Sri Tirumala Venkateswara Swamy Temple
కలియుగదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రమే “తిరుమల”. ఈ కొండకి “వేంకటాచలము” అని పేరు. అంటే పాపములను నశింపజేయు కొండ అని అర్థం. పాపాలను తొలగించువాడు కావడం వల్లనే స్వామివారికి వేంకటేశ్వరుడు అని పేరు. స్వామివారి ఇక్కడ కొలువై ఉండటానికి పూర్వమే ఇక్కడ “ఆదివారాహస్వామి” ఉన్నారు. అందువలన దీనిని “ఆదివరహా క్షేత్రం” అని పిలుస్తారు. ఈ స్వామివారి అనుమతి తీసుకునే వేంకటేశ్వరుడు ఇక్కడ కొలువైనాడని పురాణాలు చెబుతున్నాయి.
వైకుంఠానికి వెళ్లిన భృగు మహర్షి .. తన రాకని గమనించి కూడా శ్రీహరి పట్టించుకోలేదనే కోపంతో ఆయన వక్షస్థలాన్ని కాలుతో తాకుతాడు. అది తనకి అవమానంగా భావించిన వక్షస్థల లక్ష్మిదేవి భూలోకానికి వస్తుంది. ఆమెను వెదుకుతూ శ్రీమన్నారాయణుడు .. శ్రీనివాసుడుగా భూలోకానికి వస్తాడు. ఇక్కడి కొండలలో తిరుగాడుతూ స్వామి వకుళమాత ఆశ్రమానికి చేరుకుంటాడు. తాను అనునిత్యం ఆరాధించే ఆ కృష్ణుడే తన కోసం వచ్చాడని భావించిన ఆ తల్లి పొంగిపోతుంది. వన విహారానికి వెళ్లిన శ్రీనివాసుడు, ఆకాశరాజు కూతురైన పద్మావతీదేవిని చూసి మోహిస్తాడు. లక్ష్మీదేవి అంశతో ఆమె ఆ రాజుకు పద్మంలో దొరుకుతుంది.
ఆ ఇద్దరూ ఇష్టపడటంతో వకుళామాత వెళ్లి ఆకాశరాజు దంపతులతో మాట్లాడి వారి వివాహాన్ని జరిపిస్తుంది. ఆ సమయంలోనే కుబేరుడు నుంచి స్వామి కొంత సొమ్మును అప్పుగా తీసుకుని .. అందుకు సంబంధించిన పత్రం కూడా రాసిచ్చాడు. కొత్త దంపతులు కొండ ఎక్కరాదనే ఆచారం కారణంగా వేంకటేశ్వస్వామి .. పద్మావతీదేవి ఇద్దరూ కూడా కొండ దిగువున ఉన్న అగస్త్య మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. స్వామి ఆదేశంతో ఆకాశరాజు తమ్ముడైన తొండమానుడు కొండపై ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తాడు. పద్మావతీదేవిని తన వక్షస్థలపై ధరించిన స్వామి, తన భక్తులను అనుగ్రహించడం కోసం “ఆనంద నిలయం”లోకి ప్రవేశిస్తాడు.
తిరుమల అనేది వైకుంఠాన లక్ష్మీనారాయణులు విహరించు క్రీడాపర్వత సమూహం. స్వామివారు భూలోకమునందు కొలువై ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు గరుత్మంతుడు ఏడు పర్వతాలను కలిసిన ఆ సమూదాయాన్ని భూలోకాన విడుస్తాడు. ఆ పర్వత సముదాయమే ఇక్కడ కూడా స్వామివారికి విహార స్థలంగా మారిందని చెబుతారు. ఇక్కడి ఆనందం విమానం .. మహాభక్తులకు రెక్కలు ఆడిస్తూ పుష్పక విమానంలా కనిపిస్తుందట. ఇప్పటికీ దేవతలు అదృశ్య రూపంలో స్వామివారిని దర్శించి సేవిస్తూ ఉంటారు.
తిరుమలలో స్వామి పుష్కరిణితో పాటు సనక సనందన తీర్థం .. కుమారధార తీర్థం .. పాండవ తీర్థం .. శోణ తీర్థం .. కాయరసాయన తీర్థం .. కపిల తీర్థం .. పాపనాశన తీర్థం .. తుంబుర తీర్థం .. జాబాలీ తీర్థం ఇలా అనేక తీర్థాలు కనిపిస్తాయి. ప్రతి తీర్థానికి ఒక ప్రత్యేకత .. ఒక విశేషం కనిపిస్తాయి. కృష్ణదేవరాయలు పలుమార్లు స్వామివారిని దర్శించుకుని అనేక విలువైన కానుకలను సమర్పించుకున్నట్టుగా చరిత్ర చెబుతోంది. అన్నమయ్య .. తరిగొండ వెంగమాంబ వంటి ఎంతోమంది మహాభక్తులు స్వామివారిని కీర్తించి తరించారు.
స్వామివారికి ఆపద మొక్కులవాడని పేరు. అందువలన ఇక్కడ మొక్కులు చెల్లించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు .. ఆ సమయంలో స్వామివారికి జరిగే అలంకరణలు … వాహనసేవలు .. చూడటానికి రెండు కళ్లూ చాలవు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు “తిరుచానూరు” వెళ్లి అమ్మవారిని కూడా దర్శించుకుని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతున్న తిరుమలను దర్శించడమంటే, సాక్షాత్తు వైకుంఠాన్ని దర్శించడమే.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Sri Tirumala Venkateswara Swamy Temple