Tirupati Tataiahgunta Gangamma Temple
లోక కల్యాణం కోసం అమ్మవారు అనేక రూపాలను ధరించి అసుర సంహారం చేసింది. మానవ రూపంలోని అసురులను అంతమొందించడానికి అమ్మవారు మానవ రూపంలోనే జన్మించిన వృత్తాంతాలు అక్కడక్కడా వినిపిస్తూ ఉంటాయి. అలా ఒకప్పుడు తిరుపతిలో స్త్రీలను వేధిస్తూ .. సాధిస్తూ వస్తున్న పాలెగాళ్ల భరతం పట్టడానికి అమ్మవారు గంగమ్మగా అవతరించిందని చెబుతారు. ఆమెను వేంకటేశ్వరస్వామి చెల్లెలిగా భావిస్తూ ఉండటం విశేషం.
తెలంగాణ లో జరిగే “బోనాలు” జాతర ఎలానో .. తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం పాలెగాళ్ల అధీనంలో ఉండేది. దాంతో వాళ్ల దుర్మార్గాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోవడంతో, వాళ్లు బయటికి రావడానికి కూడా భయపడుతూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒక పాలెగాడి కన్ను గంగమ్మ పై పడింది. ఆమెను గురించి అతను ఆరా తీశాడు. ఆమె తిరుపతికి సమీపంలోని “అవిలాల” గ్రామంలో కైకాల వారి కుటుంబానికి చెందిన అమ్మాయని తెలుసుకుంటాడు.
అప్పటి నుంచి గంగమ్మను అనుసరిస్తూ అదను కోసం చూడసాగాడు. ఒకరోజున చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో ఆమెను తన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆమె ఒక్కసారిగా అపర కాళిగా మారిపోతుంది. ఆమె మానవ రూపంలో ఉన్న అమ్మవారు అనే విషయం ఆ పాలెగాడికి అర్థమైపోతుంది. అంతే .. అక్కడి నుంచి పరుగందుకుని ఆమె కంటపడకుండా దాక్కుంటాడు. గంగమ్మ రూపంలో ఉన్న అమ్మవారు ఆ పాలెగాడి కోసం వివిధ రూపాలను ధరించి గాలిస్తూనే ఉంటుంది. అతను బయటికి రాకుండా ప్రాణభయంతో రహస్యంగా దాక్కుంటాడు.
నాలుగో రోజున అమ్మవారు “దొర” రూపంలో తిరుగుతూ ఉండటంతో అది చూసి నిజంగానే “దొర” అనుకుని ఆ పాలెగాడు బయటికి రాగానే అమ్మవారు అతనిని అంతం చేస్తుంది. రాక్షసుడు వంటి పాలెగాడిని అంతం చేసిన అమ్మవారికి అక్కడి వాళ్లంతా పూజలు చేస్తారు .. కృతజ్ఞతలు తెలియజేస్తూ శాంతింపజేస్తారు. ఇక్కడ జరిగిన సంఘటన ప్రకారం ప్రతి ఏడాది మే నెలలో అమ్మవారి జాతర జరుగుతుంది. పాలెగాడిని సంహరించడానికి అమ్మవారు వివిధ వేషాలను ధరించడం వలన, జాతర సమయంలో భక్తులు వివిధ రకాల వేషాలను ధరించి పాల్గొంటూ ఉంటారు.
“అవిలాల” గ్రామానికి చెందిన కైకాల వంశీకుల చేతుల మీదుగానే ఈ జాతర మొదలవుతూ ఉంటుంది. నాలుగో రోజున పాలెగాడిని అంతం చేసిన గంగమ్మ .. ఐదవ రోజున ఆయన ఇంటికి మాతంగి వేషంలో వెళ్లి దుఃఖంతో ఉన్న ఆయన భార్యను ఓదార్చిందట. అందువలన జాతరలో ఐదవరోజున అమ్మవారికి “మాతంగి” అలంకారం చేస్తారు. జాతర సమయంలో తిరుమల వేంకటేశ్వర స్వామివారి నుంచి గంగమ్మ తల్లికి పుట్టింటి సారె రావడం ఒక ఆనవాయతీగా వస్తోంది. గంగమ్మ తల్లి దర్శనం చేసుకున్నవారికి, ఆపదలు .. దారిద్ర్య బాధలు ఉండవనేది భక్తుల విశ్వాసం.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Tirupati Tataiahgunta Gangamma Temple