Ugadi Rasi Phalalu 2024 “క్రోధినామ” నామ సంవత్సర ఉగాది సందర్బంగా అన్ని రాశుల వారికి కొత్త తెలుగు సంవత్సరంలో ఉగాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Yearly Ugadi rashi phalalu 2024 for all 12 zodiac signs. krodhi nama samvatsara rasi phalalu 2024
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆదాయం–8, వ్యయం–14. రాజపూజ్యం–4, అవమానం–3.
వీరికి మే 1వ తేదీ నుండి గురు బలం విశేషం.
అలాగే, శని, కేతువులు కూడా అనుకూలురు.
ఇక రాహువు మాత్రం వ్యయ స్థానంలో పాపి.
ఈరీత్యా చూస్తే వీరికి మే నుండి అన్ని విధాలా అనుకూల సమయం.
ఆదాయవ్యయాలలో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆర్థికంగా ఎప్పుడూ లేనంతగా బలపడతారు.
ఇతరుల నుండి రావలసిన సొమ్ములు అనూహ్యంగానే వస్తాయి.
ఇంత కాలం ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు పటాపంచలై ఊరట చెందుతారు.
జీవిత గమ్యాన్ని సరైన దిశగా నడిపించే విధంగా ఒకరు మార్గదర్శనం చేస్తారు.
మనోబలం పెరిగి బుద్ధికుశలతతో కార్యక్రమాలను పూర్తి చేస్తారు.
ఎప్పటికప్పుడు ఆర్థిక, మనోబలాన్ని అంచనా వేసుకుంటూ ముందడుగు వేస్తారు.
మీ నిజాయితీ, సన్మార్గ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు.
అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది.
అలాగే భార్యాపుత్రుల ద్వారా ఆనందదాయంగా గడుస్తుంది.
మీలోని నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చే సమయం.
ఆస్తులు లేదా ఇళ్లు కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి.
విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు దక్కుతాయి.
అలాగే, స్థిరమైన ఆలోచనలతో సాగుతారు.
వ్యాపారస్తులు గతం కంటే మెరుగైన లాభాలను గడిస్తారు.
భాగస్వాములతో తగాదాలు తీరతాయి.
ఉద్యోగస్తుల విధుల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.
ఊహించని బదిలీలు, కొందరికి పదోన్నతులు రావచ్చు.
రాజకీయవేత్తలు కొన్ని కొత్త పదవులు పొందుతారు.
కళాకారులు మునుపటి కంటే అధికంగా అవకాశాలు దక్కించుకుంటారు.
వీరికి ప్రభుత్వం నుండి పుర స్కారాలు రావచ్చు.
శాస్త్రసాంకేతిక వర్గాలకు విశేష గుర్తింపు, ప్రశంసలు దక్కవచ్చు.
నిరుద్యోగులు ఎదురుచూస్తున్న అద్భుత అవకాశం లభిస్తుంది.
వ్యవసాయదారులు రెండుపంటలు లాభించి ఉత్సాహంగా గడుపుతారు.
రాహు ప్రభావం వల్ల తరచూ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు.
అలాగే, శత్రుబాధలు ఉండవచ్చు.
కార్తీకం, మార్గశిర మాసాలు మినహా మిగతా నెలలన్నీ సానుకూలమే.
వీరు దుర్గామాతకు అర్చనలు, స్తోత్రాలు పఠిస్తే మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఆదాయం–2, వ్యయం–8, రాజపూజ్యం–7, అవమానం–3.
వీరికి గురుడు మినహా మిగతా గ్రహాలు సానుకూలమై కనిపిస్తున్నాయి.
అయితే మే 1 నుండి జన్మరాశిలో గురు సంచారం వల్ల ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచిస్తారు.
మనస్సు చంచలంగా ఉంటుంది.
వ్యయం ఎక్కువగా కనిపించినా ఆదాయానికి ఇబ్బందులు రావు.
అలాగే, ఏప్రిల్‌లోగా శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉండవచ్చు.
గురు ప్రభావం వల్ల స్థాన మార్పులు, శారీరక అలసట, మానసిక అశాంతి. ఉండవచ్చు.
ఇక లాభస్థానంలో రాహువు సంచారం విశేష లాభదాయకం.
అనూహ్యంగానే కార్యక్రమాలు పూర్తి కాగలవు.
శత్రువులు కూడా మీవైపునకు ఆకర్షితులవుతారు.
న్యాయపరమైన చిక్కులు తొలగి ఊరట లభించే సమయం.
గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత నష్టం కలిగినా ఈ ఏడాది పూడ్చుకుంటారు.
భార్యాపుత్రులు, సోదరుల ద్వారా విశేష ప్రేమాదరణలు లభిస్తాయి.
యుక్తి, మనోనిబ్బరంతో కష్టనష్టాలను అధిగమిస్తూ నిలబడతారు.
దైవకార్యాలు, ఇతర సమాజసేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు.
మీ చేతులు మీదుగా ఒక సత్కార్యం జరగాల్సిన సమయం.
ఇంట్లో శుభకార్యాలకు సన్నద్ధమవుతారు.
విద్యార్థులు మేథస్సుతో ఉన్నత విద్యలలో ప్రవేశిస్తారు.
ఫలితాలు కూడా అనుకూలం.
వ్యాపారస్తులు విరివిగా లాభాలు గడించి సంస్థల వికేంద్రీకరణకు సిద్ధపడతారు.
ఉద్యోగస్తులు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా బెదరక సజావుగా నిర్వహిస్తారు.
ఎన్నడో నిలిచపోయిన ఇంక్రిమెంట్లు లేదా పదోన్నతులు దక్కవచ్చు.
పారిశ్రామికవేత్తలు, వైద్యరంగాల వారికి మరింత ప్రోత్సాహం, సహకారం లభిస్తాయి.
రాజకీయవేత్తలు కొంత కష్టపడ్డాక ఫలితం పొందుతారు.
శాస్త్రసాంకేతిక వర్గాల వారు అద్భుత ఆవిష్కరణలతో ప్రశంసలు అందుకుంటారు.
వ్యవసాయదారులకు అదికంగా పంటలు పండి అప్పులు తీరుస్తారు.
మహిళలకు సంవత్సరమంతా సానుకూలమే.
జ్యేష్ఠం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాలు మినహా మిగతావి శుభదాయంగా ఉంటాయి.
వీరు గురునికి పరిహారాలు చేసుకోవాలి. సెనగల దానం మంచిది.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఆదాయం–5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–6.
గురుని వ్యయస్థితి సంచారం కారణంగా అన్ని విషయాలలో అతిగా స్పందించి మాటపడతారు.
బంధువులు కూడా మీపట్ల అంతగా మక్కువ చూపరు.
ఇంట్లో వాతావరణం కూడా కొంత గందరగోళంగా ఉండవచ్చు.
భార్యాపుత్రులకు కూడా సర్దిచెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది.
అయితే ఇంట్లో శుభకార్యాల పరంపర ప్రారంభమవుతుంది.
భాగ్యస్ధితిలో శని సంచారం వల్ల కొంత ఆస్తిని వ్యయం చేస్తారు.
దశమ రాహువు కారణంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
జ్ఞాన సముపార్జన పై ఆసక్తి చూపుతారు.
అలాగే, ప్రశాంత వాతావరణం కోరుకుంటారు.
సంఘంలో గౌరవానికి ఎటువంటి ఇబ్బంది రాదు.
సంవత్సరమంతా ఆదాయానికి మించిన ఖర్చులు ఉండవచ్చు.
ఈ కాలంలో ఉద్యోగులు కోరుకుని బదిలీలు చేయించుకోవడం మంచిదికాదు.
వ్యాపారస్తులు ఎప్పటికప్పుడు లాభనష్టాలు బేరీజు వేసుకుంటూ ఉండాలి.
అయితే గురుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వక్రగతి కారణంగా మంచి ఫలితాలు సాధిస్తారు.
ఇంటి నిర్మాణాలు చేపట్టే వారికి శుభదాయకం.
వ్యాపారస్తులు క్రమేపీ సంస్థలను విస్తరిస్తూ లాభాలు గడిస్తారు. పెట్టుబడులకు కూడా వెనుకంజ వేయరు.
ఉద్యోగులకు విధి నిర్వహణలో సరైన న్యాయం జరిగే సమయం. వీరి పట్ల పై స్థాయి అధికారులు ఆదరణ చూపుతారు.
పారిశ్రామికవేత్తలకు ఊహించని సాయం, అనుమతులు లభిస్తాయి.
కళాకారులు ఎడాపెడా అవకాశాలు సాధిస్తారు.
రాజకీయవేత్తలకు కొన్ని కొత్త పదవులు రావచ్చు. అయితే, ప్రథమార్థంలో మాత్రం కొంత ఇబ్బందిపడతారు.
వ్యవసాయదారులు మొదటి పంటలో సంతృప్తికర లాబాలు ఆర్జిస్తారు.
మహిళలకు శుభదాయకంగా ఉన్నా కొన్నిసందర్భాలలో మనోబలం తగ్గుతుంది.
వీరికి జ్యేష్ఠం, భాద్రపదం, ఆశ్వయుజం, పుష్యమాసాలు మినహా మిగతా నెలలు అనుకూలమైనవి.
వీరు గురుని, శనికి పరిహారాలు చేయించుకుంటే మేలు.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం–14, వ్యయం –2, రాజపూజ్యం–6. అవమానం–6.
వీరికి గురుబలం విశేషంగా ఉంటుంది.
ఆదాయానికి ఇంతకాలం పడిన అవస్థలు తీరతాయి.
పెండింగ్‌బాకీలు సైతం వసూలవుతాయి.
అధిక ఖర్చులకు వెనుకడుగు వేస్తారు.
సంఘంలో గౌరవప్రతిష్ఠలు, సత్కారాలు పొందుతారు.
భార్యాపుత్రులు, బంధువులు సహాయసహకారాలు అందిస్తారు.
అవివాహితులకు వివాహకాలం.
ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తారు.
ఎనలేనిసౌఖ్యం, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
మీరు అనుకున్నదే జరగడం విశేషం.
నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం లభిస్తుంది.
ఇతరుల మెప్పు కోసం మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు.
భాగ్యస్థానంలో రాహు సంచారం వల్ల మానసికంగా కొంత ఆందోళన.
ఇతరులతో మాటపడడం, ఆస్తులు కొనుగోలులో ప్రతిబంధకాలు రావచ్చు.
అయితే భగవంతుని పై విశ్వాసం ఉంచి ముందడుగు వేయండి.
ఇక అష్టమ శని,కుజుల ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, కొందరికి శస్త్రచికిత్సలు అవసరం కావచ్చు.
అయితే మీకష్టం వృథా కాదు. ఎవరినీ నొప్పించకుండా మీ పని మీరు చేసుకుని వెళతారు.
ఎటువంటి వివాదాలనైనా వేరేవారి జోక్యంలేకుండా పరిష్కరించుకుంటారు.
వ్యాపారస్తులు భాగస్వాములతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. అలాగే, నష్టాలు అ«ధిగమిస్తారు.
ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభించవచ్చు. ఆత్మవిశ్వాసం పెరిగి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
పారిశ్రామికవేత్తలు, వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల నుండి వీరికి పిలుపు రావచ్చు.
కళాకారులు కొత్త అవకాశాలపై సంతకాలు చేస్తారు.
రాజకీయవేత్తలు కొన్ని సమస్యలు ఎదురైనా లెక్కచేయక విజయాల బాటలో నడుస్తారు.
వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి.
మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం దక్కుతుంది.
చైత్రం, ఆషాఢం, ఆశ్వయుజం, పుష్య మాసాలు మినహా మిగతావి విశేషంగా కలసివస్తాయి.
వీరు శనికి, కుజునికి పరిహారాలు చేయాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఆదాయం–2, వ్యయం–14, రాజపూజ్యం–2, అవమానం–2.
వీరికి గురువు దశమ స్థానంలో సంచారం గోచారరీత్యా ప్రతికూలమైనప్పటికీ మూర్తిమంతంచేత శుభదాయకుడు.
సప్తమ శని, అష్టమ రాహువు, ద్వితీయ కేతువులు దోషకారులే.
మొత్తానికి వీరికి ద్వితీయార్థంలో గురు ప్రభావం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ఆర్థికంగా కొంత కూడబెట్టినా ఏదో ఖర్చు ఎదురవుతునే ఉంటుంది.
పొదుపు చేయాలన్న కోరిక ఫలించదు.
నమ్మినవారే మిమ్మల్ని వంచించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఎవరి విషయాలలోనూ జోక్యం చేసుకోకుండా మీ జీవనం సాగించడం ఉత్తమం.
కుటుంబంలో కొన్ని సమస్యలు నెలకొని అగ్నిపరీక్షగా మారవచ్చు.
అయితే గురుడు కొంత యోగాన్నిస్తాడు . కొన్ని ఇబ్బందుల నుండి గట్టెక్కే ఉపాయం తడుతుంది.
ఇక ఆస్తులు కొనుగోలుకు ఎంతోకాలంగా చేస్తున్న యత్నాలు కలిసివస్తాయి.
రాహు ప్రభావం వల్ల ఆరోగ్యం ముఖ్యంగా నరాలు, ఎముకలు, చర్మ సంబంధింత వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు. పెద్ద వైద్యులను సంప్రదిస్తారు.
నేర్పు,సహనం, పట్టుదలే మీకు ప్రధానాస్త్రాలుగా ఉపయోగపడతాయి.
కొన్ని కష్టాలు ఎదురయ్యే సమయానికి ఆపద్బాంధువుడిలా ఒకరు సాయం అందిస్తారు.
ఎవరేమన్నా మౌనమే సమాధానం కావాలి.తొందరపాటు వద్దు.
వ్యాపారస్తులు కొంతమేర లాభాలు గడించినా అవి పెట్టుబడులకే సరిపోతాయి.
ఉద్యోగస్తులకు విధి నిర్వహణ మొదట్లో కష్టమైనప్పటికీ క్రమేపీ దూసుకుపోతారు. ఇంక్రిమెంట్లు విషయంలో ఇబ్బందులు.
పారిశ్రామికవేత్తలు, వైద్యులకు కొన్ని వ్యవహారాలు ఎట్టకేలకు సానుకూలమవుతాయి.
కళాకారులు కొన్ని అవకాశాలను పెండింగ్‌లో పెడతారు.
విద్యార్థులు మరింత కష్టపడితే అనుకున్నది సా«ధిస్తారు.
వ్యవసాయదారులు రెండవ పంటను పుష్కలంగా పొందుతారు.
మహిళలు ఆత్మవిశ్వాసం పెంచుకుని ముందడుగు వేయడం మంచిది.
ఆశావాదంతో ముందుకు సాగుతారు.
చైత్రం, వైశాఖ మాసాలు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిగతావి సామాన్యంగా ఉంటాయి.
వీరు గురు, శని, రాహు,కేతువులకు పరిహారాలు చేయాలి.
శ్రీ నృసింహ స్తోత్రాలు పఠనం ఉపయుక్తంగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆదాయం–5, వ్యయం–5, రాజపూజ్యం–5, అవమానం–2.
వీరికి ఈ సంవత్సరమంతా ఉత్సాహంగా సాగుతుంది. అష్టమ గురు దోషం మే 1 నుండి తొలగిపోయి శుభాలు కలుగుతాయి.
మీలోని ప్రతిభావంతున్ని బయటకు తీస్తారు.
ఉన్నత చదువులకు యత్నాలు సఫలమవుతాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలన్న విద్యార్థుల కోరిక నెరవేరవచ్చు.
ఆదాయవ్యయాలు సమానంగా ఉన్నప్పటికీ ఎటువంటి లోటు లేకుండా విలాస జీవనం సాగిస్తారు.
ఆరోగ్య సమస్యలు క్రమేపీ తొలగి ఊరట లభిస్తుంది.
ఎంతో నేర్పుగా సమస్యలు అధిగమించి సత్తా చాటుకుంటారు.
శని సంచారం కూడా అనుకూలమే. మానసిక వేదనను తొలగించి ఆనందాన్నిస్తాడు.
సొంత ఇంటి కల నెరవేరేందుకు ఇదే సమయం.
నిరుద్యోగులు ఊహించని ఉద్యోగాలు సాధిస్తారు.
కొందరి పరిచయంతో వారు మీపట్ల సానుకూల వైఖరి చూపుతారు.
కొన్ని సంఘాలకు, శాఖలకు ఆధిపత్యం దక్కుతుంది.
భార్యాపుత్రులు, బంధువులతో అనుబంధం మరింత పెరుగుతుంది.
వివాహయత్నాలు సాగించే వారికి శుభదాయకం ఉంటుంది.
ఎప్పటికప్పుడు మీ ఆలోచనల వల్ల కలిగే ఫలితాలు బేరీజువేసుకుంటూ ముందుకు సాగండి.
శాస్త్రసాంకేతిక వర్గాల దీర్ఘకాల కల ఫలిస్తుంది. వీరికి విశేష ఆదరణ లభిస్తుంది.
వ్యాపారస్తులు మరింత లాభపడతారు. భాగస్వాములు కూడా మీ నిర్వహణ పట్ల సంతృప్తి చెందుతారు.
ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. అలాగే, వీరి సేవలకు తగిన పురస్కారాలు స్వీకరిస్తారు.
పారిశ్రామికవేత్తలు, వైద్యులకు ఊపిరిసలపని విధంగా వ్యవహారాలు ఉంటాయి.
రాజకీయవేత్తలు విజయాల వైపు పయనిస్తారు. అలాగే, పదవుల వేటలో విజయం సాధిస్తారు.
వ్యవసాయదారులు రెండు పంటలూ లాభించి కాస్త ఊరట చెందుతారు.
మహిళలకు మనోనిబ్బరం, ఆత్మవిశ్వాసం పెరిగి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
చైత్రం, శ్రావణం, ఆశ్వయుజం, పుష్యమాసాలు మినహా మిగతావి శుభదాయకంగా నడుస్తాయి.
వీరు శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకుంటే ఉత్తమం.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆదాయం–2, వ్యయం–8. రాజపూజ్యం–1, అవమానం–5.
వీరికి గురువు మే 1వ తేదీ నుండి అష్టమ స్థానంలో సంచారం కొంత సానుకూల, ప్రతికూల ఫలితాలు ఇస్తాడు.
ఇక శని, రాహుకేతువుల సంచారం అనుకూలం.
ఒక వైపు శుభఫలితాలు ఉత్సాహాన్నిస్తుంటే మరోవైపు ప్రతికూల ఫలితాలతో డీలా పడతారు.
తండ్రి నుండి ఆస్తి సంక్రమించే అవకాశాలున్నాయి. అలాగే, కోర్టులో ఉన్న వివాదం సమసిపోయే సూచనలు.
పరిశోధనలు వృద్ధిపథంలో సాగుతుంటే మరోవైపు అప్పులు, అడ్డంకులు, విపత్తులు సవాలుగా మారతాయి.
జీవనం సజావుగా సాగేందుకు తగిన ప్రణాళికతో ముందుకు నడవాలి.
ఏ మాత్రం తొందరపడ్డా ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువగా శ్రద్ధ చూపుతారు.
విద్యార్థులకు చదువుల్లో ఉన్నతి, విదేశాలకు వెళ్లాలన్న సంకల్పం నెరవేరుతుంది.
మీకు రావలసిన సొమ్ము విషయంలో కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి.
తరచూ ప్రయాణాలు చేస్తూ అలసట చెందుతారు.
ఆర్థికంగా కొంత అస్థిరత ఉంటుంది. అయినా ఎటువంటి లోటు లేకుండా జాగ్రత్తపడతారు.
వ్యాపార విషయాలలో ఆకస్మిక సంఘటనలు ఎదురవుతాయి. దీంతో సందిగ్ధంలో పడతారు.
అలాగే, ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్య పరిరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
శని అనుకూల ప్రభావంతో వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌నెలల్లో గురుని అష్టమస్థితి వక్రగతి వల్ల ఆరోగ్యం కొంత క్షీణించవచ్చు. అలాగే, ధనం కోసం అన్వేషణ. రాహుకేతువుల వల్ల విశేష గౌరవమర్యాదలు పొందుతారు. ద్వితీయార్థంలో వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.
పారిశ్రామికవేత్తలు కొన్ని పరిశ్రమలకు శ్రీకారం చుడతారు.
శాస్త్రసాంకేతిక వర్గాల ఆశలు ఫలిస్తాయి.
రాజకీయవేత్తలకు మునుపటి కంటే మెరుగ్గా ఉండి గుర్తింపు పొందుతారు.
కళాకారులు కోరుకున్న అవకాశాలు దక్కించుకునే వరకూ నిద్రపోరు.
వ్యవసాయదారులకు రెండుపంటలూ ఆశాజనకంగా ఉంటాయి.
మహిళలు కోపాన్ని జయించి శాంతిదిశగా అడుగులు వేస్తారు.
వైశాఖం, మాఘ మాసాలు మినహా మిగతావి సానుకూలమైనవే.
వీరు గురువు కి పరిహారాలు చేయించడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం–8,వ్యయం–14, రాజపూజ్యం–4, అవమానం–5.
వీరికి అర్థాష్టమ శని దోషం ఉన్నప్పటికీ కుంభరాశిలో సంచారం వల్ల అప్పుడప్పుడు శుభత్వాన్నిస్తాడు. అలాగే, మే 1వ తేదీ నుండి గురుడు సప్తమరాశిలో సంచారం శుభదాయకం. ఇక రాహుకేతువులు పంచమ, లాభ స్థానాలలో సంచారం సామాన్యంగా ఉంటుంది.
వీరికి ఆర్థిక విషయాలలో ఎదురుండదు. ఎటువంటి ఖర్చునైనా అధిగమించగలుగుతారు.
కుటుంబంలో గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.
మీ ఆశయాలు మంచివైనా వాటి సాధనలో కొందరు మోకాలడ్డుతారు.
అయినా పట్టుదల వీడకండి.
ఆస్తులు సమకూర్చుకోవడంలో నెలకొన్న స్తబ్ధత తొలగి ఊపిరిపీల్చుకుంటారు.
ఉద్యోగార్ధుల యత్నాలు కలసివస్తాయి.
దీర్ఘకాలికంగా నడుస్తున్న న్యాయపరమైన వివాదాలు కొలిక్కి వచ్చే సూచనలు.
భవిష్యత్తు అవసరాలను గుర్తెరిగి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుంటారు.
విద్యార్థులకు శ్రమానంతరం మంచి ఫలితాలు కనిపిస్తాయి.
అలాగే, ఇంటి నిర్మాణం, తల్లి ఆరోగ్యం వంటి విషయాలలో కొంత ఆదుర్దా కనిపిస్తుంది.
సంతానం విద్య, ఉద్యోగ విషయాలు కొంత ఆందోళనకు గురిచేస్తాయి.
ఊహించని వ్యక్తుల పరిచయాలు మీకు ఎంతో సహకరిస్తాయి.
ఒక సమాచారం కొన్ని మార్పులకు కారణమవుతుంది.
నవంబర్‌నెలలో వాహనాలు నడిపే వారు మరింత అప్రమత్తత పాటించాలి.
వ్యాపార సమృద్ధి. గతంలో లేని లాభాలు పొందుతారు.
ఉద్యోగస్తులు ఆశలు వదులుకున్న ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలున్నాయి. అలాగే, వీరు విధుల్లో సమర్థతను నిరూపించుకుంటారు.
రాజకీయవేత్తలకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు.
పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల కృషి సఫలీకృతమవుతుంది.
కళాకారులు రెండుమూడు అవకాశాలు లభించి అగ్రిమెంట్లు చేసుకుంటారు. మరుగునపడిన వారికి గుర్తింపు లభిస్తుంది.
వ్యవసాయదారుల ఆశలు ఫలించి రెండు పంటలూ అనుకూలిస్తాయి. అయితే పెట్టుబడుల విషయంలో కొంత ఆందోళన తప్పదు.
మహిళలకు కొన్ని సమస్యల నుండి విముక్తి.
వైశాఖం, కార్తీకం, పుష్యమాసాలు మినహా మిగతావి విశేషంగా కలసివస్తాయి.
వీరు శనీశ్వరునికి పరిహారాలు చేయడం, చండీ పారాయణ మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–7, అవమానం–5.
వీరికి ప్రథమార్ధంలో విశేషంగా కలిసి వస్తుంది.
ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు తట్టుకుని మనోబలం పెంచుకుని ముందడుగు వేస్తారు.
గురుని షష్ఠమస్థితి, రాహువు అర్థాష్ఠమస్థితి వల్ల ఆరోగ్యంపై శ్రద్ద చూపడం మంచిది.
ఆర్థికంగా కొంత వెనుకబడ్డా ఏ అవసరానికైనా లోటు రాదు.
తృతీయంలో శని, కుజుల వల్ల సోదరులతో సత్సంబంధాలు.
భూ సంబంధిత వివాదాలను పరిష్కరించుకోవడం వంటి ఫలితాలు ఉంటాయి.
ఇతరుల మెప్పు కోసం కాకుండా మీకు ఉపయోగమైన నిర్ణయాలు తీసుకోండి.
భార్యాపుత్రుల నుండి మీకు సంపూర్ణ సహకారం అందుతుంది.
కుటుంబంలో ఎటువంటి అరమరికలు లేకుండా ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెబుతారు.
ఇంటి నిర్మాణాల పై నిర్ణయాలు తీసుకుని ఆ దిశగా కదులుతారు.
విద్యార్థులకు వైద్యవిద్యావకాశాలు లభించే అవకాశాలున్నాయి.
ఇక అక్టోబర్‌నుండి జనవరి మధ్యకాలంలో గురుని వక్రస్థితి వల్ల శుభకార్యాల నిర్వహణ, సంతానసౌఖ్యం, ఆకస్మిక ధనలబ్ధి .
వ్యాపారస్తులు స్వశక్తిని నమ్ముకుని అభివృద్ధి వైపు నడుస్తారు. తద్వారా లాభాలు గడిస్తారు.
ఉద్యోగస్తులకు ఉన్నతవర్గాలలో మంచి గుర్తింపు, సహకారం లభిస్తాయి. వీరి సేవలను మరింత వినియోగించుకుంటారు.
రాజకీయవేత్తలు మునుపటి కంటే కొంత మెరుగైన అవకాశాలు దక్కించుకుంటారు.
కళాకారులకు వద్దంటే అవకాశాలు అన్నట్లుగా ఉంటుంది. అయితే ఒక చిన్న పొరపాటు వల్ల కొంత ఆందోళన తప్పదు.
పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్‌వేర్‌రంగాల వారు మరింత ప్రగతిని సాధిస్తారు.
వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట లాభసాటిగా ఉంటుంది.
మహిళల ఆశలు నెరవేరతాయి.
మార్గశిరం, పుష్యమాసాలు మినహా మిగతావి శుభదాయకం.
వీరు గురునికి, రాహువునకు పరిహారాలు చేయడం ఉత్తమం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ఆదాయం–14, వ్యయం–14. రాజపూజ్యం–3, అవమానం–1.
మే 1వ తేదీ నుండి గురుని పంచమకోణస్థితి అత్యంత శుభదాయకం. అలాగే, ఏల్నాటిశని నడుస్తున్నా మూర్తిమంతం చేత సువర్ణమూర్తి కావడం అనుకూలం. రాహుకేతువులు కూడా శుభకారకులే.
వీరు తలచిన ఏ పనీ కూడా జాప్యం లేకుండా పూర్తి కాగలదు.
ఆర్థిక విషయాలు మునుపటి కంటే మరింత మెరుగుపడి ఉన్నతికి చేరుకుంటారు. అయితే వివిధ రూపాలలో ఖర్చులు కూడా ఎదురవుతాయి.
ఇతరులకు చేయూతనివ్వడంలో ముందడుగు వేస్తారు.
సొంత ఆలోచనలే అమలు చేసి విజయాలు సా«ధిస్తారు.
వివాహాది శుభకార్యాలు, సంతాన సౌఖ్యం వంటి ఫలితాలు ఉంటాయి.
సోదరులు మీతో ఆస్తుల వ్యవహారంలో అంగీకారానికి వస్తారు.
విద్యార్థులకు విదేశీ విద్యలు, ఉద్యోగాలు దక్కుతాయి.
మీ మధ్యవర్తిత్వం కోసం బంధువులు ఎదురుచూస్తుంటారు.
ఎవరినీ నొప్పించని రీతిలో నిర్ణయాలు తీసుకుని ప్రశంసలు అందుకుంటారు.
ఇంటి నిర్మాణ కల నెరవేరే సమయం.
అలాగే, పెద్దవాహనాలు కొనుగోలు చేస్తారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు.
శని ప్రభావం వల్ల కొంత ఆరోగ్యంపై ప్రభావం పడొచ్చు. అలాగే కొందరికి శస్త్ర చికిత్సలకు అవకాశం.
వ్యాపారస్తులు ఇబ్బడిముబ్బడిగా లావాదేవీలు నడిపించి లాభాలు పొందుతారు.
ఉద్యోగస్తులు బాధ్యతలు నిర్వహించడంలో అప్రమత్తత పాటించడం ద్వారా గుర్తింపు పొందుతారు.
శాస్త్ర సాంకేతిక వర్గాల వారు కొత్త పరిశోధనల ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తారు.
రాజకీయవేత్తలకు పదవీయోగం, న్యాయపరమైన వివాదాల నుండి విముక్తి.
పారిశ్రామికవేత్తలు, వైద్యులు ఆత్మవిశ్వాసంతో కార్యాలను చక్కదిద్దుతారు.
కళాకారులకు అవకాశాలకు లోటు ఉండదు. కొందరికి అవార్డులు సైతం రావచ్చు.
వ్యవసాయదారులు రెండుపంటలూ అనుకూలించి ఉత్సాహంతో గడుపుతారు.
మహిళలకు మానసికంగా మరింత బలం చేకూరుతుంది.
చైత్రం, ఆషాఢం, ఆశ్వయుజ మాసాలు మినహా మిగతావి మరింత అనుకూలం.
వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామికి అర్చనలు చేయడం ఉత్తమం.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆదాయం–14, వ్యయం–14, రాజపూజ్యం–6, అవమానం–1.
వీరికి ఆదాయవ్యయాలు సమానస్థాయిలో ఉంటాయి.
గురువు మే 1వ తేదీ నుండి చతుర్ధంలో సంచారం వల్ల ఆర్ఖికంగా బలపడడానికి కఠోర పరిశ్రమ చేయాల్సి ఉంటుంది.
శని జన్మరాశి సంచారం మానసిక ఒత్తిడులు, వ్యయప్రయాసలు కలిగిస్తుంది.
అలాగే, రాహు కేతువులు కూడా సామాన్యమైన ఫలితాలే ఇస్తారు.
ఈరీత్యా వీరు ఖర్చుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడం ఉత్తమం.
తల్లి లేదా ఆమె తరపు వారితో విరోధాలు.
విద్యార్థులకు శ్రమానంతరం అనుకూల ఫలితాలు రావచ్చు.
ఉద్యోగార్దుల యత్నాలు కొలిక్కి వచ్చే సమయంలో న్యాయపరమైన ఆటంకాలు ఎదురవుతాయి.
అయితే శని శ్రమానంతరం కొన్ని అనుకూల ఫలాలు ఇస్తాడు.
ఉన్నత హోదాల వారితో పరిచయాలను పెంచుకుంటారు.
పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఇంటి నిర్మాణ యత్నాలు ద్వితీయార్థంలో నెరవేరతాయి.
ఈ రాశి వారికి ఏల్నాటి శని వివాహయత్నాలు సానుకూలం చేస్తాడు.
కుటుంబంలో మాటల తొందరపాటు కాకుండా సంయమనంతో మెలగడం ఉత్తమం.
కొన్ని వ్యవహారాలు మీరే స్వయంగా పూర్తి చేస్తారు.
ఆరోగ్యపరమైన సమస్యలతో వైద్యసలహాలు పొందుతారు.
బంధువులతో సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించండి.
ఒక సందర్భంలో కాస్త సమస్యలు, ఇబ్బందులు ఎదురై కుదుపునకు గురవుతారు. అయితే ఆత్మబలమే మీకు తోడ్పడుతుంది.
శాస్త్రసాంకేతిక వర్గాల కృషి ఫలించి ఉన్నతికి చేరుకుంటారు.
వ్యాపారస్తులు క్రమేపీ లాభాల బాటపడతారు. పెట్టుబడులు, భాగస్వాములు కూడా పెరుగుతారు.
ఉద్యోగస్తులకు బదిలీ సూచనలు, ద్వితీయార్థంలో విశేష గుర్తింపు లభిస్తుంది.
పారిశ్రామికవేత్తలు, వైద్యులు సేవలు విస్తృతం చేసి సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
రాజకీయవేత్తలకు పదవులు దక్కినా కొంత అసంతృప్తితోనే గడుపుతారు.
కళాకారులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు.
వ్యవసాయదారులకు రెండోపంట కలసివస్తుంది.
మహిళలకు మనోనిబ్బరం పెరిగి తదనుగుణంగా ముందుకు సాగుతారు.
చైత్రం, ఆషాఢం, భాద్రపద మాసాలు తప్ప మిగతావి సానుకూలం.
వీరు శనీశ్వరునికి, రాహుకేతువులకు పరిహారాలు చేయాలి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం –11, వ్యయం–5, రాజపూజ్యం–2, అవమానం–4.
వీరికి గురువు మే 1 నుండి తృతీయ రాశిలో సంచారం, శని వ్యయస్థితి, జన్మరాహువు, సప్తమంలో కేతువు సంచారం నామమాత్రంగా ఉంటుంది.
వీరు అన్నింటా తగు జాగ్రత్తలు పాటిస్తూ దైవాన్ని స్మరిస్తూ ముందుకు సాగడం మంచిది.
ఆర్థిక విషయాలు గందరగోళంగా మారి అవసరాలకు కూడా ఇబ్బందిపడాల్సి వస్తుంది.
ఇతరుల వ్యవహారాలలో జోక్యం ద్వారా మాటపడతారు.
ఎవరినీ అతిగా విశ్వసించకుండా మీ ఆలోచనల మేరకు అడుగులు వేయడం మంచిది.
ఆరోగ్యం పై తగు జాగ్రత్తలు పాటిస్తూ , ఎప్పటికప్పుడు వైద్య సలహాలు స్వీకరిస్తూ ఉండాలి.
కుటుంబంలో మీ మాటంటే అంతగా పట్టించుకోని వైనం.
ఏ వ్యవహారం చేపట్టాలన్నా ధైర్యం చాలక వెనుకడుగు వేస్తారు.
జన్మరాహువు కారణంగా శత్రుబాధలు, మానసిక ఒత్తిడులు పెరుగుతాయి.
భార్యాపుత్రులతోనూ వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకునే విధంగా యత్నిస్తారు.
అయితే ఆత్మవిశ్వాసం పెంచుకుని పట్టుదల, నేర్పుగా సాగితే కొన్ని సమస్యలు అధిగమిస్తారు.
ఇంటి నిర్మాణాలను మధ్యలో నిలిపివేసే అవకాశం.
సోదరీసోదరులతో సత్సంబంధాలు దెబ్బతినకుండా తగు విధంగా నడుచుకోవడం మంచిది.
విద్యార్థులు ఎంత కష్టించినా ఫలితం కొంత నిరాశ కలిగిస్తుంది.
వ్యాపారస్తులు గతం కంటే లాభాలు తగ్గి ఆందోళన చెందుతారు.
ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల బెదిరింపులు, పనిలో భారం సవాలుగా మారవచ్చు.
పారిశ్రామికవేత్తలు, వైద్యులు సహనంతో ఉంటే కొంత అనుకూలత పొందుతారు.
కళాకారులు అందివచ్చిన అవకాశాలు సైతం వదులుకుంటారు. అలాగే, కొన్ని అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటారు.
వ్యవసాయదారులకు పంటలు సాధారణ స్థాయిలో ఉంటాయి. పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు.
మహిళలు మానసిక ఆందోళనతో గడుపుతారు.
చైత్రం, ఆశ్వయుజం, పుష్యమాసాలు సామాన్యంగా, మిగతావి మిశ్రమంగా ఉంటాయి.
వీరు నిత్యం ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించడం మంచిది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
Ugadi rasi phalalu 2024 content by Vakkantham Chandramouli’s Janmakundali.com