.

అప్పుడు ఆయన భార్య .. కృష్ణుడి పేరును ప్రస్తావిస్తుంది. కృష్ణుడు ఆయనకి బాల్యమిత్రుడనే విషయాన్ని గుర్తుకు చేస్తుంది. కృష్ణుడు ద్వారక నగరంలో అష్ట భార్యలతో .. సిరిసంపదలతో తులతూగుతున్నాడు. ఆయనని కలుసుకుని సహాయాన్ని అర్ధించడం వలన ఉపయోగం ఉండొచ్చని అంటుంది, కలిసి చదువుకున్నందు వలన కాదనే అవకాశం ఉండకపోవచ్చని చెబుతుంది. ఎంత ఇచ్చినా తరగని సంపదలతో ఉన్నందువలన ఆయన తప్పక సాయం చేస్తాడనే నమ్మకం తనకి ఉందని అంటుంది.

తన భార్య కృష్ణుడి పేరు ఎత్తగానే ఆయనలోని నిరాశ నిస్పృహలు మాయమవుతాయి. ఒకరకమైన ఉత్సాహం ఆయనలో చోటుచేసుకుంటుంది. నిజమే తాను కృష్ణుడు ఎంతో స్నేహంగా ఉండేవాళ్లం .. ఎంతో ఆప్యాయంగా మసలుకునేవాళ్లం. కృష్ణుడికి “అటుకులు” అంటే ఇష్టమని చెప్పేసి తాను అటుకులు తీసుకువెళ్లేవాడు. ఆయన ఎంతో ఇష్టంగా అవి తింటూ ఉంటే తాను సంతోషించేవాడు. అలాంటి కృష్ణుడిని మళ్లీ కలుసుకోవాలనుకునేసరికి ఆయనలో ఏదో తెలియని ఆనందం చోటుచేసుకుంటుంది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను తీసుకుని మర్నాడు ఉదయమే బయల్దేరాలని నిర్ణయించుకుంటాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.